July 2026 Car Launches : జూలైలో కొత్త కార్ల జాతర.. మార్కెట్లోకి వస్తున్న 4 సరికొత్త క్రేజీ ఎస్‌యూవీలు
July 2026 Car Launches : కార్ల లవర్స్‌కు జూలై నెలలో పండగే. మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్, హోండా, నిస్సాన్, ఎమ్జీ కంపెనీల నుంచి మార్కెట్లోకి రాబోతున్న 4 అదిరిపోయే సరికొత్త ఎస్‌యూవీల పూర్తి వివరాలు తెలుసుకుందాం.
July 2026 Car Launches
July 2026 Car Launches : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీ కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జూన్ నెలలో స్కోడా కోడియాక్ ఆర్‌ఎస్, వ్యాగన్ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్, టాటా సియెర్రా ఈవీ వంటి మోడళ్లతో సందడి చేసిన కంపెనీలు.. జూలై నెలలో మరింత గట్టిగా ప్లాన్ చేశాయి. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే బడ్జెట్ కార్ల నుంచి ప్రీమియం రేంజ్ కార్ల వరకు ఏకంగా నాలుగు సరికొత్త ఎస్‌యూవీలు జూలైలో రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మారుతి సుజుకి, హోండా, నిస్సాన్, ఎమ్జీ మోటార్స్ బ్రాండ్ల నుంచి రాబోతున్న ఆ సరికొత్త కార్ల విశేషాలు ఏంటో ఇప్పుడు విడివిడిగా చూద్దాం.
హోండా జెడ్ఆర్-వి
హోండా కంపెనీ తన ప్రీమియం ఎస్‌యూవీ మోడల్ జెడ్ఆర్-వి ధరలను జూలై నెలలో అధికారికంగా ప్రకటించబోతోంది. మే నెలలోనే దీనిని అన్విల్ చేసినప్పటికీ, ధర ఎంత అనే సస్పెన్స్‌ను మాత్రం కంపెనీ అలాగే ఉంచింది. ముంబై ఆన్-రోడ్ ధరల ప్రకారం ఇది సుమారు రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల రేంజ్‌లో ప్రీమియం విభాగంలో ఉండే అవకాశం ఉంది. ఇందులో 2.0 లీటర్ పవర్‌ఫుల్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్‌ను ఇస్తున్నారు. దీనితో పాటు లగ్జరీ కార్లలో ఉండే 360 డిగ్రీ కెమెరా, లెవెల్-2 ఏడీఏఎస్ సేఫ్టీ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, 10.2 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు వంటి అదిరిపోయే ఫీచర్లు ఇందులో ఉండబోతున్నాయి. జూలై నుంచే దీని డెలివరీలు కూడా మొదలయ్యే ఛాన్స్ ఉంది.
నిస్సాన్ టెక్టాన్
నిస్సాన్ కార్ల లవర్స్ గత కొన్ని నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టెక్టాన్ ఎస్‌యూవీ ఎట్టకేలకు జూలై 9వ తేదీన అఫీషియల్‌గా లాంచ్ కాబోతోంది. మార్కెట్లో దీని ధర సుమారు రూ. 12 లక్షల నుంచి రూ. 22 లక్షల (ఆన్-రోడ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది. మొదట దీనిని పెట్రోల్ వెర్షన్‌లో తీసుకువచ్చి, ఈ ఏడాది చివర్లో హైబ్రిడ్ మోడల్‌ను లాంచ్ చేయాలని నిస్సాన్ ప్లాన్ చేస్తోంది. ఈ కారులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.3 లీటర్ టర్బో పెట్రోల్ అనే రెండు రకాల ఇంజిన్ ఆప్షన్లు ఇస్తున్నారు. ఇందులో 10.1 అంగుళాల పెద్ద టచ్ స్క్రీన్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ చార్జింగ్ వంటి మోడరన్ ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి.
మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్
ఇండియాలో మోస్ట్ పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన మారుతి బ్రెజ్జా, సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో వచ్చే నెలలో మార్కెట్లోకి రాబోతోంది. ముంబై ఆన్-రోడ్ ధరల ప్రకారం ఇది రూ.8 లక్షల నుంచి రూ.16 లక్షల బడ్జెట్‌లో లభించనుంది. ఈసారి బ్రెజ్జాలో కంపెనీ ఒక భారీ మార్పు చేస్తోంది. పాత ఇంజిన్‌తో పాటు సరికొత్త 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కూడా తీసుకురాబోతున్నారు. అంతేకాకుండా విక్టోరిస్ టెక్నాలజీతో అండర్ బాడీ సీఎన్‌జీ సెటప్‌ను కూడా ఇందులో ఇవ్వబోతున్నారు. దీనివల్ల బూట్ స్పేస్ ఏమాత్రం తగ్గకుండా ఎక్కువ లగేజ్ పెట్టుకోవచ్చు. హెడ్స్-అప్ డిస్‌ప్లే, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు వంటి అప్‌డేట్లతో బ్రెజ్జా సరికొత్త లుక్‌లో మెరిసిపోనుంది.
ఎంజీ స్టార్‌లైట్ బేస్డ్ ఎస్‌యూవీ
ఎంజీ మోటార్స్ జూలై 17వ తేదీన ఒక సరికొత్త 7 సీటర్ ఎస్‌యూవీని భారత్‌లో అన్విల్ చేయబోతోంది. చైనా మార్కెట్లో విపరీతమైన సక్సెస్ అయిన స్టార్‌లైట్ 560 మోడల్ ఆధారంగా ఈ కారును రూపొందించారు. దీని ధర సుమారు రూ.18 లక్షల నుంచి రూ.30 లక్షల (ఆన్-రోడ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇది ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) టెక్నాలజీతో పాటు ప్యూర్ ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ రాబోతోంది. ఈవీ మోడల్‌లో 56.7 కిలోవాట్ అవర్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను ఇస్తున్నారు. కారు లోపల భారీ 12.8 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, లెవెల్-2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫ్యూచరిస్టిక్ ఫీచర్లతో ఈ కారు టాటా సఫారీ, ఎక్స్‌యూవీ 700 వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.




