Upcoming EVs : బడ్జెట్ రెడీ చేస్కోండి బాస్.. త్వరలో మార్కెట్లోకి 500 కిమీ రేంజ్ ఇచ్చే 5 కొత్త 7-సీటర్ ఈవీలు
Upcoming EVs : టాటా, మారుతి, టయోటా, ఎంజీ కంపెనీల నుంచి 500 కిలోమీటర్ల పైగా రేంజ్ ఇచ్చే రాబోయే 5 కొత్త 7-సీటర్ EV కార్ల వివరాలు తెలుసుకుందాం.
Tata Safari EV
Upcoming EVs : భారత వాహన రంగం ప్రస్తుతం వేగంగా ఎలక్ట్రిక్ బాట పడుతోంది. ఒకప్పుడు పెద్దవిగా ఉండే 7-సీటర్ కార్లు ఎక్కువ ఇంధనం తాగుతాయనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఆ ఆలోచనను పూర్తిగా మార్చేస్తున్నాయి. భారతీయ పెద్ద కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత ప్రతిష్టాత్మకమైన 5 కొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ కార్లు మరికొద్ది రోజుల్లో మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇవి పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా సింగిల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్లకు పైగా మెరుగైన డ్రైవింగ్ రేంజ్‌ను, అధునాతన ఫీచర్లను అందించనున్నాయి.
మారుతి సుజుకి YMC
దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన మొట్టమొదటి 3-రో ఎలక్ట్రిక్ MPVపై శరవేగంగా పనిచేస్తోంది. దీనికి YMC అనే కోడ్‌నేమ్ కేటాయించారు. ఈ కారును 2026 ఆఖరు నాటికి ప్రపంచానికి పరిచయం చేసి, 2027లో మార్కెట్లోకి తేవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇది HEARTECT-e స్కేట్‌బోర్డ్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందుతోంది. ఇందులో 49 kWh, 61 kWh ఆప్షన్లతో రెండు బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తున్నారు. ఇవి ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వనున్నాయి.
మారుతి బాటలోనే టయోటా EV MPV
మారుతి సుజుకితో ఉన్న భాగస్వామ్యంలో భాగంగా జపాన్ ఆటో దిగ్గజం టయోటా కూడా ఇదే ప్లాట్‌ఫారమ్‌పై తన సొంత ఎలక్ట్రిక్ MPVని విడుదల చేయనుంది. సాంకేతికంగా ఇది మారుతి YMC లాగే ఉన్నప్పటికీ, దీని బయటి లుక్, బాడీ డిజైన్ పూర్తిగా సరికొత్తగా ఉంటుంది. ఇందులో కూడా 49 kWh, 61 kWh బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించనున్నారు. లోపల క్యాబిన్ విషయానికొస్తే 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వెంటలేటెడ్ సీట్ల వంటి అత్యాధునిక సౌకర్యాలను పొందుపరచనున్నారు.
ఎంజీ హెక్టర్ హాక్ ఈవీ
ఎంజీ మోటార్ ఇండియా ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి తమ పాపులర్ మోడల్ హెక్టర్ హాక్ ఫుల్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఎంజీ ADAPT ప్లాట్‌ఫారమ్‌పై నిర్మిస్తున్న ఈ SUV పొడవు 4,745 మిమీ, వీల్‌బేస్ 2,810 మిమీగా ఉండనుంది. ఇందులో 56.7 kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఇస్తున్నారు. ఇది 136bhp పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తూ, రియల్ వరల్డ్‌లో 450 నుంచి 500 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
టాటా సఫారీ EV, అవిన్యా 3-రో మోడళ్లు
ఎలక్ట్రిక్ వాహన విభాగంలో అగ్రస్థానంలో ఉన్న టాటా మోటార్స్ తన ఫ్లాగ్షిప్ ఎస్యూవీ సఫారీ EVని భారత రోడ్లపై తీవ్రంగా పరీక్షరిస్తోంది. కంపెనీ నయా Acti.ev+ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందుతున్న ఈ కారులో హారియర్ ఈవీలో వాడే 65 kWh, 75 kWh బ్యాటరీ ప్యాక్‌లను ఇచ్చే అవకాశముంది. వీటితో పాటు టాటా తన లగ్జరీ ఈవి బ్రాండ్ అవిన్యా కింద ఫ్రీలాండర్ EV ప్లాట్‌ఫారమ్‌పై 3-రో ప్రీమియం ఎస్‌యూవీని తయారు చేస్తోంది. ఇందులో 65 kWh నుంచి 80 kWh వరకు పవర్ ఉండే బ్యాటరీలు అమర్చనున్నారు. ఇది 2027 నాటికి కస్టమర్లకు అందుబాటులోకి రానుంది.




