Nandyal Solar Project: నంద్యాలలో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు ఒప్పందం
నంద్యాల జిల్లాలో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు కోసం యాక్సిస్ ఎనర్జీ, లుమారా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. 2027లో ప్రారంభం లక్ష్యం.
Nandyal Solar Project
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. నంద్యాల జిల్లాలో 400 మెగావాట్ల సామర్థ్యంతో యుటిలిటీ స్కేల్ సోలార్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు యాక్సిస్ ఎనర్జీ, లుమారా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి.
భారత్‌లో బ్రూక్‌ఫీల్డ్ ప్రారంభించిన పునరుత్పాదక ఇంధన ప్లాట్‌ఫామ్ లుమారాతో యాక్సిస్ ఎనర్జీ ఈ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. నంద్యాల జిల్లాలోని నందిపాడు గ్రామంలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు.
పూర్తి ఈపీసీ బాధ్యతలు యాక్సిస్ ఎనర్జీవే
ఈ ప్రాజెక్టులో సోలార్ ప్లాంట్‌కు సంబంధించిన పూర్తి ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (EPC) పనులను యాక్సిస్ ఎనర్జీ చేపట్టనుంది. ప్రాజెక్టులో భాగంగా 400 కేవీ పూలింగ్ సబ్‌స్టేషన్ (PSS), దానికి అనుసంధానమైన 400 కేవీ ట్రాన్స్‌మిషన్ లైన్‌ను కూడా సంస్థ అభివృద్ధి చేయనుంది.
ఈ ట్రాన్స్‌మిషన్ లైన్ ద్వారా ప్రాజెక్టు నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను కర్నూలు III CTUIL సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేయనున్నారు. తద్వారా విద్యుత్‌ను జాతీయ గ్రిడ్‌కు సాఫీగా తరలించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.
2027లో ప్రాజెక్టు ప్రారంభ లక్ష్యం
నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఈ 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును 2027 క్యాలెండర్ ఇయర్‌లోనే పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీలు వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచే దిశగా ఈ ప్రాజెక్టు కీలకంగా మారే అవకాశం ఉంది. భారీ స్థాయి సౌర విద్యుత్ ఉత్పత్తితో పాటు విద్యుత్ ప్రసార మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్ర క్లీన్ ఎనర్జీ రంగానికి ఇది మరింత ఊతమివ్వనుంది.




