Upcoming EVs: ఈవీ కార్ కొంటున్నారా? ఆగండి.. అతి తక్కువ ధరలో త్వరలో 5 కొత్త మోడల్స్
Upcoming EVs: కొత్తగా ఎలక్ట్రిక్ కార్ కొనాలని యోచిస్తున్నారా? అయితే కొన్ని రోజులు ఆగడం చాలా మంచిది.
Mahindra BE07
Upcoming EVs: కొత్తగా ఎలక్ట్రిక్ కార్ కొనాలని యోచిస్తున్నారా? అయితే కొన్ని రోజులు ఆగడం చాలా మంచిది. ప్రముఖ దిగ్గజ సంస్థలు టాటా, మహీంద్రా, హ్యుందాయ్, హోండా రాబోయే రోజుల్లో 5 అత్యద్భుతమైన ఈవీ మోడళ్లను మార్కెట్లోకి తేనున్నాయి. బడ్జెట్ ధరల్లోనే లభించే ఈ కొత్త వాహనాల వివరాలు ఇవే.
టాటా నుంచి రెండు ధమాకా మోడల్స్
భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తున్న టాటా మోటార్స్ సరికొత్త ఉత్పత్తులతో కస్టమర్లను పలకరించేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో మొదటిది అత్యంత ప్రజాదరణ పొందిన టిగోర్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ రూపం. రీడిజైన్ చేసిన ఫ్రంట్ లుక్, ఎల్ఈడీ డీఆర్‌ఎల్స్, 10.25 ఇంచుల పెద్ద టచ్‌స్క్రీన్‌తో ఇది రానుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 315 కిలోమీటర్ల పరిధిని ఇచ్చేలా రూ.13 లక్షల అంచనా ధరతో ఈ కారు సిద్ధమవుతోంది. ఇక మరోవైపు కుటుంబ సమేతంగా ప్రయాణించేందుకు వీలుగా 7 సీటర్ విభాగంలో సఫారీ ఈవీని తీసుకువస్తున్నారు. భారీ బ్యాటరీ ప్యాక్, అత్యాధునిక అడాస్ సేఫ్టీ ఫీచర్లు, OLED డిస్‌ప్లేతో పండగ సీజన్ నాటికి ఇది మార్కెట్లో సందడి చేయనుంది.
హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ
దేశీయ కస్టమర్ల జేబుకు చిల్లు పడకుండా తక్కువ ధరలోనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని అందించాలని హ్యుందాయ్ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. HE1i కోడ్‌నేమ్‌తో రూపొందుతున్న ఈ కాంపాక్ట్ ఈవీని తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ప్లాంట్‌లో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేస్తున్నారు. సుమారు రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల లోపే దీని ధర ఉండే అవకాశం ఉంది. నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవు ఉండే ఈ మోడల్ నాణ్యమైన బ్యాటరీ ఆప్షన్లతో సాధారణ వాహనదారులకు అద్భుతమైన ఎంపికగా మారనుంది.
మహీంద్రా బిఈ-07
తన బోల్డ్ ఎలక్ట్రిక్ శ్రేణిలో భాగంగా మహీంద్రా అండ్ మహీంద్రా BE07 పేరుతో సరికొత్త ఎస్‌యూవీని రూపొందిస్తోంది. ఫ్యామిలీ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఎక్కువ రూఫ్‌స్పేస్, వెనుక సీట్లలో ప్రయాణికులకు విశాలమైన స్థలం ఉండేలా డిజైన్ చేశారు. ప్రత్యేకమైన C షేప్ ఎల్ఈడీ లైటింగ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఎయిరోడైనమిక్ అలాయ్ వీల్స్ వంటి హంగులతో వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఇది రోడ్లపైకి రాబోతోంది.
హోండా 0 ఆల్ఫా
చాలాకాలంగా ఈవీ రంగానికి దూరంగా ఉన్న జపాన్ దిగ్గజం హోండా, భారత రోడ్ల పరిస్థితులకు తగినట్లుగా హోండా 0 ఆల్ఫా మోడల్‌ను తీసుకొస్తోంది. రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంట్‌లో తయారయ్యే ఈ బాక్సీ డిజైన్ ఎస్‌యూవీ సుదీర్ఘ ప్రయాణాలకు వీలుగా భారీ బ్యాటరీ సామర్థ్యంతో రాబోతోంది. రూ. 25 లక్షల శ్రేణిలో లభించే ఈ కారు లాంగ్ రైడింగ్ ఆశించే వారికి సరికొత్త అనుభూతిని ఇస్తుంది.




