Skoda: 10 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా.. ఈ కారు కొనాలంటే అదృష్టం ఉండాలి
Skoda: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్కోడా ఆక్టావియా ఆర్‌ఎస్ కొత్త బ్యాచ్ అధికారికంగా విడుదలైంది.
Skoda
Skoda: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న స్కోడా ఆక్టావియా ఆర్‌ఎస్ కొత్త బ్యాచ్ అధికారికంగా విడుదలైంది. అత్యంత వేగవంతమైన ఈ స్పోర్టీ కారును దక్కించుకోవడానికి కేవలం 50 మందికి మాత్రమే అవకాశం ఉండటంతో కార్ ప్రియుల్లో తీవ్ర పోటీ నెలకొంది. స్కోడా సంస్థ భారత మార్కెట్‌లో తన పట్టును మరింత బలపరుచుకునే వ్యూహంలో భాగంగా ఈ ప్రత్యేక ఆర్‌ఎస్ మోడల్‌ను తీసుకొచ్చింది. విదేశాల నుంచి విడిభాగాల రూపంలో కాకుండా పూర్తిగా తయారైన కారుగా దిగుమతి అవుతుండటంతో దీని లభ్యత చాలా పరిమితంగా ఉంది. మొదటి బ్యాచ్‌కి ఊహించని రేంజ్‌లో డిమాండ్ రావడంతో ఇప్పుడు రెండో బ్యాచ్ కింద కేవలం 50 కార్లను మాత్రమే కేటాయించారు. గతంలో నవంబర్ 2025లో విడుదలైన మొదటి బ్యాచ్ ఎక్స్-షోరూమ్ ధర రూ.49.99 లక్షలు ఉండగా, కొత్తగా వచ్చిన ఈ బ్యాచ్ ధర ఏకంగా రూ.56.69 లక్షలకు చేరుకుంది. సుమారు రూ.6.70 లక్షలు (13.4 శాతం) ధర పెరిగినప్పటికీ ఈ కారును సొంతం చేసుకునేందుకు ప్రయాణికులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
రాకెట్ లాంటి స్పీడు.. పవర్ఫుల్ ఇంజిన్
స్కోడా ఆక్టావియా ఆర్‌ఎస్ వేగం విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. ఇందులో అమర్చిన 2.0 లీటర్ టీఎస్‌ఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ 265 పీఎస్ పవర్, 370 ఎన్ఎమ్ టాపిక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 7-స్పీడ్ డిఎస్‌జి గేర్‌బాక్స్‌తో జతకట్టిన ఈ కారు కేవలం 6.4 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్టంగా గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా దీని ఎలక్ట్రానిక్ పరిమితిని నిర్ణయించారు. మాంబా గ్రీన్, వెల్వెట్ రెడ్, మ్యాజిక్ బ్లాక్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో ఈ మోడల్ లభిస్తోంది. 19 అంగుళాల అలాయ్ వీల్స్, ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌లాంప్‌లు కారుకు రాచరికపు రూపాన్ని తీసుకొచ్చాయి.
అత్యాధునిక కేబిన్.. లగ్జరీ ఫీచర్లు
కారు లోపలి భాగం రేసింగ్ లుక్ ఇచ్చేలా స్వెడియా లెదర్ సీటింగ్‌తో తీర్చిదిద్దారు. ఎరుపు రంగు కుట్లతో ఉండే స్పోర్ట్స్ సీట్లు ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్, మసాజ్, హీటింగ్ సదుపాయాలతో వస్తాయి. డ్రైవర్ సౌకర్యం కోసం వర్చువల్ కాక్‌పిట్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్ వంటి ఖరీదైన ఫీచర్లను జతచేశారు. దూర ప్రయాణాల్లో కూడా ప్రయాణికులకు అలసట తెలియకుండా ఉండేలా అంతర్గత రూపురేఖలను డిజైన్ చేశారు.
10 ఎయిర్‌బ్యాగ్‌లతో సేఫ్టీ
ప్రయాణికుల సేఫ్టీ స్కోడా అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. ప్రమాదాల నుంచి కాపాడేందుకు ఏకంగా 10 ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేశారు. దీనికి తోడు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లైన్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (అడాస్) టెక్నాలజీ ఇందులో ఉంది. కారును సులువుగా పార్కింగ్ చేయడానికి ఇంటెలిజెంట్ పార్క్ అసిస్ట్, 360 డిగ్రీ ఏరియా వ్యూ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే వంటివి డ్రైవింగ్ అనుభవాన్ని మరింత భద్రంగా మారుస్తాయి.




