Adani: సంక్షోభ సమయంలోనూ ఆదానీ గ్రూప్ సక్సెస్.. ఈ రంగాల్లో సరికొత్త రికార్డులు
Adani: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకానమిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) 2026 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన ఫలితాలు కంపెనీ స్థిరమైన వృద్ధిని స్పష్టంగా చూపిస్తున్నాయి.
Adani: సంక్షోభ సమయంలోనూ ఆదానీ గ్రూప్ సక్సెస్.. ఈ రంగాల్లో సరికొత్త రికార్డులు
Adani: అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకానమిక్ జోన్ లిమిటెడ్ (APSEZ) 2026 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన ఫలితాలు కంపెనీ స్థిరమైన వృద్ధిని స్పష్టంగా చూపిస్తున్నాయి. పోర్టులు, లాజిస్టిక్స్, మెరైన్ సేవలు అన్నీ కలిసి కంపెనీని కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
FY26లో బలమైన ఆర్థిక ఫలితాలు
FY26లో APSEZ మొత్తం ఆదాయం రూ. 38,736 కోట్లకు చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 25 శాతం పెరుగుదల కావడం విశేషం. వడ్డీ, పన్నులు, ఆస్తుల విలువ తగ్గుదల లెక్కించకముందు కంపెనీ సంపాదించిన లాభం (EBITDA) రూ. 22,851 కోట్లకు పెరిగి 20 శాతం వృద్ధి సాధించింది. నికర లాభం రూ. 12,782 కోట్లుగా నమోదై 16 శాతం పెరిగింది. చివరి త్రైమాసికం (Q4)లో కూడా కంపెనీ మంచి ఫలితాలను నమోదు చేసింది. ఆ సమయంలో ఆదాయం రూ. 10,738 కోట్లు, EBITDA రూ. 6,020 కోట్లు, లాభం రూ. 3,308 కోట్లుగా ఉంది. ఈ ఫలితాలు కంపెనీ వ్యూహాలు సరిగా పనిచేస్తున్నాయని సూచిస్తున్నాయి.
500 MMT కార్గో హ్యాండ్లింగ్ – చరిత్రాత్మక ఘట్టం
APSEZ ఒకే ఏడాదిలో 500 మిలియన్ మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ కార్గోను హ్యాండిల్ చేసిన తొలి భారత సంస్థగా నిలిచింది. FY26లో మొత్తం కార్గో 500.8 MMTగా నమోదైంది. దేశవ్యాప్తంగా కంపెనీ మార్కెట్ షేర్ 27.1 శాతానికి చేరింది. ఈ స్థాయి కార్గో హ్యాండ్లింగ్ కంపెనీ సామర్థ్యంతో పాటు దేశంలో లాజిస్టిక్స్ రంగంలో దాని ప్రాముఖ్యతను చూపిస్తుంది.
వ్యాపార విభాగాల వారీగా వృద్ధి
దేశీయ పోర్టుల వ్యాపారం స్థిరంగా పెరుగుతూ ఆదాయంలో 13 శాతం వృద్ధి సాధించింది. ఈ విభాగంలో EBITDA మార్జిన్ 73.2 శాతానికి చేరడం కంపెనీ లాభదాయకతను చూపిస్తుంది. అంతర్జాతీయ పోర్టులు మరింత వేగంగా ఎదిగాయి. ఈ విభాగంలో ఆదాయం 34 శాతం పెరిగి, EBITDA భారీగా పెరిగింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, కొలంబో కార్యకలాపాల వల్ల ఈ వృద్ధి సాధ్యమైంది.
లాజిస్టిక్స్ విభాగంలో 55 శాతం వృద్ధి నమోదైంది. ట్రక్కింగ్ సేవలతో పాటు అంతర్జాతీయ ఫ్రైట్ నెట్వర్క్ విస్తరణ దీనికి ప్రధాన కారణం. మెరైన్ సేవలు అత్యంత వేగంగా పెరిగిన విభాగంగా నిలిచాయి. ఈ విభాగంలో ఆదాయం 134 శాతం పెరగడం, నౌకల సంఖ్య 136కి చేరడం కంపెనీ సముద్ర సేవల్లో కూడా బలంగా విస్తరిస్తోందని సూచిస్తోంది.
డివిడెండ్, పెట్టుబడులు, ఆర్థిక స్థితి
FY26కి సంబంధించి ఒక్కో షేర్‌కు రూ. 7.5 డివిడెండ్ ఇవ్వాలని బోర్డు ప్రతిపాదించింది. కంపెనీ ఈ ఏడాది రూ. 15,320 కోట్ల పెట్టుబడులు పెట్టింది, ఇది ముందుగా చెప్పిన గైడెన్స్ కంటే ఎక్కువ. మొత్తం అప్పు రూ. 55,103 కోట్లుగా ఉండగా, క్యాష్ బ్యాలెన్స్ రూ. 12,193 కోట్లు ఉంది. Net Debt/EBITDA 1.9xగా ఉండటం కంపెనీ అప్పు నిర్వహణ బలంగా ఉందని చూపిస్తుంది. అంతేకాకుండా, కంపెనీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి క్రెడిట్ రేటింగ్స్ కూడా లభించాయి.
భవిష్యత్ లక్ష్యాలు, వ్యూహం
FY27 కోసం కంపెనీ ఆదాయం రూ. 43,000 నుంచి రూ. 45,000 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తోంది. EBITDA రూ. 25,000 నుంచి రూ. 26,000 కోట్ల వరకు ఉండొచ్చని భావిస్తోంది. దీర్ఘకాలంలో, 2030 నాటికి 1 బిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ విషయమై సంస్థ సీఈఓ అశ్వినీ గుప్తా మాట్లాడుతూ.. గ్లోబల్ సమస్యలు ఉన్నప్పటికీ కంపెనీ బలంగా నిలిచి గైడెన్స్‌ను మించి ఫలితాలు సాధించింది. భవిష్యత్తులో రెవెన్యూ, EBITDAలను రెండింతలు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. కంపెనీ “షోర్-టు-డోర్” సేవలను మరింత విస్తరించి, లాజిస్టిక్స్ రంగంలో కీలక పాత్ర పోషించాలని చూస్తోంది.




