Suzuki Burgman Street 125 : 8 ఏళ్లలో 14 లక్షలు.. యాక్టివాకు ముచ్చెమటలు పట్టిస్తున్న సుజుకి స్కూటర్
Suzuki Burgman Street 125 : సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ 125 స్కూటర్ భారతదేశం, ఎగుమతి మార్కెట్లలో 14 లక్షల అమ్మకాల మైలురాయిని దాటింది.
Suzuki Burgman Street 125
Suzuki Burgman Street 125 : భారతీయ టూ-వీలర్ మార్కెట్లో 125సీసీ స్కూటర్ల సెగ్మెంట్‌కు రోజురోజుకూ డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ఈ రేసులో జపాన్ ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సుజుకికి చెందిన ప్రీమియం మ్యాక్సీ-స్కూటర్ బర్గ్‌మన్ స్ట్రీట్ 125 సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు దేశీయ మార్కెట్, విదేశీ ఎగుమతులను కలుపుకుని ఈ స్కూటర్ ఏకంగా 14 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. స్టైలిష్ లుక్, సౌకర్యవంతమైన రైడింగ్ ఇష్టపడే యువతను ఈ స్కూటర్ అమితంగా ఆకట్టుకుంటోంది.
ఇండియాతో పాటు విదేశాల్లోనూ క్రేజ్
సుజుకి సంస్థ ఈ ప్రీమియం స్కూటర్‌ను జూలై 2018 లో భారత మార్కెట్లో మొదటిసారిగా లాంచ్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం మన దేశంలోనే 11.6 లక్షల యూనిట్ల బర్గ్‌మన్ స్కూటర్లు అమ్ముడయ్యాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లలోనూ దీనికి మంచి ఆదరణ లభించడంతో దాదాపు 2.5 లక్షల స్కూటర్లను విదేశాలకు ఎగుమతి చేశారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు 14,18,711 యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. సుజుకి పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడయ్యే యాక్సెస్ 125 తర్వాత స్థానంలో బర్గ్‌మన్ నిలవడం విశేషం.
అమ్మకాల్లో 25 శాతం బంపర్ గ్రోత్..
గడిచిన ఆర్థిక సంవత్సరం (FY2026)లో సుజుకి బర్గ్‌మన్ స్ట్రీట్ అమ్మకాల్లో ఏకంగా 25 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఈ ఒక్క ఏడాదిలోనే సుమారు 2,87,177 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో సుజుకి మొత్తం స్కూటర్ల అమ్మకాల్లో బర్గ్‌మన్ వాటా 25 శాతానికి చేరుకుంది. కాగా, యాక్సెస్ 125 వాటా 70 శాతంగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న హోండా యాక్టివా 125, టీవీఎస్ జుపీటర్, టీవీఎస్ ఎన్‌టార్క్ 125, హీరో డెస్టిని 125, హోండా డియో, ఏప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125, యమహా రే వంటి పాపులర్ స్కూటర్లకు ఈ సుజుకి మ్యాక్సీ-స్కూటర్ గట్టి పోటీ ఇస్తోంది.
కొత్త మోడల్లో పవర్ఫుల్ ఇంజన్..
కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా సుజుకి సంస్థ ఇటీవలే ఏప్రిల్ 2న సరికొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇందులో 124సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను అమర్చారు. ఇది 8.4 హెచ్‌పీ పవర్, 10.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ఏకంగా 24.6 లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ (సీటు కింద స్థలం) లభిస్తుంది. ఈ సెగ్మెంట్లోని ఇతర స్కూటర్లతో పోలిస్తే ఇది చాలా పెద్దది. దీనివల్ల ఫుల్ ఫేస్ హెల్మెట్ తో పాటు రోజువారీ సామాన్లు చాలా ఈజీగా దాచుకోవచ్చు.
అదిరిపోయే మోడ్రన్ ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే బర్గ్‌మన్ స్ట్రీట్ 125 లో ఎన్నో అడ్వాన్స్డ్ ఆప్షన్లు ఉన్నాయి. తాళం లేకుండానే బండిని స్టార్ట్ చేసుకునే కీలెస్ ఇగ్నిషన్ సిస్టమ్, లాంగ్ రైడింగ్‌లో కాళ్లు ఫ్రీగా ఉంచుకునేందుకు వీలుగా ముందు భాగంలో స్పెషల్ ఫ్రంట్ ఫుట్‌రెస్ట్ డిజైన్ ఇచ్చారు. అంతేకాకుండా, దీని టాప్ వేరియంట్లలో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సరికొత్త టిఎఫ్టి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ డిస్ప్లేను అందించారు. ఇది రైడర్‌కు నావిగేషన్, కాల్ అలర్ట్స్ వంటి సమాచారాన్ని స్క్రీన్‌పైనే చూపిస్తుంది.
ధర ఎంత? మైలేజ్ ఎంత ఇస్తుంది?
ఈ ప్రీమియం స్కూటర్ ప్రస్తుతం మార్కెట్లో రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరల ప్రకారం దీని ప్రారంభ వేరియంట్ ధర రూ.1,01,944 గా ఉండగా.. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.1,13,220 వరకు ఉంది. ఇక మైలేజ్ పరంగానూ ఈ స్కూటర్ రైడర్లను మెప్పిస్తోంది. నగరాల్లోని ట్రాఫిక్ కండిషన్లలో ఇది లీటరుకు దాదాపు 48 నుండి 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అదే సమయంలో ఏఆర్ఏఐ సర్టిఫికేషన్ ప్రకారం దీని గరిష్ట మైలేజ్ లీటరుకు 58.6 కిలోమీటర్లుగా సంస్థ పేర్కొంది.




