Car Discounts: పండుగ ముందే తెచ్చిన టాటా.. దేశంలోనే అత్యంత చౌక సెడాన్ పై రూ.30 వేల డిస్కౌంట్
Car Discounts: పండుగల సీజన్ ప్రారంభం కావడంతో ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది.
Tata Tigor
Car Discounts: పండుగల సీజన్ ప్రారంభం కావడంతో ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. భారత ఆటోమొబైల్ మార్కెట్లో సొంత సెడాన్ కారు కొనుగోలు చేయాలని భావించే మధ్యతరగతి కుటుంబాలకు టాటా టిగోర్ అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.5.55 లక్షల నుంచి రూ.8.84 లక్షల వరకు ఉంది. పండుగల సమయాన్ని పురస్కరించుకుని టాటా సంస్థ ఈ కారుపై రూ.15,000 క్యాష్ డిస్కౌంట్, మరో రూ.15,000 స్క్రాపేజ్ బోనస్ కలిపి మొత్తం రూ.30,000 వరకు లబ్ధి చేకూరుస్తోంది. పెట్రోల్, ఐసిఎన్జీ, ఎలక్ట్రిక్ వేరియంట్లలో అందుబాటులో ఉండటం ఈ కారు ప్రధాన ప్రత్యేకత. మార్కెట్లో మారుతి డిజైర్, హ్యుందాయ్ ఆరా వంటి కార్లతో పోలిస్తే ఇది అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది.
సరికొత్త ఫీచర్లు.. మారిన ఇంటీరియర్ లుక్
ఇటీవల మార్కెట్లోకి వచ్చిన మోడల్లో టాటా మోటార్స్ పలు మార్పులు చేసింది. ముందుభాగంలో గ్రిల్, ఫ్రంట్ బంపర్ డిజైన్‌ను ముచ్చటగా తీర్చిదిద్దింది. కొన్ని వేరియంట్లలో చిన్నపాటి బూట్లిడ్ స్పాయిలర్, నూతన హైపర్‌స్టైల్ వీల్స్ అందించారు. లోపల ఇంటీరియర్ థీమ్‌ను మార్చడంతో పాటు అన్ని వేరియంట్లలో కొత్త డిజైన్‌తో కూడిన ఇల్యూమినేటెడ్ స్టీరింగ్ వీల్‌ను అమర్చారు. టాప్ వేరియంట్లలో డ్యూయల్ టోన్ లేథర్ ఫినిషింగ్ ఇచ్చి కేబిన్ ప్రాంగణానికి మరింత లగ్జరీ లుక్‌ను తీసుకువచ్చారు.
మోడ్రన్ టెక్నాలజీ.. 360 డిగ్రీ కెమెరా
సాంకేతిక సదుపాయాల విషయంలో కూడా ఈ కారు ఎక్కడా తగ్గలేదు. వేరియంట్ల వారీగా చూస్తే ఎక్స్‌టీ మోడల్లో 3.5 అంగుళాల మ్యూజిక్ సిస్టమ్ డిస్ప్లే, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఫాలో-మీ-హోమ్ హెడ్లాంప్లు ఉన్నాయి. టాప్ వేరియంట్లో ఏకంగా 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరాలను పొందుపరిచారు. ఎక్స్జెడ్ వేరియంట్లో ఎల్ఈడీ హెడ్లాంప్లు, డేటైమ్ రన్నింగ్ లైట్లు, 15 అంగుళాల వీల్స్, హిల్ హోల్డ్ కంట్రోల్, ఈఎస్పీ, 7 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే కనెక్టివిటీ లభిస్తున్నాయి.
ఈవీ విభాగంలోనూ సంచలనం
భారతదేశంలో లభించే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ సెడాన్ కారుగా టాటా టిగోర్ ఈవీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందులో 75 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్, 26 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి. సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 315 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఈ మోడల్‌ను మరింత అప్‌గ్రేడ్ చేసి బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) సదుపాయాన్ని కూడా తీసుకొచ్చే యోచనలో సంస్థ ఉంది.




