Maruti Brezza : మారుతి బ్రెజ్జా కొత్త మోడల్.. జూలై 23న మార్కెట్లోకి ఎంట్రీ.!
Maruti Brezza : కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) సరికొత్త మార్పులతో మార్కెట్లోకి వచ్చేందుకు..
Maruti Suzuki SUV
Maruti Brezza : కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) సరికొత్త మార్పులతో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమైంది. జూలై 23న ఈ మోడల్‌ను సంస్థ అధికారికంగా లాంచ్ చేయనుంది. 2022లో సెకండ్ జనరేషన్ మోడల్ విడుదలైన తర్వాత ఈ కారుకు జరుగుతున్న మొదటి పెద్ద అప్‌డేట్ ఇదే. ఈ కొత్త వెర్షన్‌లో కేవలం బాహ్య డిజైన్ మాత్రమే కాకుండా, సరికొత్త పవర్‌ఫుల్ ఇంజిన్ ఆప్షన్‌ను కూడా మారుతి సుజుకి పరిచయం చేయబోతోంది.
సరికొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్
ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో-పెట్రోల్ (Boosterjet Turbo-Petrol) ఇంజిన్‌ను తీసుకువచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఇంజిన్ మారుతి ఫ్రాంక్స్ కారులో అందుబాటులో ఉంది. ఇది 100bhp పవర్, 148Nm టాక్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ను 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయనున్నారు. ఇప్పటివరకు బ్రెజ్జా కేవలం 1.5-లీటర్ నార్మల్ పెట్రోల్ ఇంజిన్‌తోనే వస్తుండటంతో, టర్బో ఇంజిన్లని ఇష్టపడే వారికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా మారనుంది.
తక్కువ పన్నుతో ధరలో వెసులుబాటు
భారతదేశ పన్ను నిబంధనల ప్రకారం, 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండి, 1200cc లోపు పెట్రోల్ ఇంజిన్ కలిగిన వాహనాలపై 18 శాతం మాత్రమే జీఎస్టీ విధిస్తారు. ప్రస్తుతం ఉన్న 1.5-లీటర్ ఇంజిన్ కంటే ఈ చిన్న కెపాసిటీ టర్బో ఇంజిన్ వల్ల కంపెనీకి పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రయోజనాన్ని సంస్థ కస్టమర్లకు బదిలీ చేస్తే, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఈ టర్బో వేరియంట్లను మార్కెట్లో పోటీ ధరకే అందించే అవకాశం ఉంటుంది. అలాగే, పాత 1.5-లీటర్ పెట్రోల్, సిఎన్‌జి (CNG) మోడల్స్ కూడా విక్రయాల్లో కొనసాగుతాయి.
అప్‌డేట్ అయిన డిజైన్, లగ్జరీ ఫీచర్లు
బాహ్య రూపురేఖల విషయానికి వస్తే, ఈ కారులో చిన్నపాటి మార్పులు మాత్రమే చోటు చేసుకోనున్నాయి. ముందు భాగంలో కొత్త బంపర్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ రానుండగా, వెనుక భాగంలో ఆధునిక శైలికి తగ్గట్టుగా 'కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్' , సరికొత్త అల్లాయ్ వీల్స్‌ను అమర్చనున్నారు.
క్యాబిన్ లోపల లగ్జరీ ఫీలింగ్ కోసం ఫీచర్ల జాబితాను పెంచారు. ప్రస్తుతమున్న 9-ఇంచ్ స్క్రీన్ స్థానంలో పెద్ద 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రానుంది. వీటితో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, యాంబియంట్ లైటింగ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ల వంటి ప్రీమియం ఫీచర్లను కూడా ఈ కారులో జోడించబోతున్నారు.
మార్కెట్లో గట్టి పోటీ
కొత్త ఫీచర్లు , అదనపు ఇంజిన్ ఆప్షన్ రావడం వల్ల కొత్త బ్రెజ్జా ధర ప్రస్తుత మోడల్ కంటే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లోకి విడుదలైన తర్వాత ఇది టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO , స్కోడా కైలాక్ వంటి ప్రముఖ కాంపాక్ట్ ఎస్‌యూవీ మోడళ్లతో పోటీ పడనుంది.




