Global Trade War: మళ్ళీ మొదలైన వాణిజ్య యుద్ధం.. కార్లపై 25% పన్ను విధించిన ట్రంప్ సర్కార్

Global Trade War: యూరోపియన్ కార్లు, ట్రక్కులపై 25 శాతం భారీ పన్ను విధిస్తున్నట్లు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పాత ఒప్పందాన్ని రద్దు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్ మొదలయ్యే అవకాశం ఉంది.

CR Reddy
Published on: 2 May 2026 9:06 AM IST
Global Trade War
X

Global Trade War

Global Trade War: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచ మార్కెట్లను వణికించారు. పాత ఒప్పందాలను తుంగలో తొక్కుతూ, యూరప్ దేశాల నుంచి వచ్చే కార్లు, ట్రక్కులపై ఏకంగా 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా మరో ట్రేడ్ వార్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఏడాది జూలైలో స్కాట్లాండ్‌లోని ట్రంప్ గోల్ఫ్ కోర్సులో జరిగిన టర్న్‌బెర్రీ అగ్రిమెంట్ ఇప్పుడు ముక్కలైపోయింది. ఆ ఒప్పందం ప్రకారం.. యూరోపియన్ వస్తువులపై 15 శాతానికి మించి పన్ను వేయకూడదని నిర్ణయించారు. కానీ యూరోపియన్ యూనియన్ ఈ ఒప్పందాన్ని సరిగ్గా పాటించడం లేదని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఐరోపా దేశాలు వ్యాపారంలో అమెరికాను మోసం చేస్తున్నాయని భావిస్తున్న ట్రంప్, వచ్చే వారం నుండే 25 శాతం దిగుమతి సుంకాన్ని అమలు చేయాలని ఆదేశించారు.

అసలు ఈ వివాదం వెనుక అమెరికా సుప్రీం కోర్టు ఇచ్చిన ఒక ఆసక్తికర తీర్పు ఉంది. ఈ ఏడాది మొదట్లో సుప్రీం కోర్టు.. ఐరోపా వస్తువులపై పన్నులు వేసే లేదా ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే అధికారం అధ్యక్షుడికి లేదని తీర్పునిచ్చింది. దీనివల్ల పన్ను పరిమితి 15 శాతం నుంచి 10 శాతానికి పడిపోయింది. అయితే దీనిని జీర్ణించుకోలేని ట్రంప్ ప్రభుత్వం, జాతీయ భద్రత, వాణిజ్య సమతుల్యత అనే కొత్త కారణాలను తెరపైకి తెచ్చింది. ప్రత్యేక దర్యాప్తు పేరుతో పాత ఒప్పందాన్ని రద్దు చేసి, కొత్తగా భారీ పన్నులు వడ్డించడానికి సిద్ధమైంది.

అమెరికా మరియు ఐరోపా దేశాల మధ్య ఏడాదికి సుమారు 2 ట్రిలియన్ డాలర్ల (దాదాపు 1.7 ట్రిలియన్ యూరోలు) వ్యాపారం జరుగుతుంది. అంటే రోజుకు సగటున 4.6 బిలియన్ యూరోల లావాదేవీలు సాగుతాయి. ఇప్పుడు 25 శాతం పన్ను విధిస్తే, ఐరోపా కార్ల తయారీ సంస్థలకు నెలకు సుమారు 600 మిలియన్ యూరోల నష్టం వాటిల్లుతుంది. ఇది కేవలం కార్ల ధరలకే పరిమితం కాకుండా, రవాణా, లాజిస్టిక్స్ రంగాలపై కూడా ప్రభావం చూపుతుంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, ద్రవ్యోల్బణం మళ్ళీ విరుచుకుపడే ప్రమాదం ఉంది.

ట్రంప్ నిర్ణయంపై యూరోపియన్ యూనియన్ తీవ్రంగా స్పందించింది. డీల్ అంటే డీల్.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంటూ ఫిబ్రవరిలోనే యూరోపియన్ కమిషన్ హెచ్చరించింది. అమెరికా తమకు అతిపెద్ద వ్యాపార భాగస్వామి అని, వారు ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదని మండిపడింది. ఒకవేళ అమెరికా పన్నులు పెంచితే, తాము కూడా అమెరికా నుంచి వచ్చే వస్తువులపై భారీ పన్నులు వేస్తామని యూరప్ దేశాలు సైగ చేస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బతిని, ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story