Jobs : ఈవీ రంగంలో కొలువుల జాతర.. 2030 నాటికి 4 కోట్ల కొత్త ఉద్యోగాలు
Jobs : భారత ఈవీ రంగంలో 2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు రానున్నాయి. ప్రతి ఏటా 15 నుంచి 20 శాతం నియామకాలు పెరగనున్నాయి.
EV Jobs
Jobs : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. రాబోయే కొద్ది సంవత్సరాలలో ఈ పరిశ్రమ దేశంలోనే అతిపెద్ద ఉపాధి కల్పన రంగాలుగా రూపాంతరం చెందనుంది. ప్రముఖ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ అడెక్కో ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. 2030 నాటికి భారత ఇవి పరిశ్రమలో ఏకంగా 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా ప్రతి ఏడాది ఈ రంగంలో నియామకాల సంఖ్య 15 నుంచి 20 శాతం మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
విస్తరిస్తున్న మార్కెట్.. పెరగనున్న అనుబంధ రంగాలు
ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కేవలం వ్యక్తిగత కార్లకే పరిమితం కాకుండా టూ వీలర్లు, కమర్షియల్ ట్రక్కులు, బస్సులు, ప్రజా రవాణా వ్యవస్థల వరకు వేగంగా వ్యాపిస్తోంది. ఈ కారణంగా ఈవీ పరిశ్రమ కేవలం వాహన తయారీ సంస్థలకే పరిమితం కాకుండా బ్యాటరీ ప్రొడక్షన్, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్యాటరీ రీసైక్లింగ్, పవర్ ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ వంటి అనేక అనుబంధ రంగాలను బలోపేతం చేస్తోంది. ఫలితంగా ఇవన్నీ కలిసి ఉద్యోగావకాశాల రేంజ్‌ను భారీగా పెంచుతున్నాయి.
ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు.. ఎవరికి ఎక్కువ అవకాశాలు?
ఈ నివేదిక ప్రకారం 2030 నాటికి లభించే మొత్తం ఉద్యోగాలలో 10 నుంచి 15 శాతం వరకు నేరుగా ప్రాసెస్ అసెంబ్లీ, ఆటోమొబైల్ తయారీ రంగాల్లో దక్కుతాయి. మిగిలిన 85 నుంచి 90 శాతం ఉద్యోగాలు పరోక్ష రూపంలో అందుబాటులోకి వస్తాయి. అంటే సప్లై చైన్ నిర్వహణ, సర్వీసింగ్ నెట్‌వర్క్, ఛార్జింగ్ స్టేషన్ల నిర్వహణ, లాజిస్టిక్స్ వంటి విభాగాలలో అధికంగా అవకాశాలు లభిస్తాయి. దాదాపు 100కు పైగా ప్రముఖ కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఫ్యాక్టరీ వర్కర్లతో పాటు ఇంజనీరింగ్, బ్యాటరీ టెక్నాలజీ, ఎనర్జీ సిస్టమ్స్, సెమీకండక్టర్లు, మోటార్ డిజైనింగ్ నిపుణులకు భారీ డిమాండ్ ఉండనుంది.
గ్లోబల్ మార్కెట్‌లో భారత్ పాత్ర
అడెక్కో ఇండియా డైరెక్టర్ దీపేష్ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం గ్లోబల్ పాసింజర్ ఈవీ మార్కెట్‌లో భారత్ వాటా 4 శాతంగా ఉండగా, టూ వీలర్ ఈవీ సెగ్మెంట్లో 17 శాతంగా ఉంది. భారత్ కనుక తన తయారీ రంగాన్ని, నైపుణ్యం కలిగిన మానవ వనరులను మరింత పెంచుకుంటే ప్రపంచ ఈవీ సప్లై చైన్‌లో ప్రధాన భూమిక పోషించగలదు. ఈ క్రమంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు నూతన ఈవీ విధానాలను వేగంగా అమలు చేస్తున్నాయి.
స్థిరమైన ఉద్యోగాలు, పర్యావరణ ప్రయోజనాలు
ప్రారంభ దశలో 40 నుంచి 50 శాతం నియామకాలు కాంట్రాక్ట్ లేదా ఫ్లెక్సీ స్టాఫింగ్ రూపంలో జరిగినా, కాలక్రమేణా అవి పర్మనెంట్ ఉద్యోగాలుగా మారతాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. బ్యాటరీ రీసైక్లింగ్ విభాగం కూడా ఏటా 55 శాతం వృద్ధితో దూసుకుపోతోంది. రాబోయే 10 ఏళ్లలో ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో కొత్త నైపుణ్యాలు ఉన్నవారికి 45 శాతం వరకు డిమాండ్ పెరుగుతుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో ఈవీ రంగం జోడవడం వల్ల ముడిచమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గి, భారత ఇంధన భద్రత పెరుగుతుంది. అంతేకాక 2070 నాటికి నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని సాధించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.




