Royal Enfield : షోరూమ్‌లలో పండగే పండుగ.. క్లాసిక్, బుల్లెట్ కొట్టడానికి క్యూ కడుతున్న కుర్రకారు

Royal Enfield : జూన్ 2026లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్ 40,660 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. కంపెనీ ఓవరాల్ దేశీయ అమ్మకాలు 33 శాతం పెరిగాయి.

CR Reddy
Published on: 21 July 2026 7:58 AM IST
Royal Enfield
X

Royal Enfield

Royal Enfield : భారతీయ బైక్ ప్రియుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జూన్ 2026 నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్ మరోసారి తన సత్తా చాటుకుని కంపెనీ మోడళ్లలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. గత జూన్ నెలలో ఏకంగా 40,660 మంది కస్టమర్లు క్లాసిక్ 350 బైక్‌ను సొంతం చేసుకున్నారు. గతేడాది జూన్ 2025లో నమోదైన 29,172 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే, ఈసారి ఇది ఏకంగా 39 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయడం విశేషం.

చార్ట్‌లో రెండో స్థానంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 నిలిచింది. ఈ బైక్ గత నెలలో 54 శాతం వార్షిక పెరుగుదలతో మొత్తం 26,488 యూనిట్లు అమ్ముడుపోయింది. మూడో స్థానంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 నిలిచింది. హంటర్ 350 బైక్ 24 శాతం వృద్ధితో మొత్తం 20,289 యూనిట్ల విక్రయాలను సాధించింది. ఇక నాలుగో స్థానంలో నిలిచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 మోడల్ 45 శాతం పెరుగదలతో 10,941 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

ఐదో స్థానంలో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ మోడల్ 2,238 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసినప్పటికీ, గతేడాదితో పోలిస్తే 23 శాతం క్షీణతను చూసింది. ఆరో స్థానంలోని రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 39 శాతం తగ్గింపుతో 1,240 యూనిట్లకు పరిమితమైంది. అయితే, ఏడో స్థానంలో నిలిచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 మాత్రం 35 శాతం పెరుగుదలతో 944 యూనిట్ల విక్రయాలను సాధించి ఆకట్టుకుంది.

ఖరీదైన క్రూజర్ మోడళ్ల విక్రయాలు గత నెలలో కాస్త మందగించాయి. ఎనిమిదో స్థానంలో ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 90 శాతం భారీ క్షీణతతో కేవలం 98 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయింది. చిట్టచివరి స్థానంలో నిలిచిన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ మోడల్ 86 శాతం తగ్గింపుతో 32 యూనిట్ల విక్రయాలకే పరిమితమైంది.మొత్తంగా 33 శాతం పెరిగిన సేల్స్మొత్తంమీద జూన్ 2026 నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారతదేశంలో మొత్తం 1,02,930 బైక్‌లను విక్రయించింది. జూన్ 2025లో నమోదైన 76,957 యూనిట్లతో పోలిస్తే కంపెనీ ఓవరాల్ దేశీయ అమ్మకాలు 33 శాతం మేర పెరిగాయి. మార్కెట్లోకి ఎన్ని రకాల కొత్త స్టైలిష్ బైక్‌లు వచ్చినప్పటికీ, క్లాసిక్, బుల్లెట్ మోడళ్ల ప్రాభవం ఏమాత్రం తగ్గలేదని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story