Norton Atlas : భారత్‌లో పుట్టిన బ్రిటీష్ లెజెండ్.. నార్టన్ రీ ఎంట్రీ..!
Norton Atlas : ప్రముఖ బ్రిటీష్ మోటార్ సైకల్ బ్రాండ్ 'నార్టన్ మోటార్ సైకిల్స్' తన సరికొత్త పునరుజ్జీవన ప్రయాణంలో ఒక పెద్ద మైలురాయిని అధిగమించింది.
Norton Atlas
Norton Atlas : ప్రముఖ బ్రిటీష్ మోటార్ సైకల్ బ్రాండ్ 'నార్టన్ మోటార్ సైకిల్స్' తన సరికొత్త పునరుజ్జీవన ప్రయాణంలో ఒక పెద్ద మైలురాయిని అధిగమించింది. తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న టీవీఎస్ మోటార్ కంపెనీ తయారీ ప్లాంట్ నుండి మొట్టమొదటి 'నార్టన్ అట్లాస్' మోటార్ సైకిల్ విజయవంతంగా ఉత్పత్తి అయి బయటకు వచ్చింది. వచ్చే నెలలో జరగబోయే ఈ బైక్ అధికారిక గ్లోబల్ లాంచ్‌కు ముందే ఈ రోలౌట్ కార్యక్రమం జూన్ 24న ఘనంగా జరిగింది.
బ్రిటీష్ డిజైన్.. ఇండియన్ తయారీ
బ్రిటన్ దేశపు అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యానికి, భారతదేశపు టీవీఎస్ సంస్థ తయారీ నైపుణ్యానికి ఈ సరికొత్త అట్లాస్ బైక్ నిదర్శనంగా నిలిచింది. యూకేలోని సొలిహుల్‌లో ఉన్న నార్టన్ ప్రధాన కార్యాలయంలో ఈ బైక్‌ను డిజైన్ , ఇంజనీరింగ్ చేశారు. భారతదేశంలో దీనిని తయారు చేయడం వల్ల టీవీఎస్ సరఫరా వ్యవస్థ, నాణ్యతా ప్రమాణాలు నార్టన్ సంస్థకు కలిసిరానున్నాయి. ఈ బైక్ లభ్యతతో నార్టన్ సంస్థ వేగంగా విస్తరిస్తున్న మిడిల్‌వెయిట్ అడ్వెంచర్, స్పోర్ట్-టూరింగ్ విభాగాల్లోకి అడుగుపెట్టబోతోంది.
రెండు వేరియంట్లు.. పవర్‌ఫుల్ ఇంజన్
నార్టన్ అట్లాస్ శ్రేణి ప్రధానంగా రెండు వేరియంట్లలో లభించనుంది. ఇందులో అడ్వెంచర్ రైడింగ్‌ను ఇష్టపడేవారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'అట్లాస్' వేరియంట్‌లో మెరుగైన ఆఫ్-రోడింగ్ కోసం 19-ఇంచుల ఫ్రంట్ వీల్ ఉంటుంది. అలాగే రోడ్లపై ప్రయాణించడానికి అనువుగా ఉండే 'అట్లాస్ జీటీ' వేరియంట్‌లో ఇరువైపులా 17-ఇంచుల వీల్స్‌ను అమర్చారు. ఈ బైక్‌లో 585సీసీ లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది 9,300 ఆర్‌పీఎమ్ వద్ద 69 బీహెచ్‌పీ పవర్‌ను, 7,500 ఆర్‌పీఎమ్ వద్ద 57.5 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది తేలికపాటి స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది.
ఆధునిక ఫీచర్లు.. అధునాతన టెక్నాలజీ
నార్టన్ సంస్థ ఇప్పటివరకు అందించిన వాటిల్లోనే అత్యంత అధునాతన ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీని ఈ అట్లాస్ బైక్‌లో జోడించింది. ఇందులో 6-యాక్సిస్ ఐఎమ్‌యూ, లీన్-సెన్సిటివ్ రైడర్ ఎయిడ్స్, 5 రకాల రైడింగ్ మోడ్స్, పూర్తిగా అడ్జస్ట్ చేసుకోగలిగే కేవైబీ సస్పెన్షన్ , కార్నరింగ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు 8-ఇంచుల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే , స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం ప్రత్యేకంగా 'నార్టన్ రైడర్' యాప్ సదుపాయాన్ని కల్పించారు.
భారత్‌లో లాంచ్ ఎప్పుడు.?
ఈ 2026 చివరి నాటికి నార్టన్ అట్లాస్ బైక్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనున్నారు. అంతర్జాతీయంగా ఈ ఏడాది మూడో త్రైమాసికం నుండి కస్టమర్లకు డెలివరీలు ప్రారంభం కానున్నాయి. భారతదేశంలో ఈ బైక్‌లను టీవీఎస్ మోటార్స్ త్వరలో ప్రారంభించబోయే ప్రీమియం రిటైల్ నెట్‌వర్క్ 'టీవీఎస్ ప్యాడాక్' ద్వారా విక్రయించనున్నారు.
ఆరు దశాబ్దాల నాటి చరిత్ర
'అట్లాస్' అనేది నార్టన్ చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పేరు. మొదటిసారిగా 1962లో 745సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో అసలైన అట్లాస్ బైక్‌ను నార్టన్ మార్కెట్లోకి తెచ్చింది. ముఖ్యంగా అమెరికాలో లాంగ్ డిస్టెన్స్ టూరింగ్‌కు ఈ బైక్ అప్పట్లో ఎంతో పేరుగాంచింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే చారిత్రాత్మక పేరును ఆధునిక హంగులతో సరికొత్త అడ్వెంచర్ బైక్ రూపంలో నార్టన్ తిరిగి ప్రాణం పోసింది.




