Koenigsegg: ప్రపంచ వ్యాప్తంగా 70 మందికే ఛాన్స్.. తూటాలను తట్టుకోవడమే కాదు, ఘోస్ట్ ఫైబర్ ఫీచర్‌తో మెగాకార్ ఎంట్రీ..!
Koenigsegg: ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రలో సరికొత్త సంచలనం..! విలాసానికి, కళ్లు చెదిరే వేగానికి మారుపేరైన స్వీడిష్ సంస్థ 'కొయినిగ్సెగ్' అద్భుతమైన మెగాకార్ను ఆవిష్కరించింది.
Koenigsegg: ప్రపంచ వ్యాప్తంగా 70 మందికే ఛాన్స్.. తూటాలను తట్టుకోవడమే కాదు, ఘోస్ట్ ఫైబర్ ఫీచర్‌తో మెగాకార్ ఎంట్రీ..!
Koenigsegg: ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రలో సరికొత్త సంచలనం..! విలాసానికి, కళ్లు చెదిరే వేగానికి మారుపేరైన స్వీడిష్ సంస్థ 'కొయినిగ్సెగ్' అద్భుతమైన మెగాకార్ను ఆవిష్కరించింది. భూమిమీద కేవలం 70 మందికి మాత్రమే దక్కే ఈ రయ్ మనే వాహనం, రేస్ ట్రాక్‌తో పాటు సాధారణ రోడ్లపైనా దుమ్మురేపడానికి మార్కెట్లోకి వచ్చేసింది.
అదరగొట్టే ఇంజిన్.. ఏరోడైనమిక్ డిజైన్..
స్వీడిష్ లగ్జరీ ఆటోమేకర్ కొయినిగ్సెగ్ (Koenigsegg) ప్రపంచ కుబేరులను టార్గెట్ చేస్తూ 'సీసీజీటీ1' (CCGT1) మెగాకార్ను పరిచయం చేసింది. గతం నాటి సీసీజీటీ జీటీ1 ఎండ్యూరెన్స్ రేసింగ్ కారు స్ఫూర్తితో రూపొందిన ఈ కారులో ట్విన్-టర్బోచార్జ్డ్ వీ8 (V8) ఇంజిన్ అమర్చారు. సాధారణ పెట్రోల్ వాడితే 1,280 హార్స్పవర్, అదే ఈ85 (E85) ఇంధనం వాడితే ఏకంగా 1,600 హార్స్‌పవర్‌ను ఇది ఉత్పత్తి చేస్తుంది. తొమ్మిది స్పీడ్ల లైట్ స్పీడ్ ట్రాన్స్మిషన్ (LST) వ్యవస్థ దీనికి అదనపు బలాన్ని ఇస్తుంది. గేర్లను మార్చుకునేందుకు ఆటో, సీక్వెన్షియల్, మాన్యువల్, రివర్స్ మోడ్స్‌ను సూచించే 'ఏఎస్ఎమ్ఆర్' (ASMR) డయల్ ఇవ్వడం మరో ఆకర్షణ.
విపరీతమైన వేగంతో గాలిని చీల్చుకుంటూ వెళ్లే సమయంలో కారు అదుపు తప్పకుండా ఇంజినీర్లు ఏరోడైనమిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. వెనుక భాగంలో ఉన్న భారీ వింగ్ డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా 30 డిగ్రీల మేర దానంతట అదే సర్దుబాటు అవుతుంది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తున్న సమయంలో ఈ మెగాకార్ ఏకంగా 800 కిలోల డౌన్‌ఫోర్స్‌ను సృష్టిస్తూ రోడ్డుకు అతుక్కుపోయేలా ప్రయాణిస్తుంది.
రేస్ ట్రాక్ అనుభూతినిచ్చే మోడ్రన్ క్యాబిన్..
కారు లోపలికి అడుగుపెట్టగానే అచ్చం మోటార్ స్పోర్ట్ కారులో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. ఇగ్నిషన్ స్విచ్, ఫ్యూయల్ పంప్ టోగుల్, ఎర్రటి స్టార్టర్ బటన్ డ్రైవర్‌కు సరికొత్త థ్రిల్ ఇస్తాయి. డిజిటల్ స్క్రీన్లకు బదులుగా, కేవలం గురుత్వాకర్షణ శక్తితోనే పనిచేసే అనలాగ్ జీ-మీటర్‌ను (G-meter) డ్యాష్‌బోర్డులో అమర్చారు. తేలికపాటి కార్బన్ ఫైబర్ సీట్లు, సిక్స్-పాయింట్ హార్నెస్ డ్రైవర్‌కు అదనపు భద్రత కల్పిస్తాయి.
మరింత రేసింగ్ ఫీల్ కావాలనుకునే వారు 'ట్రాక్ ప్యాకేజీ'ని ఎంచుకోవచ్చు. దీనిద్వారా రోల్ కేజ్, అదనపు టైర్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిస్టమ్ లాంటివి కారులో ఇన్స్టాల్ చేస్తారు. ఈ కారును కొనుగోలు చేసిన కస్టమర్లకు సంస్థ ప్రత్యేకంగా నిర్వహించే ట్రాక్ ఈవెంట్స్‌లో పాల్గొనే అరుదైన అవకాశం దక్కుతుంది.
తూటాలను సైతం తట్టుకునే 'ఘోస్ట్ ఫైబర్' టెక్నాలజీ..
ఈ మెగాకార్ను అత్యంత ప్రత్యేకం చేసే మరో గొప్ప ఆవిష్కరణ 'ఘోస్ట్ ఫైబర్' టెక్నాలజీ. గతంలో వచ్చిన వైట్ కార్బన్-ఫైబర్ టెక్నాలజీని మెరుగుపరుస్తూ ఇప్పుడు అరమిడ్-కార్బన్ మిశ్రమాన్ని ఈ కారు నిర్మాణంలో ఉపయోగించారు. ఇది వాహనానికి తళతళలాడే తెల్లటి మెరుపును మాత్రమే కాదు, తుపాకీ తూటాలను సైతం సునాయాసంగా తట్టుకోగల (బాలిస్టిక్ ప్రొటెక్షన్) దృఢత్వాన్ని అందిస్తుంది.
బయటి శబ్దాలు లోపలికి రాకుండా ఇది కవచంలా అడ్డుకుంటుంది. సాధారణ కార్బన్ ఫైబర్ బాడీ కంటే దీని బరువు చాలా తక్కువ. కారు రయ్‌మని దూసుకెళ్లడానికి ఈ తక్కువ బరువు ఎంతగానో సహకరిస్తుంది.
కోట్ల రూపాయల ధర పలికే ఈ మోడల్ కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ అద్భుతానికి నిలువెత్తు నిదర్శనం. లగ్జరీ కార్ల భవిష్యత్తులో టెక్నాలజీ ఏ స్థాయికి వెళ్లనుందో ఈ కొయినిగ్సెగ్ మెగాకార్ స్పష్టంగా తెలియజేస్తోంది.




