Maruti Suzuki : దేశీయ మార్కెట్లో ఫస్ట్ టైం 2 లక్షలు దాటిన సేల్స్..రికార్డు క్రియేట్ చేసిన మారుతి సుజుకీ

Maruti Suzuki : మారుతీ సుజుకీ జులై 2026లో ఏకంగా 2,41,421 వాహనాలను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది. దేశీయ మార్కెట్లో తొలిసారిగా ఒకే నెలలో 2 లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి.

CR Reddy
Published on: 2 Aug 2026 8:34 AM IST
Maruti Suzuki
X

Maruti Suzuki 

Maruti Suzuki : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా జులై 2026లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక నెలవారీ అమ్మకాలతో సరికొత్త చరిత్ర సృష్టించింది. జులై నెలలో దేశీయ మార్కెట్లో ఏకంగా 2,00,123 వాహనాలను విక్రయించింది. మారుతీ సుజుకీ కంపెనీ చరిత్రలోనే ఒకే నెలలో 2 లక్షలకు పైగా వాహనాలు అమ్ముడవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఎగుమతులు, ఇతర ఆటో కంపెనీలకు సరఫరా, దేశీయ విక్రయాలు అన్నింటినీ కలిపి జులై నెలలో మొత్తం 2,41,421 వాహనాలను అమ్మేసింది. గత ఏడాది జులై 2025లో ఈ సంఖ్య 1,80,526 యూనిట్లుగా ఉండగా, ఈసారి దాదాపు 34 శాతం భారీ వృద్ధిని నమోదు చేసింది.

ప్యాసింజర్ కార్లు, కమర్షియల్ వెహికల్స్‌లోనూ జోరు

ఈ జులై నెలలో మారుతీ సుజుకీ ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో 1,96,203 యూనిట్లను విక్రయించగా, లైట్ కమర్షియల్ వెహికల్స్ రంగానికి చెందిన సూపర్ క్యారీ మోడల్స్ 3,920 యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటితో పాటు ఇతర వాహన తయారీ సంస్థలకు ఓఈఎమ్ కింద 11,242 యూనిట్లను సరఫరా చేయడంతో పాటు, విదేశాలకు ఏకంగా 30,056 వాహనాలను ఎగుమతి చేసి గ్లోబల్ మార్కెట్‌లోనూ తన సత్తా చాటుకుంది.

ఎస్ యూవీలు, కంపాక్ట్ కార్లకు పెరిగిన విపరీతమైన క్రేజ్

మారుతీ నుంచి వస్తున్న ఎస్‌యూవీ, ఎంపీవీ మోడళ్లకు మార్కెట్‌లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. బ్రెజా, ఎర్టిగా, ఈ-విటారా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, విక్టోరిస్ మరియు ఎక్స్‌ఎల్6 వంటి మోడళ్లు కలిపి జులై 2026లో 78,851 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది జులైలో ఈ సంఖ్య కేవలం 52,773 యూనిట్లుగా మాత్రమే ఉండేది. మరోవైపు ఆల్టో, ఎస్-ప్రెస్సో, బలేనో, సెలెరియో, సియాజ్, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగన్-ఆర్ వంటి హ్యాచ్‌బ్యాక్ మరియు సెడాన్ మోడళ్లు కూడా 1,03,456 యూనిట్ల సేల్స్‌తో దూసుకుపోయాయి.

ఈకో వ్యాన్, సూపర్ క్యారీ మోడల్స్ సేల్స్ అప్

సరుకు రవాణా, కుటుంబ అవసరాలకు ఎక్కువగా ఉపయోగపడే మారుతీ ఈకో వ్యాన్ విక్రయాలు కూడా భారీగా పెరిగాయి. జులై 2026లో 13,896 ఈకో వ్యాన్లు అమ్ముడవగా, గత ఏడాది జులైలో ఇవి 12,341 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. అలాగే వాణిజ్య వాహనం అయిన సూపర్ క్యారీ 3,920 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.

ఏప్రిల్ నుండి జులై వరకు రికార్డు స్థాయి ప్రదర్శన

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) మొదటి నాలుగు నెలల వ్యవధిని (ఏప్రిల్ నుంచి జులై వరకు) పరిశీలిస్తే, మారుతీ సుజుకీ మొత్తం 9,24,145 వాహనాలను విక్రయించి రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ 7,08,387 వాహనాలను మాత్రమే విక్రయించింది. ఈ నాలుగు నెలల కాలంలో దేశీయ మార్కెట్లోనే ప్యాసింజర్, కమర్షియల్ విభాగాలు కలిపి 7,34,930 వాహనాలు అమ్ముడవ్వగా, 1,54,792 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. ఓఈఎమ్ విక్రయాలను కూడా కలుపుకుంటే నాలుగు నెలల్లో మొత్తం దేశీయ అమ్మకాలు 7,69,353 యూనిట్లకు చేరాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story