Hyundai Tucson: కార్ల మార్కెట్‌లో సరికొత్త సంచలనం.. మైండ్ బ్లోయింగ్ లుక్‌తో త్వరలో మార్కెట్లోకి టక్సన్
Hyundai Tucson: హ్యుందాయ్ సంస్థ తన సరికొత్త ఆర్ట్ ఆఫ్ స్టీల్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా ఈ కొత్త టక్సన్ ఎస్‌యూవీని రూపొందించింది.
Hyundai Tucson
Hyundai Tucson: ప్రసిద్ధ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ తన పాపులర్ ఎస్‌యూవీ టక్సన్ మోడల్‌ను త్వరలోనే భారత మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధం చేస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లోకి రాబోతున్న ఈ 5వ జనరేషన్ మోడల్ రోడ్డుపై టెస్టింగ్ చేస్తూ మొదటిసారి కెమెరా కంటికి చిక్కడంతో కార్ల ప్రేమికుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. హ్యుందాయ్ సంస్థ తన సరికొత్త ఆర్ట్ ఆఫ్ స్టీల్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా ఈ కొత్త టక్సన్ ఎస్‌యూవీని రూపొందించింది. లీకైన ఫోటోలను గమనిస్తే ఈ కారు డిజైన్ ఎంతో ఆకర్షణీయంగా, భవిష్యత్తు తరానికి తగినట్లుగా కనిపిస్తోంది. ముందు భాగంలో ప్రత్యేకమైన హెచ్ ఆకారంలో ఉండే ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లు, బంపర్ కింద అమర్చిన హెడ్‌లైట్లు కారుకు ముందెన్నడూ లేని కొత్త రూపాన్ని ఇచ్చాయి. వెనుక వైపు కూడా అదే తరహా హెచ్ షేప్ లైటింగ్, పెద్ద స్పోర్టీ స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నాతో కారు ఎంతో అట్రాక్టివ్‌గా డిజైన్ చేశారు.
పెరిగిన సైజు.. మరింత స్పేషియస్ ఇంటీరియర్
పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త టక్సన్ సైజు గణనీయంగా పెరిగింది. ఈ కారు పొడవు 4,700 మిమీ, వెడల్పు 1,905 మిమీ, ఎత్తు 1,685 మిమీ కాగా, వీల్‌బేస్ 2,785 మిమీగా ఉంది. కారు పొడవు 60 మిమీ, వెడల్పు 40 మిమీ పెరగడం వల్ల లోపల ప్రయాణికులకు లేగ్‌రూమ్, కేబిన్ స్పేస్ చాలా ధారాళంగా లభిస్తుంది. వెనుక సీట్లలో ప్రయాణించే వారి కోసం హెడ్‌రూమ్ స్పేస్ కూడా పెరిగింది. వెనుక తలుపులు 10 డిగ్రీలు అదనంగా తెరుచుకునేలా రూపొందించడం వల్ల కార్ ఎక్కడమూ, దిగడము మరింత సులభమవుతుంది.
అత్యాధునిక టెక్నాలజీ, కేబిన్ ఫీచర్లు
కారు ఇంటీరియర్ కేబిన్ ప్రాంతాన్ని హ్యుందాయ్ పూర్తిగా కొత్తగా తీర్చిదిద్దింది. ఇందులో ప్లియోస్ ఇన్ఫోటైన్‌మెంట్ ఇంటర్‌ఫేస్‌తో కూడిన పెద్ద వర్టికల్ టచ్‌స్క్రీన్ ఏర్పాటు చేశారు. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మీడియా ఫంక్షన్లన్నీ ఈ స్క్రీన్ నుంచే ఆపరేట్ చేయవచ్చు. డ్రైవర్ చూపు తిప్పుకోకుండా నేరుగా రహదారిని చూస్తూనే సమాచారాన్ని గ్రహించేలా డాష్‌బోర్డ్‌పై ప్రత్యేకమైన స్లిమ్ స్క్రీన్‌ను అమర్చారు. సరికొత్త 2-స్పోక్ స్క్వేర్డ్ స్టీరింగ్ వీల్ కేబిన్‌కు మరింత ప్రీమియం లుక్‌ను అందిస్తోంది.
హైబ్రిడ్ ఇంజిన్.. లాంచ్ ఎప్పుడంటే?
ఈ కొత్త టక్సన్ పవర్‌ట్రెయిన్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించనప్పటికీ, 1.6 లీటర్ అప్‌డేటెడ్ హైబ్రిడ్ ఇంజిన్‌ను ఇచ్చే అవకాశం ఉంది. మార్కెట్‌ను బట్టి పెట్రోల్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) వేరియంట్లలో ఈ కారు లభించనుంది. గ్లోబల్ మార్కెట్‌లో ఈ మోడల్ త్వరలోనే అందుబాటులోకి రానుండగా, భారతీయ మార్కెట్లోకి 2027 నాటికి లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.




