సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఈ 5 తప్పక చెక్ చేయాల్సిందే.. లేదంటే మీ డబ్బు గోయిందా..!
Second Hand Car Checklist: భారతదేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం ఊహించని స్థాయిలో విస్తరిస్తోంది.
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఈ 5 తప్పక చెక్ చేయాల్సిందే.. లేదంటే మీ డబ్బు గోయిందా..!
used Car Buying Guide: మధ్యతరగతి కుటుంబాల కలల కార్ల మార్కెట్ ఇప్పుడు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. కొత్త కార్ల ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, చాలామంది సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, కంటికి కనిపించే రంగును చూసి మోసపోతే మాత్రం కొన్న తర్వాత తల పట్టుకోవాల్సిందే. అందుకే పాత కార్లనుకొనే ముందు ఈ ఐదు కీలక జాగ్రత్తలు తప్పనిసరి.
భారతదేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం ఊహించని స్థాయిలో విస్తరిస్తోంది. ప్రస్తుతం 35 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్, రాబోయే 2031 ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 70 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. కార్స్24, స్పిన్నీ, ఓఎక్స్‌ఎక్స్, మారుతి సుజుకి ట్రూ వాల్యూ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు పెరగడంతో కొనుగోళ్లు సులువయ్యాయి. కానీ, సరైన అవగాహన లేకపోతే మోసగాళ్ల చేతిలో చిక్కి కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకునే ప్రమాదం ఉంది. పాత కారును కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ పరిశీలించాల్సిన ఆ 5 ముఖ్యమైన విషయాలు ఇవే:
1. సర్వీస్ రికార్డులు, మైలేజీ నిజాయితీ..
ఒక కారును గతంలో ఎలా వాడారో తెలుసుకోవడానికి దానికి సంబంధించిన సర్వీస్ హిస్టరీ అత్యంత నమ్మకమైన ఆధారం. అధీకృత సర్వీస్ సెంటర్లలో కారును ఎప్పుడు సర్వీసింగ్ చేసినా, ఆ సమయంలో కారు ఎన్ని కిలోమీటర్లు తిరిగింది అనేది స్పష్టంగా నమోదవుతుంది. ఒకవేళ సర్వీస్ రికార్డుల్లో చూపించిన కిలోమీటర్లకు, కారులోని ఓడోమీటర్ రీడింగ్‌కు ఏమాత్రం తేడా కనిపించినా అక్కడ ఏదో మోసం జరుగుతోందని గ్రహించాలి.
2. కారు లోపలి భాగాల అరుగుదల (ఇంటీరియర్ ఫిట్నెస్)..
ఓడోమీటర్ రీడింగ్‌ను సాఫ్ట్‌వేర్ ద్వారా మార్చడం మోసగాళ్లకు చాలా తేలిక. కానీ, కారును వాడినప్పుడు జరిగే భౌతిక అరుగుదలను దాచడం ఎవరికీ సాధ్యం కాదు. కారు లోపల ఉండే క్లచ్, బ్రేక్ పెడల్స్, స్టీరింగ్ వీల్, సీట్లు, గేర్ నాబ్ వంటి వాటిని నిశితంగా పరిశీలించండి. ఓడోమీటర్ తక్కువ మైలేజీ చూపిస్తూ, ఈ భాగాలు ఎక్కువగా అరిగిపోయి ఉంటే, ఆ కారును చూపిస్తున్న దానికంటే చాలా ఎక్కువగా వాడారని అర్థం.
3. టెస్ట్ డ్రైవ్.. కారు నాడి పట్టుకోండి..
కారు ఎంత బాగున్నా సరే, మీరు స్వయంగా నడిపి చూసేంతవరకు దాని అసలు రంగు బయటపడదు. కారును డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంజన్ నుంచి ఎలాంటి శబ్దాలు వస్తున్నాయి, గేర్లు సజావుగా పడుతున్నాయా లేదా అని గమనించాలి. అలాగే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు ఓడోమీటర్ సూచీ సక్రమంగా కదులుతుందో లేదో చూడాలి. కంపెనీ చెప్పిన మైలేజీకి, మీ డ్రైవింగ్ అనుభవానికి తేడా వస్తే ఆ కారులో ఏదో సాంకేతిక లోపం ఉన్నట్లే.
4. ప్రమాదాల చరిత్ర, బాడీ డామేజ్..
కారు గతంలో ఏదైనా పెద్ద ప్రమాదానికి గురైందా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. కారు బాడీపై వేర్వేరు చోట్ల రంగుల్లో తేడాలున్నా, గ్యాప్స్ ఎక్కువగా ఉన్నా, లేదా వెల్డింగ్ గుర్తులు కనిపిస్తే అది గతంలో ప్రమాదానికి గురై బాగు చేసిన కారు కావచ్చు. బోనెట్ కింద ఉండే భాగాలను, కారు ఛాసిస్‌ను తుప్పు లేదా వంపుల కోసం నిపుణులతో తనిఖీ చేయించడం ఉత్తమం.
5. టైర్ల పరిస్థితి, తయారీ తేదీ..
సాధారణంగా ఒక కారు టైర్ల జీవితకాలం 40 వేల నుంచి 50 వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. కారు మైలేజీ కేవలం 15 లేదా 20 వేల కిలోమీటర్లే చూపిస్తూ, టైర్లు మాత్రం కొత్తవి మార్చి ఉంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. టైర్లపై ఉండే తయారీ తేదీని (మాన్యుఫాక్చరింగ్ డేట్) పరిశీలించడం ద్వారా కారు వాడకంపై ఒక స్పష్టమైన అంచనాకు రావచ్చు.
సెకండ్ హ్యాండ్ కారు కొనడం అనేది బడ్జెట్ పరంగా మంచి నిర్ణయమే అయినప్పటికీ, తొందరపాటు పనికిరాదు. పైన పేర్కొన్న ఐదు అంశాలను మనస్సులో ఉంచుకుని, ఒక నమ్మకమైన మెకానిక్ లేదా నిపుణుడి సమక్షంలో కారును పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోండి. అప్పుడే మీ ప్రయాణం సురక్షితంగా, సంతోషంగా సాగుతుంది.




