Hybrid SUVs : మార్కెట్లోకి 3 కొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీలు..వీటి మైలేజ్ చూస్తే షాకవ్వడం ఖాయం

Hybrid SUVs : భారత మార్కెట్లోకి త్వరలో హోండా ZR-V, కియా సోరెంటో, రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎస్‌యూవీలు రానున్నాయి.

CR Reddy
Published on: 20 July 2026 9:13 AM IST
Renault Duster
X

 Renault Duster

Hybrid SUVs : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం హైబ్రిడ్ వాహనాలకు రోజూ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఇంధన ధరల భారం తగ్గుతుండటం, పర్యావరణానికి మేలు చేసే సాంకేతికత కావడంతో వాహనదారులు హైబ్రిడ్ వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలు ఈ ఏడాది చివరి నాటికి 3 సరికొత్త హైబ్రిడ్ SUV మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమయ్యాయి. పవర్ఫుల్ ఇంజిన్లతో పాటు లీటరుకు దాదాపు 25 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇచ్చేలా ఈ కార్లను డిజైన్ చేశారు.

హోండా జెడ్ఆర్-వి

జపాన్ కార్ల దిగ్గజం హోండా తన గ్లోబల్ లైనప్‌లోని హెచ్‌ఆర్-వి, సిఆర్‌-వి మధ్య స్థానంలో ఉండేలా ఈ జెడ్ఆర్-వి ఎస్‌యూవీని రూపొందించింది. భారత్‌లో దీని పెట్రోల్-ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వేరియంట్‌ను పరిచయం చేస్తున్నారు. దీని డెలివరీలు ఈ నెల ఆఖరు నుంచే ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ కారులో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్ అందించనున్నారు. ఇది ఏకంగా 181 బిహెచ్‌పి పవర్‌ను జనరేట్ చేయడంతో పాటు లీటరుకు 22.8 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీనిని విదేశాల నుండి భారతదేశానికి పూర్తిగా తయారైన యూనిట్ రూపంలో దిగుమతి చేసుకుంటున్నారు.

కియా సోరెంటో

సౌత్ కొరియా కార్ల సంస్థ కియా మోటార్స్ రాబోయే అక్టోబర్ నెల సమీపంలో తన ప్రీమియం డి-సెంగుమెంట్ ఎస్‌యూవీ సోరెంటో హైబ్రిడ్‎ను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ విభాగంలో ఇప్పటికే ఉన్న స్కోడా కోడియాక్ వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. ఈ కారును 6-సీటర్, 7-సీటర్ లేఅవుట్‌లలో లభించేలా రూపొందిస్తున్నారు. ఇందులో 1.6-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ కాంబినేషన్‌ ఉంటుంది. ఇది సుమారు లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉనట్లు తెలుస్తోంది.

రెనాల్ట్ డస్టర్

ఇక గతంలో భారత రోడ్లను ఏలిన రెనాల్ట్ డస్టర్ మళ్లీ సరికొత్త హైబ్రిడ్ అవతారంలో అక్టోబర్ చివరిలో లేదా నవంబర్ ఆరంభంలో రీ-ఎంట్రీ ఇవ్వనుంది. కంపెనీ ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ ప్రారంభించగా, విశేషమేమిటంటే 2026 సంవత్సరానికి గాను నిర్దేశించిన ప్రొడక్షన్ వాల్యూమ్ మొత్తం ఇప్పటికే సోల్డ్ అవుట్ అయిపోయింది. ఈ మోడల్‌లో 1.8-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.4 kWh బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ అందించనున్నారు. ఇది నగర ప్రయాణాల్లో 80 శాతం దూరాన్ని కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే అధిగమించగలదు. దీని డెలివరీలు దీపావళి పండుగ నాటికి ప్రారంభం కానున్నాయి, అలాగే ఇది లీటరుకు 25 కిమీ మైలేజ్ ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story