Amazon: అమెజాన్‌లో భారీ లేఆఫ్స్.. 14,000 మంది తొలగింపు?
Amazon: ఐటీ రంగంలో లేఆఫ్స్ కల్లోలం కొనసాగుతోంది. అమెజాన్ తాజాగా 14,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.
Amazon: అమెజాన్‌లో భారీ లేఆఫ్స్.. 14,000 మంది తొలగింపు?
Amazon: ఐటీ రంగం.. లక్షలాది మంది యువత కల. ఏసీ గదులు, లక్షల్లో జీతాలు, విలాసవంతమైన జీవితం.. ఇదీ సామాన్యుడి కంట పడే ఐటీ చిత్రం. కానీ, గడిచిన రెండేళ్లుగా ఆ కలల పునాదులు కదులుతున్నాయి. ఎప్పుడు ఏ ఈమెయిల్ వస్తుందో, ఎప్పుడు పింక్ స్లిప్ చేతికి అందుతుందో తెలియక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తీసుకోబోతున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.
14 వేల మంది ఇంటికే?
ఒరాకిల్ సంస్థ 30 వేల మందిపై వేటు వేసిన షాక్ నుంచి కోలుకోకముందే, అమెజాన్ సైతం భారీ లేఆఫ్స్ కు సిద్ధమైందనే వార్త ఐటీ వర్గాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఆసియా బిజినెస్ అవుట్‌లుక్ నివేదిక ప్రకారం.. వచ్చే నెలలోనే సుమారు 14,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని అమెజాన్ భావిస్తోంది. ముఖ్యంగా ఈ ప్రభావం అమెజాన్ వెబ్ సర్వీసెస్ , రిటైల్ విభాగం, హ్యూమన్ రిసోర్స్ విభాగాలపై ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై సంస్థ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, గతాన్ని చూస్తే ఈ భయాలు నిజమేననిపిస్తోంది. 2025లో 14 వేల మందిని, 2026 ప్రారంభంలోనే మరో 16 వేల మందిని తొలగించిన అమెజాన్, ఇప్పుడు మూడోసారి కత్తి దూయడం ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది.
దిగ్గజాల బాటలో..
కేవలం అమెజాన్ మాత్రమే కాదు, మైక్రోసాఫ్ట్, టీసీఎల్, యాక్సెంచర్, ఒరాకిల్ వంటి అగ్రశ్రేణి సంస్థలు కూడా ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఒకప్పుడు తమ వద్ద పనిచేసే వారిని ఆస్తులుగా భావించిన ఈ సంస్థలు, ఇప్పుడు వారిని భారంగా భావిస్తూ ఇంటికి పంపుతున్నాయి. ఏఐ రాకతో పాత పద్ధతుల్లో పనిచేసే ఉద్యోగుల అవసరం తగ్గుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వల్ల కంపెనీలు తమ లాభాలను కాపాడుకోవడానికి ఖర్చులను తగ్గిస్తున్నాయి. కరోనా సమయంలో అవసరానికి మించి సిబ్బందిని నియమించుకున్న కంపెనీలు, ఇప్పుడు డిమాండ్ తగ్గడంతో వారిని తొలగిస్తున్నాయి.
ఒకప్పుడు ఐటీ కొలువు అంటే జీవితం సెటిల్ అయినట్లే అనుకునేవారు. కానీ ఇప్పుడు అది ఒక అనిశ్చిత ప్రయాణంగా మారింది. ప్రతిభ ఉన్నప్పటికీ, కంపెనీల లెక్కల్లో ఒక నెంబర్‌గా మారిపోవడం ఉద్యోగులను కుంగదీస్తోంది. అమెజాన్ వంటి దిగ్గజాలే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే, చిన్న కంపెనీల పరిస్థితి ఏంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏది ఏమైనా, టెక్ ప్రపంచంలో వీస్తున్న ఈ లేఆఫ్‌ల గాలి ఎప్పుడు శాంతిస్తుందో వేచి చూడాలి.


