Toyota Glanza : రూ.6.46లక్షలు, 23కిమీ మైలేజ్.. ఈ టయోటా కారు కొంటే ఏకంగా రూ.70 వేలు ఆదా

Toyota Glanza : టయోటా గ్లాంజాపై ఆగస్ట్ నెలలో రూ.70,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ.40,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తాయి.

CR Reddy
Published on: 6 Aug 2026 8:23 AM IST
Toyota Glanza
X

Toyota Glanza

Toyota Glanza : భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో టయోటా గ్లాంజా తనదైన ముద్ర వేస్తోంది. మారుతి సుజుకి బాలెనోకు ప్రధాన పోటీదారుగా ఉన్న ఈ కారు వైపు ప్రస్తుతం కొనుగోలుదారులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. దీనికి ప్రధాన కారణం కంపెనీ ఆగస్ట్ నెలలో ప్రకటించిన భారీ డిస్కౌంట్ ఆఫర్లే. ఈ నెలలో గ్లాంజా కొనుగోలు చేసే వినియోగదారులకు కంపెనీ ఏకంగా రూ.70,000 వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తోంది.

ఏ ఏ విభాగాల్లో ఎంతెంత ఆఫర్లు ఉన్నాయంటే?

ఈ ఆఫర్ల వివరాలను పరిశీలిస్తే.. టయోటా గ్లాంజాపై ప్రత్యక్షంగా రూ.25,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. దీనితో పాటు నాన్-టయోటా కారును ఎక్స్ఛేంజ్ చేసి గ్లాంజాను కొనుగోలు చేసే వినియోగదారులకు అదనంగా రూ.40,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుతోంది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వినియోగదారులకు ప్రత్యేకంగా రూ.5,000 కార్పొరేట్ లేదా రూరల్ బెనిఫిట్ లభిస్తుంది. ఈ విధంగా గరిష్టంగా రూ.70,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. సాధారణ ఆఫర్లలో సైతం కనీసం రూ.65,000 వరకు లభిస్తోంది. ప్రస్తుతం ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.6,46,000 గా ఉంది.

పవర్‌ఫుల్ ఇంజిన్, సీఎన్జీ ఆప్షన్లు

టయోటా గ్లాంజా పవర్‌ట్రెయిన్ విషయానికి వస్తే.. ఇందులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఏంఎంటీ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ పెట్రోల్ మోడ్ 89bhp పవర్, 113Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే కంపెనీ దీనితో పాటు ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ కిట్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. సీఎన్జీ మోడ్‌లో మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభించే ఈ ఇంజిన్ 76bhp పవర్, 98.5Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది మారుతి బాలెనో, టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ i20 కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.

ARAI సర్టిఫైడ్ మైలేజ్ వివరాలు

మైలేజ్ విషయంలో కూడా టయోటా గ్లాంజా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ARAI ధృవీకరించిన గణాంకాల ప్రకారం.. దీని 1.2-లీటర్ పెట్రోల్ మాన్యువల్, ఏఎంటీ వేరియంట్లు లీటరుకు 22.3 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తాయి. ఇక పొదుపుగా ప్రయాణించాలనుకునే వారికి 1.2-లీటర్ పెట్రోల్ + సీఎన్జీ వేరియంట్ కేజీ సీఎన్జీకి ఏకంగా 30.61 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుండటం విశేషం.

ప్రీమియం ఫీచర్లు, సురక్షితమైన ప్రయాణం

ఎక్స్‌టీరియర్ పరంగా ఈ కారులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ట్విన్ ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, స్లీక్ ఆకారంలో ఉన్న 16-ఇంచ్ అలాయ్ వీల్స్, ఎల్‌ఈడీ టైల్ ల్యాంప్‌లను అందించారు. ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్‌తో కూడిన 9-ఇంచ్ స్మార్ట్‌ప్లేకాస్ట్ టచ్‌స్క్రీన్, హెడ్-అప్ డిస్‌ప్లే, వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ బటన్ ఉన్నాయి. సేఫ్టీకి సంబంధించి ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, ఏబీఎస్‌తో కూడిన ఈబీడీ, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story