Mahindra BE 6 Sporteq EV: మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. రేపే గ్రాండ్ లాంచ్
Mahindra BE 6 Sporteq EV: దేశీయ వాహన దిగ్గజం మహీంద్రా ఆగస్టు 15 వేడుకలకు ముందే తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బీఈ 6 స్పోర్టెక్ వెర్షన్‌తో మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తోంది.
Mahindra BE 6 Sporteq EV
Mahindra BE 6 Sporteq EV: ప్రతేడాది లాగే ఈసారి కూడా ఆగస్టు 15 పండగను మహీంద్రా చాలా ప్రత్యేకంగా మార్చుకోనుంది. అధికారికంగా మార్కెట్‌లోకి ఆవిష్కరించడానికి ముందే మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్ ఇంటీరియర్ ఫొటోలు బయటకు వచ్చి నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతున్నాయి. బీఈ 6 ఎస్‌యూవీలో ఇప్పటివరకు డ్యూయల్ స్క్రీన్ సెటప్ మాత్రమే ఉండగా, కొత్తగా వస్తున్న స్పోర్టెక్ వేరియంట్‌లో ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా మరో డిస్‌ప్లేను చేర్చారు. దీంతో డాష్‌బోర్డ్ నిండా త్రిపుల్ స్క్రీన్ సెటప్ కనిపించనుంది. ఇప్పటికే ఎక్స్ఈవీ 9ఈ, ఎక్స్ఈవీ 9ఎస్ మోడళ్లలో మెరిసిన ఈ సూపర్ టెక్నాలజీని ఇప్పుడు బీఈ 6 స్పోర్టెక్ వేరియంట్‌లో కూడా అందిస్తుండటం గమనార్హం.
ఇంటీరియర్ డిజైన్‌లో లగ్జరీ మార్పులు
కొత్తగా లీకైన చిత్రాలను పరిశీలిస్తే వాహనం లోపలి భాగంలో అనేక లగ్జరీ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్లాక్ అండ్ టాన్ రంగుల కాంబినేషన్‌తో సరికొత్త కలర్ స్కీమ్‌ను పరిచయం చేశారు. ఈ రెండు రంగుల కాంబినేషన్ కేవలం సీట్లు, డాష్‌బోర్డ్‌కే కాకుండా డోర్ల లోపలి భాగం వరకు విస్తరించి ఉంది. గతంలో ఉన్న మోడళ్లలో డ్రైవర్ చుట్టూ హేలో లూప్ డిజైన్ ఉండేది. దీనివల్ల రెండో కప్ హోల్డర్ అమర్చడానికి, వైర్‌లెస్ ఛార్జర్ తో పాటు యూఎస్‌బీ పోర్టులను వాడుకోవడానికి ప్యాసింజర్లకు తీవ్ర ఇబ్బందిగా మారేది. కొత్త స్పోర్టెక్ వర్షన్‌లో ఆ లూప్‌ను తొలగించి, అదనంగా మరొక కప్ హోల్డర్‌ను చేర్చడం ద్వారా ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు.
682 కిలోమీటర్ల భారీ రేంజ్.. పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్
మెకానికల్ పరంగా బీఈ 6 స్పోర్టెక్ వెర్షన్ దాదాపు రెగ్యులర్ మోడల్ లాగే ఉండనుంది. ఇందులో 59 కేడబ్ల్యూహెచ్, 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను ఇచ్చే అవకాశం ఉంది. ఈ మోడల్‌లోని ఎలక్ట్రిక్ మోటార్ 286 హెచ్‌పీ పవర్, 380 ఎన్ఎమ్ టార్క్‌ను సరఫరా చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 682 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ప్రయాణించవచ్చని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి ఈ రేంజ్ గొప్ప ప్లస్ పాయింట్‌గా మారనుంది.
టాటా, హ్యుందాయ్ ఈవీలకు గట్టి పోటీ
ప్రస్తుతం మహీంద్రా బీఈ 6 ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ. 18.90 లక్షల నుంచి రూ. 26.90 లక్షల వరకు ఉంది. కొత్తగా రాబోతున్న స్పోర్టెక్ మోడల్‌లో అధునాతన త్రిపుల్ స్క్రీన్, లగ్జరీ ఫీచర్లు ఉన్నందున ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. మార్కెట్‌లో ముందస్తుగా ఉన్న టాటా సియెర్రా ఈవీ (రూ. 18.79 లక్షల నుంచి రూ. 25.99 లక్షలు), హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ (రూ. 18.03 లక్షల నుంచి రూ. 23.67 లక్షలు) మోడళ్లకు మహీంద్రా బీఈ 6 స్పోర్టెక్ ప్రధాన పోటీదారుగా నిలవనుంది.




