కళ్లు మూసి తెరిచేలోపే 100 కిమీల స్పీడ్.. 11 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్.. ఇది కార్ కాదు, రాకెట్..!

Mercedes AMG GT Electric Car: ఈ కారు టాప్-స్పెక్ మోడల్ అయిన 'జీటీ 63' ఏకంగా 1,169 హార్స్ పవర్ సామర్థ్యాన్ని విడుదల చేస్తుంది. ఇది కేవలం 6.4 సెకన్లలోనే 200 కిలోమీటర్ల వేగాన్ని చాలా సులువుగా అందుకుంటుంది.

Venkat
Published on: 21 May 2026 12:57 PM IST
Mercedes AMG GT electric car
X

కళ్లు మూసి తెరిచేలోపే 100 కిమీల స్పీడ్.. 11 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్.. ఇది కార్ కాదు, రాకెట్..!

Mercedes AMG GT Electric Car: ప్రపంచ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్-బెంజ్ అంతర్జాతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి ఒక అద్భుతాన్ని వదిలింది. వేగానికి కొత్త నిర్వచనం చెపుతూ, రేసింగ్ ట్రాక్‌లపై సరికొత్త సంచలనాలకు సిద్ధమైంది. తన పవర్‌ఫుల్ రేసింగ్ విభాగం నుంచి సరికొత్త 'మెర్సిడెస్-ఏఎమ్‌జీ జీటీ 4-డోర్ కూపే' ఎలక్ట్రిక్ మోడల్‌ను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది.

పెట్రోల్ ఇంజన్‌కు గుడ్‌బై.. సరికొత్త ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్..

మెర్సిడెస్ కంపెనీ తన సెకండ్ జనరేషన్ వేరియంట్ కింద తీసుకొచ్చిన ఈ సరికొత్త మోడల్‌లో పాత వీ8 పెట్రోల్ ఇంజన్‌ను పూర్తిగా తొలగించింది. దీని స్థానంలో సరికొత్త '800V AMG.EA' ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌ను పరిచయం చేసింది. ఈ కారు వేగం ఎంతంటే.. మీరు కళ్లు మూసి తెరిచేలోపే, అంటే కేవలం 2.1 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌ను అందుకుంటుంది. ఈ రేసింగ్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ 'జీటీ 55', 'జీటీ 63' అనే రెండు పవర్‌ఫుల్ వేరియంట్లలో మార్కెట్లోకి తీసుకురావడం విశేషం.

హార్స్ పవర్ అరాచకం.. గాల్లో తేలే వేగం..

ఈ కారు టాప్-స్పెక్ మోడల్ అయిన 'జీటీ 63' ఏకంగా 1,169 హార్స్ పవర్ సామర్థ్యాన్ని విడుదల చేస్తుంది. ఇది కేవలం 6.4 సెకన్లలోనే 200 కిలోమీటర్ల వేగాన్ని చాలా సులువుగా అందుకుంటుంది. బ్రిటీష్ కంపెనీ వైఏఎస్ఏ (YASA) భాగస్వామ్యంతో తయారు చేసిన అత్యంత తేలికపాటి ఆక్సియల్ ఫ్లక్స్ ఎలక్ట్రిక్ మోటార్లను ఈ కారులో ఉపయోగించారు. సాధారణ మోటార్ల కంటే ఇవి చాలా సన్నగా ఉంటూనే, విపరీతమైన పవర్‌ను జనరేట్ చేస్తాయి. ఇందులో ముందు భాగంలో ఒకటి, వెనుక భాగంలో రెండు కలిపి మొత్తం మూడు మోటార్లు ఉంటాయి. స్టీరింగ్ ప్యాడిల్స్ రెండింటినీ ఒకేసారి నొక్కితే మరో 150 హార్స్ పవర్ అదనపు బూస్ట్ పవర్ అన్‌లాక్ అవుతుంది.

11 నిమిషాల ఛార్జింగ్.. మైండ్ బ్లోయింగ్ రేంజ్..

ఈ కారు అల్ట్రా-ఫాస్ట్ 600 కిలోవాట్ డీసీ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. దీని సహాయంతో కారులోని బ్యాటరీ కేవలం 11 నిమిషాల్లోనే 10 నుండి 80 శాతానికి ఛార్జ్ అయిపోతుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తోనే ఏకంగా 460 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని మెర్సిడెస్ సంస్థ స్పష్టం చేసింది. ఈ బ్యాటరీ ప్యాక్ లోపల 2,660 సిలిండ్రికల్ సెల్స్ ఉంటాయి. బ్యాటరీ వేడెక్కకుండా ఉండటానికి వీటికి ప్రత్యేకమైన నాన్-కండక్టివ్ ఆయిల్‌తో కూడిన కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇక రేంజ్ విషయానికి వస్తే, సింగిల్ ఛార్జ్‌పై జీటీ 55 మోడల్ 700 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, జీటీ 63 మోడల్ 696 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

ఈవీ కారే.. కానీ వింటేజ్ వీ8 ఇంజన్ సౌండ్ వస్తుంది..!

ఎలక్ట్రిక్ కార్లలో ఇంజన్ శబ్దం రాదనే వెలితి లేకుండా మెర్సిడెస్ ఒక అద్భుతమైన మ్యాజిక్ చేసింది. ఇందులోని ఏఎమ్‌జీ ఫోర్స్ ఎస్+ (AMG FORCE S+) డ్రైవింగ్ మోడ్‌ను ఆన్ చేస్తే, పాత ఐకానిక్ ఏఎమ్‌జీ జీటీ ఆర్ కారుకు సంబంధించిన 1,600 కి పైగా రియల్ సౌండ్ ఫైల్స్ ఆధారంగా క్రియేట్ చేసిన నిజమైన వీ8 ఇంజన్ సౌండ్ లోపల వినిపిస్తుంది. స్టీరింగ్ ప్యాడిల్స్ నొక్కినప్పుడు ట్విన్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ గేర్లు మారుతున్నట్లు చేతులకు వైబ్రేషన్ కూడా వస్తుంది. స్క్రీన్‌పై టాకోమీటర్ డిస్‌ప్లే కూడా మారుతూ ప్యూర్ రేసింగ్ కార్ ఫీలింగ్ ఇస్తుంది.

ఫ్యూచరిస్టిక్ లుక్.. విలాసవంతమైన ఇంటీరియర్..

భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, పాత మోడల్ కంటే ఈ కారు 4 సెంటిమీటర్లు తక్కువ ఎత్తుతో, పక్కా స్పోర్ట్స్ కార్ లుక్‌తో ఉంటుంది. వెనుక చక్రాలు కూడా 6 డిగ్రీల వరకు తిరిగేలా రియర్-యాక్సిల్ స్టీరింగ్ ఫీచర్ ఇచ్చారు. దీనివల్ల తక్కువ స్థలంలోనూ కారును సులువుగా యూ-టర్న్ తీసుకోవచ్చు. ఇంటీరియర్ విషయానికి వస్తే.. డాష్‌బోర్డ్‌పై ఒకే ఒక పెద్ద సీమ్‌లెస్ గ్లాస్ ప్యానల్ ఉంటుంది. ఇందులో డ్రైవర్ కోసం 10.2 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సెంటర్లో డ్రైవర్ వైపు వంగి ఉండే 14 ఇంచుల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్ ఉన్నాయి. డిజైన్‌తో పాటు 507 లీటర్ల బూట్ స్పేస్, ముందు వైపు 62 లీటర్ల ఫ్రంక్ స్పేస్ ఇచ్చి ప్రాక్టికాలిటీని పెంచారు. ఈ లగ్జరీ సూపర్ కారు అంచనా ధర దాదాపు రూ. 3.30 కోట్లు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండవచ్చు.

మెర్సిడెస్-బెంజ్ ఆవిష్కరించిన ఈ సరికొత్త ఏఎమ్‌జీ జీటీ మోడల్ భవిష్యత్తు ఎలక్ట్రిక్ సూపర్ కార్ల మార్కెట్‌కు దిక్సూచిగా మారనుంది. కేవలం పర్యావరణహితంగానే కాకుండా, రేసింగ్ ప్రియులను ఆకట్టుకునే వేగం, మైండ్ బ్లోయింగ్ ఛార్జింగ్ సమయంతో ఈ కారు కోటీశ్వరుల గ్యారేజీలలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story