బైక్ ప్రియులకు షాక్.. 27 ఏళ్ల దిగ్గజ బైక్‌కు యమహా వీడ్కోలు.. ఎందుకంటే?

Yamaha R6 Discontinued: 27 ఏళ్ల ప్రయాణంలో యమహా ఆర్6 ఎన్నో మార్పులను చూసింది. రహదారులపై దూసుకెళ్లే స్పోర్ట్స్ బైక్‌గా మొదలైన ప్రయాణం చివరకు రేసింగ్ ట్రాక్‌కు పరిమితమైంది.

Venkat
Published on: 8 July 2026 8:26 PM IST
Yamaha R6 Discontinued
X

బైక్ ప్రియులకు షాక్.. 27 ఏళ్ల దిగ్గజ బైక్‌కు యమహా వీడ్కోలు.. ఎందుకంటే?

Yamaha R6 Discontinued: కొన్ని బైక్‌లు ప్రయాణానికి మాత్రమే ఉపయోగపడతాయి.. మరికొన్ని ఓ తరానికి గుర్తుగా మిగిలిపోతాయి. అలాంటి అరుదైన మోటార్‌సైకిళ్లలో యమహా ఆర్6 ఒకటి. స్పీడ్, పవర్, రేసింగ్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఈ దిగ్గజ బైక్ ప్రయాణం ముగియబోతోంది. 27 ఏళ్ల అనుబంధానికి తెరదించుతూ ఉత్పత్తిని నిలిపివేయాలని యమహా నిర్ణయించింది.

1999లో మొదలైన కథకు ఎండ్ కార్డ్..

ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ బైక్ ప్రియులను ఆకట్టుకున్న యమహా ఆర్6 ఇక చరిత్రలో భాగం కానుంది. 1999లో తొలిసారి మార్కెట్లోకి వచ్చిన ఈ మోటార్‌సైకిల్ దాదాపు మూడు దశాబ్దాలపాటు తన ప్రత్యేకతను చాటుకుంది. ముఖ్యంగా స్పీడ్ ఇష్టపడే యూత్, రేసింగ్ ప్రియుల్లో దీనికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి లేదు.

అయితే మారుతున్న కాలం, కఠినమైన పొల్యూషన్ నిబంధనలు ఈ బైక్ ప్రయాణంపై ప్రభావం చూపాయి. యూరో-5 నిబంధనల కారణంగా 2021లోనే అమ్మకాలను నిలిపివేశారు. అయినప్పటికీ రేసింగ్ ట్రాక్‌ల కోసం ప్రత్యేక మోడల్‌ను కొనసాగించారు. ఇప్పుడు ఆ మోడల్‌కు కూడా పూర్తిగా వీడ్కోలు పలికేందుకు యమహా సిద్ధమైంది.

చివరిసారిగా కొనాలంటే ఇదే ఛాన్స్..!

ఆర్6 రేస్ బేస్ చివరి నమూనా డెలివరీలు 2027 ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి. ఈ బైక్‌ను సొంతం చేసుకోవాలనుకునే వారికి రెండు విడతల్లో ముందస్తు బుకింగ్ అవకాశం కల్పించారు.

మొదటి విడత జులై 1న ప్రారంభమై జులై 31తో ముగుస్తుంది. రెండో విడత ఆగస్టు 1 నుంచి అదే నెల 31 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత జపాన్‌లో కొత్త ఆర్6 బైక్‌ల విక్రయాలకు పూర్తిగా తెరపడనుంది. ఇతర దేశాల్లో మాత్రం ఇప్పటికే ఉన్న స్టాక్ పూర్తయ్యే వరకు బైక్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

599 సీసీ ఇంజిన్..

యమహా ఆర్6 సాధారణ బైక్ కాదు. రేసింగ్ ట్రాక్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన చివరి మోడల్‌లో 599 సీసీ, నాలుగు సిలిండర్ల ఇంజిన్ ఉంటుంది. ఇది కేవలం ట్రాక్‌పై నడిపేందుకు రూపొందించిన మోడల్ కావడంతో హెడ్‌లైట్లు, నంబర్ ప్లేట్ ఉండవు. అయితే ఆర్1 బైక్ నుంచి తీసుకున్న సస్పెన్షన్, బ్రేకింగ్ వ్యవస్థలను ఇందులో ఉపయోగించారు. దీంతో రేసింగ్ సమయంలో మెరుగైన నియంత్రణ లభిస్తుంది.

భారత్‌కు రాలే.. అయినా అభిమానులు తక్కువేం కాదయ్యో..!

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యమహా ఆర్6ను భారత మార్కెట్లో అధికారికంగా ఎప్పుడూ విడుదల చేయలేదు. అయినప్పటికీ మన దేశంలోని స్పోర్ట్స్ బైక్ ప్రియుల్లో దీనికి మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం 600 సీసీ సూపర్‌స్పోర్ట్ విభాగంలో భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న జపాన్ బైక్‌లలో కవాసాకి నింజా జెడ్ఎక్స్-6ఆర్ ప్రధాన ఎంపికగా కొనసాగుతోంది.

భారత వినియోగదారులకు మరో షాక్..

ఓవైపు ఆర్6కు వీడ్కోలు పలుకుతున్న యమహా.. మరోవైపు భారత మార్కెట్లో తన పలు బైక్‌లు, స్కూటర్ల ధరలను పెంచింది. ఎక్స్‌ఎస్‌ఆర్ 155, ఫాసినో 125 ధరలు కొన్ని నమూనాల్లో రూ.1,000 వరకు పెరిగాయి. రే జెడ్ఆర్ 125 ధర రూ.2,200 వరకు పెరగగా, ఏరోక్స్ 155 ధరపై రూ.2,800 అదనపు భారం పడింది.

ఎఫ్‌జెడ్-ఎక్స్ ధర రూ.2,800 వరకు పెరగగా, యూత్‌లో ఎక్కువ ఆదరణ ఉన్న ఎంటీ-15 ధర రూ.3,800 వరకు పెరిగింది. ఆర్15 కొనుగోలుదారులపై మరింత భారం పడింది. దీని ధరను గరూ.4,900 వరకు పెంచినట్లు తెలుస్తోంది.

27 ఏళ్ల ప్రయాణంలో యమహా ఆర్6 ఎన్నో మార్పులను చూసింది. రహదారులపై దూసుకెళ్లే స్పోర్ట్స్ బైక్‌గా మొదలైన ప్రయాణం చివరకు రేసింగ్ ట్రాక్‌కు పరిమితమైంది. ఇప్పుడు అక్కడి నుంచి కూడా శాశ్వతంగా నిష్క్రమిస్తోంది. కొత్త బైక్‌లు ఎన్ని వచ్చినా, వేగాన్ని ప్రేమించే అభిమానుల జ్ఞాపకాల్లో మాత్రం ఆర్6కు ప్రత్యేక స్థానం ఎప్పటికీ ఉంటుంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story