రూ. 5.59 లక్షలకే 5-స్టార్ సేఫ్టీ.. తక్కువ బడ్జెట్‌లో ప్రాణాలు కాపాడే టాప్ కార్లు ఇవే!
Safest Cars Under 10 Lakh: సొంత కారు కొనాలనే కలను నిజం చేసుకునే వేళ, కేవలం మైలేజ్ మాత్రమే చూస్తే సరిపోదు.
రూ. 5.59 లక్షలకే 5-స్టార్ సేఫ్టీ.. తక్కువ బడ్జెట్‌లో ప్రాణాలు కాపాడే టాప్ కార్లు ఇవే!
Safest Cars Under 10 Lakh: సొంత కారు కొనాలనే కలను నిజం చేసుకునే వేళ, కేవలం మైలేజ్ మాత్రమే చూస్తే సరిపోదు. రోడ్లపై ప్రయాణం క్షేమంగా సాగాలంటే పటిష్టమైన రక్షణ తప్పనిసరి. కేవలం రూ. 5.59 లక్షల ప్రారంభ ధరతోనే లగ్జరీ కార్లకు దీటుగా 5-స్టార్ రేటింగ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల భరోసాతో లభిస్తున్న కార్ల తెలుసుకుందాం.
బడ్జెట్ ధరలోనే..
ఒకప్పుడు అత్యున్నత భద్రత కావాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సామాన్యుడి బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు అత్యంత పటిష్టమైన కార్లను రంగంలోకి దించుతున్నాయి. 10 లక్షల లోపు బడ్జెట్‌లో ఫ్యామిలీ రక్షణకు పెద్దపీట వేస్తూ భారత్ ఎన్‌క్యాప్, గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టుల్లో 5-స్టార్ సాధించిన మోడళ్లు మార్కెట్‌లో దుమ్మురేపుతున్నాయి.
టాటా పంచ్: సామాన్యుడి రక్షణ కోట..
ఎంట్రీ లెవల్ బడ్జెట్‌లో కారు కొనాలనుకునే వారికి టాటా పంచ్ ఓ గొప్ప వరం. దీని ఎక్స్‌షోరూమ్ ధర కేవలం రూ. 5.59 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ప్రారంభ వేరియంట్‌లోనే 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లు లభిస్తున్నాయి. గ్లోబల్ ఎన్‌క్యాప్ టెస్టుల్లో 5-స్టార్ రేటింగ్ సాధించిన ఈ మైక్రో ఎస్‌యూవీ, మొదటిసారి కారు కొనే యువతకు, చిన్న కుటుంబాలకు అద్భుతమైన ఎంపికగా నిలిచింది.
హ్యుందాయ్ వెన్యూ, స్కోడా కైలాక్: నయా టెక్నాలజీతో టాప్ సేఫ్టీ..
ఈ విభాగంలో రికార్డు స్థాయి స్కోరుతో ముందువరుసలో నిలిచింది హ్యుందాయ్ వెన్యూ. భారత్ ఎన్‌క్యాప్ పరీక్షల్లో 32 పాయింట్లకు గాను 31.15 స్కోర్ సాధించి సత్తా చాటింది. దాదాపు రూ. 8 లక్షల ప్రారంభ ధరతో లభించే ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ ప్రామాణికంగా వస్తున్నాయి.
మరోవైపు యూరోపియన్ నిర్మాణ నాణ్యతతో వచ్చిన స్కోడా కైలాక్ కాంపాక్ట్ ఎస్‌యూవీ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. రూ. 7.59 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో లభించే ఈ కారు, భారత్ ఎన్‌క్యాప్‌లో పెద్దల రక్షణ విభాగంలో 30.88 స్కోర్ సాధించింది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, మల్టీ కొలిజన్ బ్రేకింగ్ వంటి అత్యున్నత ఫీచర్లు ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, టాటా నెక్సాన్: కుటుంబ ప్రయాణాలకు పక్కా సేఫ్టీ..
కుటుంబంతో కలిసి సుదూర ప్రయాణాలు చేసే వారికి మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ అద్భుతమైన భద్రతను అందిస్తుంది. రూ. 5.79 లక్షల ధరతో లభించే ఈ మోడల్ భారత్ ఎన్‌క్యాప్‌లో 5-స్టార్ సాధించడమే కాకుండా, పిల్లల రక్షణ విభాగంలో 49కి 43 పాయింట్లు దక్కించుకుంది. దీని 2,600 మిమీ వీల్‌బేస్ అదనపు స్థిరత్వాన్ని ఇస్తుంది.
భారతదేశపు మొదటి 5-స్టార్ కారుగా చరిత్ర సృష్టించిన టాటా నెక్సాన్ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుమారు రూ. 8.15 లక్షల ధరతో ప్రారంభమయ్యే నెక్సాన్, క్రాష్ టెస్టుల్లో పెద్దల రక్షణకు 34కి 32.22 పాయింట్లు, పిల్లల రక్షణకు 49కి 44.52 పాయింట్లు సొంతం చేసుకుంది. ఇందులో టైర్ ప్రెజర్ మానిటరింగ్ వంటి అధునాతన హంగులు లభిస్తాయి.
తక్కువ బడ్జెట్‌లో కార్లు తీసుకునే వారు కేవలం లుక్స్, మైలేజ్ మాత్రమే కాకుండా క్రాష్ టెస్ట్ రేటింగ్‌లను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. వాహనంలో ఉండే బలమైన బాడీ ఫ్రేమ్, అధునాతన భద్రతా ఏర్పాట్లే అత్యవసర సమయాల్లో ప్రయాణికుల ప్రాణాలకు నిజమైన కవచంగా నిలుస్తాయి.




