Hyundai: మార్కెట్‌ను ఊపేయడానికి హ్యుందాయ్ మాస్టర్ ప్లాన్.. త్వరలోనే 5 కొత్త పవర్‌ఫుల్ SUVs

Hyundai: కార్ లవర్స్‎కు హ్యుందాయ్ కంపెనీ అదిరిపోయే శుభవార్త అందించింది. భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు ఏకంగా 5 కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

CR Reddy
Published on: 18 Aug 2026 8:38 AM IST
Hyundai Palisade
X

Hyundai Palisade

Hyundai:భారత ఆటో మార్కెట్లో తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు హ్యుందాయ్ ఇండియా భారీ వ్యూహాన్ని రచించింది. 2030 నాటికి సుమారు 26 కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పెట్రోల్, సీఎన్‌జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్లలో విభిన్న మోడళ్లను అందించబోతోంది. వీటిలో దాదాపు 7 నుంచి 8 పూర్తిగా కొత్త ఎస్‌యూవీలు ఉండగా, మిగిలినవి ఫేస్‌లిఫ్ట్, స్పెషల్ ఎడిషన్లుగా రానున్నాయి. వీటిలో ప్రధానంగా మార్కెట్‌ను శాసించబోయే టాప్ 5 ఎస్‌యూవీల వివరాలు ఇవే.

బేయాన్ ఆధారిత కొత్త ఎస్‌యూవీ, క్యూట్ ఈవీ

సబ్‌-4-మీటర్ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ బేయాన్ మోడల్ ఆధారంగా కొత్త కార్‌ను తీసుకొస్తోంది. 1.5-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్లతో రానున్న ఈ కారు, కంపెనీ నుంచి సీఎన్‌జీతో వస్తున్న తొలి 4-మీటర్ల ఎస్‌యూవీ కానుంది. దీనికితోడు టాటా పంచ్ ఈవీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా సిద్ధం చేస్తోంది. ఇన్‌స్టర్ ఈవీ నుంచి పవర్‌ట్రెయిన్ తీసుకుని స్టాండర్డ్, లాంగ్ రేంజ్ వేరియంట్లలో ఈ చిన్న ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి దించనుంది.

7-సీటర్ మోడల్, ఆల్ న్యూ క్రెటా హైబ్రిడ్

కుటుంబ సమేతంగా ప్రయాణించే వారి కోసం నికోడ్ నేమ్‌ Ni1i పేరుతో ఒక కొత్త 7-సీటర్ ఎస్‌యూవీ రూపుదిద్దుకుంటోంది. చైనాలో అమ్ముడవుతున్న టక్సన్ లాంగ్ వీల్‌బేస్ ఆధారంగా ఇది రూపొందే అవకాశం ఉంది. ఇక భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రెటా కారులో థర్డ్ జెనరేషన్ మోడల్‌ను పరిచయం చేయనున్నారు. ఈ కొత్త క్రెటాలో మైలేజ్ అదరగొట్టేలా స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను అందించబోతున్నారు.

2028లో అడుగుపెట్టనున్న భారీ ప్యాలీసేడ్

హ్యుందాయ్ తన గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ప్యాలీసేడ్‎ను 2028 నాటికి భారత రోడ్లపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ లగ్జరీ ఎస్‌యూవీలో 2.5-లీటర్ 4-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన నెక్స్ట్ జెనరేషన్ హైబ్రిడ్ టెక్నాలజీని అందించనున్నారు. ప్రీమియం సౌకర్యాలతో రానున్న ఈ పెద్ద కారు భారత లగ్జరీ సెగ్మెంట్‌లో కొత్త ప్రమాణాలు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది.

పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ వరకు అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకునేలా హ్యుందాయ్ తెస్తున్న ఈ కొత్త ఎస్‌యూవీలు మార్కెట్‌లో సంచలనం సృష్టించనున్నాయి. రాబోయే రోజుల్లో మిగతా దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలకు ఇవి గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story