Car Sales : ఫస్ట్ టైమ్ కార్ కొనేవాళ్లకి బంపర్ ఆఫర్.. రూ.3.50 లక్షలకే కారు, ఏకంగా 34 కిలోమీటర్ల మైలేజ్

Car Sales : భారత్‌లో తొలిసారి కారు కొనుగోలు చేసేవారి సంఖ్య 54 శాతానికి పెరిగింది. రూ.3.50 లక్షల ప్రారంభ ధర, కేజీ సీఎన్జీకి 34 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే చిన్న కార్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

CR Reddy
Published on: 1 Aug 2026 8:50 AM IST
Car Sales
X

 Car Sales

Car Sales : గత కొన్నేళ్లుగా మందకొడిగా సాగిన భారతీయ ఎంట్రీ లెవెల్ ప్యాసింజర్ వాహనాల విపణి మళ్లీ జోరందుకుంది. కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారు పెద్ద ఎత్తున షోరూమ్‌లకు క్యూ కడుతున్నారు. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఈ మొదటి త్రైమాసికంలో కొత్తగా కార్లు కొన్నవారి వాటా ఏకంగా 54 శాతానికి చేరుకుంది. గత త్రైమాసికంలో ఇది 51 శాతంగా ఉండగా, కేవలం ఒక్క త్రైమాసికంలోనే 3 శాతం మేర వృద్ధి నమోదు కావడం విశేషం. సురక్షిత ప్రమాణాలు, కొత్త నిబంధనల వల్ల ఎంట్రీ లెవెల్ కార్ల ధరలు పెరిగి కొనుగోళ్లు తగ్గినప్పటికీ ఇటీవల చోటుచేసుకున్న సానుకూల మార్పులతో సేల్స్ మళ్లీ ఊపందుకున్నాయి.

రూ.3.50 లక్షల ధర.. 34 కి.మీ మైలేజ్

తొలిసారి కారు కొనే సగటు మధ్యతరగతి కొనుగోలుదారులు ప్రధానంగా బడ్జెట్, ఇంధన పొదుపుకే ప్రాధాన్యం ఇస్తారు. ఈ విభాగంలో మారుతి సుజుకికి చెందిన హ్యాచ్‌బ్యాక్ కార్ల ప్రారంభ ధర కేవలం రూ. 3.50 లక్షల నుంచే మొదలవుతోంది. అంతేకాకుండా వీటి సీఎన్జీ వేరియంట్లు కేజీకి ఏకంగా 34 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండటంతో కొనుగోలుదారులు వీటిపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి దాదాపు 80 శాతానికి పైగా వాటాను కలిగి ఉండటం గమనార్హం.

జీఎస్‌టీ కోతతో మారిన సమీకరణాలు

ఇటీవల ప్రభుత్వం చేపట్టిన జీఎస్‌టీ రేట్ల సవరణ ఈ చిన్న కార్ల విక్రయాలకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. 18 శాతం జీఎస్‌టీ స్లాబ్‌లోకి వచ్చే చిన్న కార్ల విభాగంలో మారుతి సుజుకి అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన ఏకంగా 34 శాతం పెరిగాయి. కంపెనీ కార్పొరేట్ వ్యవహారాల సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతీ వివరాల ప్రకారం.. 18 శాతం జీఎస్‌టీ కేటగిరీలో మారుతి సుజుకి దాదాపు 3,59,000 వాహనాలను విక్రయించగా, పరిశ్రమ మొత్తం సేల్స్ 7,34,000 యూనిట్లుగా నమోదయ్యాయి. అలాగే 40 శాతం జీఎస్‌టీ కేటగిరీలో కంపెనీ 1,61,000 వాహనాలను విక్రయించింది.

రాబోయే రోజుల్లో చిన్న కార్లదే హవా

15 నుంచి 20 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లతో పోలిస్తే, ఎంట్రీ లెవెల్ కార్ల ధరల్లో వచ్చిన చిన్నపాటి మార్పులు కూడా కొనుగోలుదారుల నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అయితే పన్ను తగ్గింపుల వల్ల వాహనాల సొంతం చేసుకునే వ్యయం తగ్గడంతో వ్యాపారం మళ్లీ గాడిన పడింది. రాబోయే పండుగల సీజన్‌లో కూడా మొదటిసారి కారు కొనేవారి వల్ల చిన్న కార్ల విక్రయాలు మరిన్ని రికార్డులను సృష్టిస్తాయని ఆటోమొబైల్ రంగ నిపుణులు విశ్వసిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story