ఆగస్టు 15న కొత్త మహీంద్రా థార్ ల్యాండింగ్.. అదిరిపోయే ఫీచర్లతో అడ్వెంచర్ ప్రియులకు పండగే!
Mahindra Thar: ఆటోమొబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహీంద్రా 3-డోర్ థార్ ఫేస్‌లిఫ్ట్ ఆగస్టు 15న మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
ఆగస్టు 15న కొత్త మహీంద్రా థార్ ల్యాండింగ్.. అదిరిపోయే ఫీచర్లతో అడ్వెంచర్ ప్రియులకు పండగే!
Mahindra Thar 2026: ఆటోమొబైల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న మహీంద్రా 3-డోర్ థార్ ఫేస్‌లిఫ్ట్ ఆగస్టు 15న మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. అడ్వాన్స్డ్ సేఫ్టీ ఏడాస్ (ADAS) టెక్నాలజీ, ప్రీమియం ఇంటీరియర్స్, అదిరిపోయే లుక్స్‌తో వస్తున్న ఈ కొత్త మోడల్ ఎస్‌యూవీ లవర్స్‌కు సరికొత్త అనుభూతిని అందించనుంది.
ఆఫ్రోడింగ్ కింగ్ అనిపించుకున్న మహీంద్రా థార్ ఇప్పుడు భద్రత విషయంలోనూ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతోంది. 2026 కొత్త మోడల్‌లో అత్యంత ఆధునికమైన అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్‌ను మహీంద్రా జోడిస్తోంది. విండ్ షీల్డ్ వెనుక అమర్చిన కెమెరా ఆధారంగా పనిచేసే ఈ సాంకేతికత వల్ల ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి భద్రతా సదుపాయాలు వాహనదారునికి అందుబాటులోకి రానున్నాయి. థార్ రాక్స్, స్కార్పియో-ఎన్ మోడళ్ల తరహాలోనే ఇది కూడా ప్రయాణికులకు గరిష్ట రక్షణను ఇస్తుంది.
కార్లో కాలుపెడితే హైటెక్ అనుభూతి..!
కొత్త థార్ ఇంటీరియర్‌ను మహీంద్రా అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దింది. పాత అనలాగ్ క్లస్టర్ స్థానంలో పెద్దదైన 10.25 అంగుళాల డిజిటల్ టీఎఫ్‌టీ (TFT) ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. నావిగేషన్, ఆఫ్ రోడ్ డేటా, ఫ్యూయల్ వివరాలను ఇది స్పష్టంగా చూపిస్తుంది. లాంగ్ డ్రైవ్‌లో అదిరిపోయే సౌండ్ ఎక్స్‌పీరియన్స్ కోసం హార్మన్ కార్డన్ (Harman Kardon) ప్రీమియం ఆడియో సిస్టమ్‌ను సైతం జోడించారు. రఫ్ అండ్ టఫ్ కేరెక్టర్ కోరుకునే వారికి ఇది మ్యూజిక్ థ్రిల్‌ను రెట్టింపు చేస్తుంది.
అదిరిపోయే డిజైన్.. అది కూలింగ్ ఫీచర్లు..!
బయటి రూపంలోనూ కొత్త మెరుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాక్స్ మోడల్ నుంచి స్ఫూర్తి పొందిన సి-షేప్డ్ డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లాంప్‌లు, సరికొత్త ఫ్రంట్ గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్లు వాహనానికి మరింత లగ్జరీ లుక్‌ను తీసుకొచ్చాయి. డ్యూయల్ టోన్ 18 అంగుళాల అలాయ్ వీల్స్, కొత్త ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్‌లు ఆకట్టుకుంటున్నాయి.
ఎండకాలంలో హాయిగా ప్రయాణించేందుకు వీలుగా ముందు సీట్లకు వెంటిలేటెడ్ సదుపాయం కల్పించారు. మాన్యువల్ ఏసీ స్థానంలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ రావడం వల్ల ప్రయాణం మరింత సుఖవంతంగా మారనుంది.
స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రానున్న ఈ కొత్త 3-డోర్ థార్, లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరచుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సరికొత్త హంగులు, అగ్రశ్రేణి భద్రతా ఫీచర్లు తోడవడంతో ఈ బండి కస్టమర్ల మనసులను దోచుకోవడానికి సిద్ధమైపోయింది.




