Hero Vida VX2 Go FB : సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 128 కిలోమీటర్లు.. హీరో విడా నుంచి దిమ్మతిరిగే ఎలక్ట్రిక్ స్కూటర్
Hero Vida VX2 Go FB : హీరో మోటోకార్ప్ విడా బ్రాండ్‌లో 'VX2 Go FB' అనే ఫిక్స్డ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.1.13 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు లాంచ్ చేసింది.
Hero Vida VX2 Go FB
Hero Vida VX2 Go FB : దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌కి చెందిన ఎలక్ట్రిక్ సబ్‌బ్రాండ్ విడా భారతీయ మార్కెట్‌లోకి సరికొత్త మోడల్‌ను ప్రవేశపెట్టింది. కంపెనీ తన పాపులర్ విడా VX2 సిరీస్‌లో విడా VX2 Go FB పేరుతో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఇప్పటివరకు మార్కెట్‌లో ఉన్న మోడళ్లలో విడదీసి ఛార్జ్ చేసుకునే సదుపాయం ఉండగా, కొత్తగా వచ్చిన ఈ మోడల్‌ను మాత్రం ఫిక్స్డ్ బ్యాటరీ సెటప్‌తో రూపొందించారు. దీని ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ. 1.13 లక్షలుగా నిర్ణయించింది. సొంత పార్కింగ్ స్థలం ఉన్నవారికి, నేరుగా పవర్ సాకెట్‌లోనే ప్లగ్ పెట్టి ఛార్జ్ చేసుకోవాలనుకునే వారికి ఈ కొత్త మోడల్ చాలా అనుకూలంగా ఉంటుంది.
బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, టాప్ స్పీడ్ వివరాలు
హీరో విడా VX2 Go FB ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 3.1 kWh సామర్థ్యం కలిగిన ఫిక్స్డ్ బ్యాటరీని అమర్చారు. ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 128 కిలోమీటర్ల IDC-సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇందులో 6 kW ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. దీని సహాయంతో ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 70 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో ప్రయాణిస్తుంది. అలాగే ఈ బ్యాటరీ డిసి ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 65 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. కంపెనీకి చెందిన బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ప్రోగ్రామ్‌ను కూడా వినియోగదారులు ఎంచుకునే అవకాశం ఉంది.
విడా VX2 రేంజ్ పోర్ట్‌ఫోలియో అప్‌డేట్
హీరో విడా తమ VX2 పోర్ట్‌ఫోలియోను కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా వివిధ బ్యాటరీ ఆప్షన్లతో విక్రయిస్తోంది. ఇందులో విడా VX2 Go (2.2 kWh బ్యాటరీ, 93 కి.మీ రేంజ్), నయా విడా VX2 Go FB (3.1 kWh ఫిక్స్డ్ బ్యాటరీ, 128 కి.మీ రేంజ్), విడా VX2 Go (3.4 kWh బ్యాటరీ, 146 కి.మీ రేంజ్) తో పాటు ప్రీమియం వర్షన్ అయిన విడా VX2 Plus (3.4 kWh , 4.4 kWh బ్యాటరీలతో 146 కి.మీ నుంచి 187 కి.మీ వరకు రేంజ్) మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.
అత్యాధునిక ఫీచర్లు, డెలివరీ అప్‌డేట్స్!
కొత్త విడా VX2 Go FB మోడల్‌లో విశాలమైన సింగిల్-పీస్ సీట్ కింద 27.2 లీటర్ల బూట్ స్టోరేజ్ స్పేస్‌ను అందించారు. సాంకేతికత విషయానికి వస్తే 4.3-ఇంచ్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నేవిగేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో కలవు. దేశవ్యాప్తంగా విడా నెట్‌వర్క్ కింద 5,900 కి పైగా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు, 700 కి పైగా సర్వీస్ పాయింట్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త స్కూటర్ డెలివరీలు ఆగస్టు ప్రారంభం నుంచే దేశవ్యాప్తంగా ఉన్న విడా డీలర్‌షిప్‌ల ద్వారా ప్రారంభం కానున్నాయి.




