Upcoming Bikes: కొత్త బైక్ కొనే ఆలోచన ఉందా?.. సెప్టెంబర్లో మార్కెట్లో హల్చల్ చేసే కొత్త బైక్స్ ఇవే
Upcoming Bikes: పండగల సీజన్ ముందే భారత టూవీలర్ మార్కెట్ కొత్త మెరుపులు మెరిపించబోతుంది.
Royal Enfield
Upcoming Bikes: పండగల సీజన్ ముందే భారత టూవీలర్ మార్కెట్ కొత్త మెరుపులు మెరిపించబోతుంది. అడ్వెంచర్ బైక్‌ల నుంచి కుటుంబ అవసరాలకు తగ్గ ఎలక్ట్రిక్ స్కూటర్ల వరకు సెప్టెంబర్ నెలలో పలు అద్భుతమైన వాహనాలు ఆవిష్కరణకు సిద్ధమయ్యాయి. కస్టమర్లలో భారీ అంచనాలు పెంచుతున్న ఆ కొత్త బైక్స్ వివరాలు తెలుసుకుందాం.
సెప్టెంబర్ 2న సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్
ప్రముఖ ఈవీ తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ తన సరికొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వేవ్‌ను సెప్టెంబర్ 2న విపణిలోకి విడుదల చేయనుంది. గతంలో తీసుకొచ్చిన సింపుల్ వన్ వేరియంట్ కన్నా ఇది మరింత ఆచరణాత్మకంగా, సాధారణ కస్టమర్ల దైనందిన అవసర తీర్చే విధంగా రూపొందింది. వెడల్పాటి ఫుట్‌బోర్డ్, సౌకర్యవంతమైన సీటింగ్ పొజిషన్, సుదీర్ఘమైన సింగిల్ సీట్ డిజైన్‌తో ఈ స్కూటర్ రూపుదిద్దుకుంది. మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని కంపెనీ దీని ప్రారంభ ధరను రూ.1.30 లక్షల శ్రేణిలో నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది.
సెప్టెంబర్ 4న రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 440
టూవీలర్ రంగాన్ని ఊపేస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తన సరికొత్త అడ్వెంచర్ మోడల్ 'హిమాలయన్ 440'ను సెప్టెంబర్ 4న అధికారికంగా తీసుకురానుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న హిమాలయన్ 450 కంటే తక్కువ ధరలోనే సామాన్య రైడర్లకు అందుబాటులో ఉండేలా దీనిని డిజైన్ చేశారు. పాత హిమాలయన్ 411 తరహాలోనే 443సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో ఇది వస్తోంది. ముందు భాగంలో 21 ఇంచులు, వెనుక భాగంలో 17 ఇంచుల వీల్స్‌తో ఆఫ్-రోడింగ్ ప్రియులను ఆకట్టుకునేలా ప్రత్యేక ఫీచర్లను ఇందులో పొందుపరిచారు. దీని అంచనా ధర రూ.2.40 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
ట్రయంఫ్ బోన్నెవిల్లే 400 క్లాసిక్ లుక్స్
బ్రిటిష్ బైక్ దిగ్గజం ట్రయంఫ్ తన చిన్న కెపాసిటీ శ్రేణిలో భాగంగా బోన్నెవిల్లే 400ను సెప్టెంబర్ నెలలోనే పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. క్లాసిక్ రెట్రో స్టైలింగ్ ఇష్టపడే రైడర్లను లక్ష్యంగా చేసుకుని ఈ బైక్‌ను తయారుచేస్తున్నారు. ప్రీమియం లుక్‌తో పాటు రోజువారీ వాడకానికి సౌకర్యంగా ఉండేలా దీని డిజైన్ ఉండనుంది. ఇంకా అధికారిక లాంచ్ తేదీ ఖరారు కానప్పటికీ రూ.2.00 లక్షల నుంచి రూ.2.20 లక్షల ధరల శ్రేణిలో ఇది లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.
బజాజ్ బ్రాండ్ నుంచి నయా అడ్వెంచర్ రైడ్
దేశీయ దిగ్గజం బజాజ్ ఆటో కూడా ఒక సరికొత్త అడ్వెంచర్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలుమార్లు రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటూ కనిపించిన ఈ బైక్ సెప్టెంబర్ నెలాఖరుకల్లా ఆవిష్కృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అడ్వెంచర్ లుక్స్‌తో పాటు నిత్యం ఆఫీసు ప్రయాణాలకు కూడా సరిపోయేలా బజాజ్ దీనిని మలుస్తోంది. దసరా, దీపావళి పండగల సమయానికి విక్రయాలు వేగవంతం చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. దీని ధర రూ.2 లక్షల రేంజ్‌లో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.




