నిస్సాన్ ‘టెక్టాన్’ సంచలనం.. క్రేటా, సెల్టోస్‌లకు గట్టి పోటీ తప్పదా?

Nissan Tekton SUV India: ఈ సరికొత్త నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీ మార్కెట్లోకి వస్తే హ్యుందాయ్ క్రేటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టాటా సియెర్రా వంటి గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Venkat
Published on: 8 July 2026 7:46 PM IST
Nissan Tekton SUV India
X

నిస్సాన్ ‘టెక్టాన్’ సంచలనం.. క్రేటా, సెల్టోస్‌లకు గట్టి పోటీ తప్పదా?

Nissan Tekton SUV India: మిడిల్ క్లాస్ వాహనదారుల కలల ప్రపంచాన్ని శాసించేందుకు జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. మిడ్-సైజ్ ఎస్‌యూవీ విభాగంలో తన పూర్వ వైభవాన్ని కొనసాగించేందుకు ‘నిస్సాన్ టెక్టాన్’ (Nissan Tekton) పేరుతో ఒక పవర్‌ఫుల్ వెహికిల్‌ను జులై 9, 2026న ముంబై వేదికగా ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.

నిస్సాన్ ప్యాట్రోల్ ప్రేరణతో బోల్డ్ డిజైన్..

గతంలో వచ్చిన కిక్స్ మోడల్ తర్వాత నిస్సాన్ కంపెనీ భారత మార్కెట్లో కేవలం మ్యాగ్నైట్, గ్రావిటీ మోడళ్లపైనే ఎక్కువగా ఆధారపడింది. అయితే ఈసారి పక్కా వ్యూహంతో, సరికొత్త సిఎమ్‌ఎఫ్-బి (CMF-B) ప్లాట్‌ఫామ్‌పై ఈ టెక్టాన్ ఎస్‌యూవీని రూపొందించారు. అంతర్జాతీయంగా ఎంతో ప్రజాదరణ పొందిన నిస్సాన్ ప్యాట్రోల్ మోడల్ ఆధారంగా దీనిని తీర్చిదిద్దడం విశేషం.

ముందు భాగంలో బోల్డ్ లుక్ ఇచ్చే హారిజాంటల్ గ్రిల్, ఎల్-షేప్ ఎల్‌ఈడీ డే-టైమ్ రన్నింగ్ లైట్లు, కారు వెనుక భాగంలో కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఈ కారుకు రోడ్డుపై ఒక ప్రత్యేకమైన రూపాన్ని ఇవ్వనున్నాయి. యువతను ఆకట్టుకునేలా 18-ఇంచుల డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్, రూఫ్ రైల్స్ కూడా ఇందులో అమర్చారు.

లగ్జరీ ఫీచర్లతో విలాసవంతమైన క్యాబిన్..

కారు లోపలి భాగం విషయానికి వస్తే వినియోగదారులకు అల్ట్రా ప్రీమియం ఫీలింగ్ కలిగించేలా ఇంటీరియర్‌ను డిజైన్ చేశారు. సరికొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌తో పాటు గూగుల్ ఇన్‌బిల్ట్ టెక్నాలజీ కలిగిన 10.1-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 10.25-ఇంచుల పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతోపాటు వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అందించారు.

అలాగే, ఆరు స్పీకర్ల ప్రీమియం ఆడియో సిస్టమ్ మీ ప్రయాణాన్ని మరింత ఉల్లాసభరితంగా మారుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు పెద్ద కుటుంబాలకు లగ్జరీ ప్రయాణ అనుభూతిని అందిస్తాయి.

పవర్‌ఫుల్ టర్బో ఇంజిన్లు.. సేఫ్టీలో నో కాంప్రమైజ్..

పనితీరు పరంగా టెక్టాన్ ఎస్‌యూవీలో రెండు రకాల టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లను నిస్సాన్ అందిస్తోంది. మొదటిది 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (100 పీఎస్ పవర్, 160 ఎన్ఎమ్ టార్క్) కాగా, మరింత వేగం కోరుకునే వారి కోసం 1.3-లీటర్ పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (163 పీఎస్ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్) అందుబాటులో ఉండనుంది.

వీటికి 6-స్పీడ్ మాన్యువల్, అడ్వాన్స్డ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ (DCT) గేర్‌బాక్స్ ఆప్షన్లను జత చేశారు. ఇక సేఫ్టీ విషయంలో నిస్సాన్ ఎక్కడా రాజీ పడలేదు. 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరా, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లెవెల్-2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి అధునాతన ఫీచర్లు ఈ కారులో ప్రయాణించే వారికి పూర్తి భద్రతను చేకూరుస్తాయి.

ఈ సరికొత్త నిస్సాన్ టెక్టాన్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో రూ. 11 లక్షల నుంచి రూ. 18 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల శ్రేణిలో వచ్చే అవకాశం ఉంది. ఇది మార్కెట్లోకి వస్తే హ్యుందాయ్ క్రేటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టాటా సియెర్రా వంటి గట్టి పోటీ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story