World EV Day: పెట్రోల్, డీజిల్ భారం నుంచి విముక్తి.. సెప్టెంబర్ 9నే వరల్డ్ ఈవీ డే ఎందుకు జరుపుకుంటారు?
World EV Day: ప్రపంచవ్యాప్తంగా ప్రతేడాది సెప్టెంబర్ 9న వరల్డ్ ఈవీ డే జరుపుకుంటారు.
World EV Day
World EV Day: ప్రపంచవ్యాప్తంగా ప్రతేడాది సెప్టెంబర్ 9న వరల్డ్ ఈవీ డే జరుపుకుంటారు. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో పర్యావరణహిత విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రారంభమైన ఈ అంతర్జాతీయ ప్రచారం, ఇప్పుడు గ్రీన్ మోబిలిటీ విభాగంలో అత్యంత కీలకమైన వేడుకగా రూపాంతరం చెందింది.
ఏంటి ఈ వరల్డ్ ఈవీ డే?.. ఎలా మొదలైంది?
విద్యుత్ వాహనాల వైపు ప్రపంచాన్ని నడిపించేందుకు ప్రారంభమైన ఒక గ్లోబల్ క్యాంపెయిన్ ఈ వరల్డ్ ఈవీ డే. వాహన తయారీ సంస్థలు, ప్రభుత్వాలు, ఛార్జింగ్ నెట్‌వర్క్ కంపెనీలు, సామాన్య వాహనదారులను ఒకే వేదికపైకి తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం. 2020 సంవత్సరంలో గ్రీన్.టీవీ, ఏబీబీ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రత్యేక దినోత్సవాన్ని ప్రారంభించాయి. ఆరంభంలో కేవలం అవగాహన కార్యక్రమంగా మొదలైన ఈ ఉద్యమం, ఇప్పుడు 7వ ఏట అడుగుపెట్టి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిలో మార్పు తీసుకొచ్చింది.
ఈ ఏడాది ముఖ్యాంశం: ప్రయాణ ఖర్చుల తగ్గింపు
ఈ సంవత్సరం ఈవీ డే ప్రధానంగా స్విచింగ్ ఎలక్ట్రిక్: డ్రైవింగ్ డౌన్ ద కాస్ట్ ఆఫ్ మోటరింగ్ అనే ప్రత్యేక థీమ్‌తో ముందడుగు వేస్తోంది. అంటే ఈవీ వాహనాలను స్వీకరించడం ద్వారా రోజువారీ ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చని స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు కేవలం పర్యావరణ పరిరక్షణ కోసమే ఈవీ కొంటారనే భావన ఉండేది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే కిలోమీటరుకు ఎంత ఖర్చు అవుతుందనే లెక్కలు వేసుకుని మరీ వాహనదారులు ఈవీ వైపు అడుగులు వేస్తున్నారు. బ్యాటరీల ధరలు తగ్గడం, తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజ్ ఇచ్చే మోడళ్లు అందుబాటులోకి రావడంతో సామాన్యులకు కూడా ఈవీలు చేరువయ్యాయి.
భారతదేశంలో రికార్డు స్థాయి విక్రయాలు
దేశీయ మార్కెట్లో విద్యుత్ వాహనాలకు ఆదరణ ఊహించని రీతిలో పెరుగుతోంది. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఆగస్టు 2026 నెలలో ఏకంగా 2,98,448 విద్యుత్ వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఆగస్టు నెలతో పోలిస్తే ఇది 52.9 శాతానికి పైగా వృద్ధి కావడం విశేషం. నిరంతరం హెచ్చుతగ్గులకు గురయ్యే ఇంధన ధరల భయం నుంచి ఉపశమనం పొందేందుకు భారతీయ వినియోగదారులు ఎక్కువగా విద్యుత్ ద్విచక్ర, చతుష్చక్ర వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.
భవిష్యత్తు అంతా ఈవీలదే
ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు, మౌలిక సదుపాయాల కల్పన వల్ల విద్యుత్ వాహన రంగానికి తిరుగులేకుండా పోతోంది. దేశవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య వేగంగా పెరుగుతుండటంతో వినియోగదారుల్లో ఉన్న అభద్రతాభావం తొలగిపోతోంది. ఈ మార్పు కేవలం పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా, సామాన్యుడి జేబుపై పడే నిరంతర ఇంధన భారాన్ని తగిస్తోంది.




