70 లక్షల మంది మనసు గెలిచిన అపాచీ.. సరికొత్త క్యాంపెయిన్ షురూ చేసిన టీవీఎస్..!

TVS Apache 70 lakh sales: 2005లో అపాచీ 150తో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది వినియోగదారుల మైలురాయిని చేరుకుంది.

Venkat
Published on: 8 July 2026 7:14 PM IST
TVS Apache 70 Lakh Sales
X

70 లక్షల మంది మనసు గెలిచిన అపాచీ.. సరికొత్త క్యాంపెయిన్ షురూ చేసిన టీవీఎస్..!

TVS Apache 70 Lakh Sales: టాప్ 10 మోటార్ సైకిళ్ల జాబితాలో టాప్ ప్లేస్ సంపాదించిన అపాచీ, 150సీసీ - 200సీసీ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతోన్న మోడల్‌గా నిలిచింది. రేసింగ్ ట్రాక్‌లపై దశాబ్దాలుగా ఆర్జించిన అనుభవాన్ని, అదిరిపోయే స్పోర్టీ లుక్స్‌ను కలగలిపి మార్కెట్లోకి వచ్చిన టీవీఎస్ అపాచీ (TVS Apache) బైక్‌లకు యూత్‌లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం భారతదేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 90కి పైగా దేశాల బైక్ లవర్స్‌ను ఈ సిరీస్ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

తాజాగా ఈ బైక్ శ్రేణి అంతర్జాతీయంగా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. గ్లోబల్ మార్కెట్‌లో అపాచీ మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేసిన వారి సంఖ్య తాజాగా 70 లక్షల (7 మిలియన్లు) మార్కును దాటింది. ఈ మైలురాయిని సెలబ్రేట్ చేసుకుంటూనే.. ఈ బైక్‌లలో ఉండే పవర్‌ఫుల్ రేసింగ్ DNAను, వినూత్న పనితీరును అందరికీ పరిచయం చేసేందుకు టీవీఎస్ సంస్థ 'తూ రేస్ లగా' (Tu Race Laga) అనే సరికొత్త బ్రాండ్ క్యాంపెయిన్‌ను అధికారికంగా ప్రారంభించింది.

రెండు దశాబ్దాలుగా సరికొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్న టీవీఎస్ అపాచీ, బైక్ లవర్స్ అంచనాలకు తగ్గట్టుగా మారుతూనే సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో గ్లోబల్ మార్కెట్‌లో ఏకంగా 70 లక్షల (7 మిలియన్లు) మందికి పైగా రైడర్లను సొంతం చేసుకొని అరుదైన ఘనత సాధించింది. దీంతోపాటు ఈ బ్రాండ్‌కు 5 లక్షల మందితో ఎంతో బలమైన కమ్యూనిటీ అండ కూడా ఉంది.

కాగా, ఈ కథ 2005లో 'టీవీఎస్ అపాచీ 150' విడుదలతో మొదలైంది. దీని ముఖ్య ఉద్దేశ్యం రేసింగ్ ట్రాక్‌లపై ప్రొఫెషనల్స్ పొందే కిక్‌ను, సాధారణ బైక్ రైడర్లకు సైతం అందించాలనే కోరికతో ఈ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చారు. మోటార్‌స్పోర్ట్ రంగంలో కంపెనీకి ఉన్న దశాబ్దాల అనుభవాన్ని, రేసింగ్ టెక్నాలజీని ప్రతి అపాచీ బైక్‌లోనూ జోడించి వినియోగదారులకు సరికొత్త రైడింగ్ అనుభూతిని అందిస్తున్నారు.

గడిచిన కొన్నేళ్ల కాలంలో అపాచీ ఫ్యామిలీ ఏకంగా ఏడు వైవిధ్యభరితమైన మోడళ్లతో విస్తరించింది. గతేడాది అక్టోబర్ (2025)లో మార్కెట్లోకి వచ్చిన అపాచీ RTX 300 ఈ శ్రేణిలో సరికొత్తగా చేరిన వాహనం. ఇక్కడితోనే ఆగిపోకుండా టీవీఎస్ సంస్థ తన సరిహద్దులను మరింత విస్తరిస్తోంది. బీఎండబ్ల్యూ (BMW) భాగస్వామ్యంతో సరికొత్తగా రూపుదిద్దుకున్న 420cc ఇంజిన్ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా, కంపెనీ తన మొట్టమొదటి ప్యారలల్-ట్విన్ (Parallel-Twin) బైక్‌ను త్వరలోనే రోడ్లపైకి తేనుంది.

కాగా, ఇప్పటికే అపాచీ రైడర్ల కమ్యూనిటీ 5 లక్షల మార్కును తాకిందని సంస్థ ప్రకటించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని 'తూ రేస్ లగా' (Tu Race Laga) అనే సరికొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కంపెనీ.

టెక్నాలజీ వాడకంలోనూ దూకుడు..

అపాచీ బైక్‌లు మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడవడానికి ప్రధాన కారణం వాటిలో ఉండే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్. ఇందుకు నిదర్శనంగా నిలిచే 312.2cc లిక్విడ్ కూల్డ్, రివర్స్-ఇన్‌క్లైన్డ్ DOHC ఇంజన్, ఈ సెగ్మెంట్‌లోనే బెస్ట్ పవర్-టు-వెయిట్ రేషియోను అందిస్తుంది. దీనితో పాటు రైడర్ల భద్రత కోసం ప్రత్యేకంగా రేస్-ట్యూన్డ్ డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (DSC) సిస్టమ్‌ను కంపెనీ డిజైన్ చేసింది. ఇందులో లాంచ్ కంట్రోల్, కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వీలీ కంట్రోల్‌తో పాటు రియర్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ వంటి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

ఈ విభాగంలోనే తొలిసారిగా లభిస్తున్న మల్టిపుల్ రైడ్ మోడ్‌లు, అడ్వాన్స్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్, గ్లైడ్-త్రూ టెక్నాలజీ, కీలెస్‌ యాక్సెస్ వంటి వినూత్న ఫీచర్లు అపాచీ బైక్‌ల సొంతం. అంతేకాదు, కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా ఫ్యాక్టరీ నుంచే నేరుగా వాహనాన్ని కస్టమైజ్ చేసి ఇచ్చే అరుదైన సదుపాయాన్ని కూడా టీవీఎస్ కల్పిస్తోంది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story