Flex Fuel Car : జస్ట్ రూ.15 వేలకే మీ పాత పెట్రోల్ కారును ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్‌గా మార్చుకోవచ్చు
Flex Fuel Car : పెట్రోల్ కార్లను ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలుగా మార్చేందుకు కేవలం రూ.15,000 ఖర్చయ్యే సరికొత్త ఇథనాల్ కన్వర్షన్ కిట్‌ను ఐఐటీ ఢిల్లీ, ఇస్మా సంస్థలు విజయవంతంగా పరీక్షించాయి.
Flex Fuel Car
Flex Fuel Car : భారతదేశంలో ఇంధన ధరల భారాన్ని తగ్గించేందుకు, పర్యావరణ కాలుష్యాన్ని అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వాడకాన్ని విపరీతంగా పెంచుతోంది. ఇందులో భాగంగానే ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల హడావిడి మార్కెట్లో మొదలైంది. అయితే, సాధారణ వినియోగదారులు ఫ్లెక్స్ ఫ్యూయల్ కోసం మళ్లీ లక్షల రూపాయలు పెట్టి కొత్త కార్లు కొనాల్సిన అవసరం లేకుండా పాత పెట్రోల్ కార్లనే అప్‌గ్రేడ్ చేసుకునే సరికొత్త సాంకేతికతను మన దేశ నిపుణులు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
భారతీయ షుగర్ అండ్ బయో-ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) పాత పెట్రోల్ కార్ల కోసం ఒక ప్రత్యేకమైన ఇథనాల్ కన్వర్షన్ కిట్ ను ప్రతిపాదించింది. ఈ సాంకేతికతను పరీక్షించడానికి ఇస్మా సంస్థ విదేశాల నుంచి ఈ కిట్‌ను తెప్పించి, ప్రముఖ విద్యా సంస్థ ఐఐటీ ఢిల్లీతో కలిసి రీసెర్చ్ ప్రారంభించింది. ఈ కిట్ సహాయంతో సాధారణ పెట్రోల్ వాహనాలను E85, E100 వంటి అధిక ఇథనాల్ శాతం ఉండే ఫ్లెక్స్ ఫ్యూయల్‌పై నడిచేలా మార్చవచ్చు.
ఈ ప్రయోగంలో భాగంగా నిపుణులు బీఎస్-4 ప్రమాణాలు కలిగిన ఒక పాత మారుతి సుజుకీ స్విఫ్ట్ డిజైర్ కారును ఎంచుకున్నారు. ఆ కారుకు ఈ కొత్త ఇథనాల్ కన్వర్షన్ కిట్‌ను అమర్చి E20, E85, E100 ఇంధనాలతో వేర్వేరు పరిస్థితుల్లో నడిపారు. ఈ టెస్టింగ్‌లో భాగంగా ఆ కారు ఎలాంటి బ్రేక్‌డౌన్ లేకుండా సుమారు 5,000 నుంచి 10,000 కిలోమీటర్ల మేర విజయవంతంగా ప్రయాణించింది. ఇంజిన్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పరిశోధనలో తేలింది. ఈ కిట్ ద్వారా BS4, BS6 పెట్రోల్ వాహనాలను సులభంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్స్‌గా మార్చవచ్చని ఇస్మా స్పష్టం చేసింది.
ఈ ఇథనాల్ కన్వర్షన్ కిట్ గనుక ప్రభుత్వ రంగ సంస్థల నుంచి, ఆటోమొబైల్ రెగ్యులేటరీ బోర్డుల నుంచి తుది అనుమతులు పొందితే, దేశీయంగా దీని ఉత్పాదన పెద్ద ఎత్తున ప్రారంభం కానుంది. లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్ జరిగితే ఈ కిట్ ధరను వినియోగదారులకు కేవలం రూ.15,000 లకే అందుబాటులో ఉంచవచ్చని ఇస్మా ప్రతినిధులు చెబుతున్నారు. అయితే, కారులో కిట్ ఫిట్ చేయడానికి అయ్యే ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు, ప్రభుత్వ సర్టిఫికేషన్, ఇతర చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ మార్చాల్సి వస్తే మొత్తం ఖర్చు రూ.15,000 కంటే కాస్త అటుఇటుగా పెరిగే అవకాశం ఉంది.
ఇథనాల్ కన్వర్షన్ కిట్ అసలు ఎలా పనిచేస్తుంది?
సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ ఇంధనానికి ఎనర్జీ ఎఫిషియెన్సీ కాస్త తక్కువగా ఉంటుంది. అంటే సమానమైన పవర్ రావడానికి ఇంజిన్‌కు ఎక్కువ ఇథనాల్ అవసరమవుతుంది. ఈ కన్వర్షన్ కిట్‌లో ప్రత్యేకమైన ఇథనాల్ సెన్సార్లు, ఇంజిన్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సెట్టింగ్స్, చలికాలంలో కారు త్వరగా స్టార్ట్ అవ్వడానికి కోల్డ్ స్టార్ట్ సిస్టమ్, ఇథనాల్ కెమికల్స్ తట్టుకునే పటిష్టమైన పైపులు ఉంటాయి. ఇవన్నీ కలిసి కారులోని పాత ఇంజిన్‌ను ఇథనాల్ ఇంధనానికి తగినట్లుగా రీ-ట్యూన్ చేస్తాయి.
మార్కెట్లో E85 పెట్రోల్ విక్రయాలు ప్రారంభం
భారతదేశంలో జూన్ 2026 నుంచి E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ విక్రయాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. తొలి దశలో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 48 ప్రధాన పెట్రోల్ బంకుల్లో దీనిని అందుబాటులోకి తెచ్చారు. రాబోయే డిసెంబర్ 2026 నాటికి 500 బంకులకు, 2027 చివరి నాటికి ఏకంగా 5,000 పెట్రోల్ పంపులకు ఈ ఇంధనాన్ని విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం సాధారణ పెట్రోల్ ధరతో పోలిస్తే E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ ధర లీటరుకు రూ.20 వరకు తక్కువగా ఉంది. అయితే ఇథనాల్ డెన్సిటీ తక్కువగా ఉండటం వల్ల మైలేజ్ కాస్త తగ్గే అవకాశం ఉన్నందున, కస్టమర్లకు జరిగే అసలు ఆర్థిక లాభం అనేది వారు కారును వాడే విధానంపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.




