E10 Petrol: పాత వాహనదారులకు గుడ్ న్యూస్.. మళ్లీ E10 పెట్రోల్ ?

E10 Petrol: పాత వాహనాలు సులువుగా నడిచేందుకు E20 తో పాటు E10 పెట్రోల్ ఆప్షన్ కూడా పెట్రోల్ పంపుల్లో ఉంచాలని వారు ప్రతిపాదించారు.

CR Reddy
Published on: 18 Aug 2026 9:22 AM IST
E10 Petrol
X

E10 Petrol

E10 Petrol: పాత కార్లు, బైక్‌లు నడిపే వారికి ఉపశమనం కలిగించే వార్త ఒకటి వచ్చింది. పెట్రోల్ బంకుల్లో E20 పెట్రోల్‌తో పాటు మళ్లీ E10 పెట్రోల్‌ను కూడా అందుబాటులోకి తేవాలని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత్ నాగేశ్వరన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ నిర్ణయం అమలైతే దేశంలో కోట్ల మంది పాత వాహనదారుల ఆందోళనలు తీరనున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో 20 శాతం ఎథనాల్ కలిపిన E20 పెట్రోల్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ నిర్ణయం పాత వాహనదారులను తీవ్రంగా భయపెడుతోంది. ముఖ్యంగా బీఎస్-4 కంటే ముందు నాటి కార్బోరేటర్ ఆధారిత రెండు చక్రాల వాహనాలు E20 పెట్రోల్ కారణంగా త్వరగా పాడైపోతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారు వి.అనంత్ నాగేశ్వరన్, ఆర్థిక వ్యవహారాల శాఖ సలహాదారు ఆకాష్ పూజారితో కలసి రాసిన ఒక కథనంలో కీలక సూచనలు చేశారు. పాత వాహనాలు సులువుగా నడిచేందుకు E20 తో పాటు E10 పెట్రోల్ ఆప్షన్ కూడా పెట్రోల్ పంపుల్లో ఉంచాలని వారు ప్రతిపాదించారు.

E20 వల్ల మైలేజ్ తగ్గుతుందా?

ఎథనాల్‌లో సాధారణ పెట్రోల్ కంటే మూడో వంతు శక్తి తక్కువగా ఉంటుంది. అందువల్ల పెట్రోల్‌లో ఎథనాల్ శాతం పెరిగితే మైలేజ్ కాస్త తగ్గడం సహజం. E20 ఇంధనం వల్ల మైలేజ్ దాదాపు 6 నుంచి 7 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలా 30 శాతం వరకు తగ్గదని స్పష్టం చేశారు. మన దేశంలో దాదాపు 7.5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు పాత బైకులు, స్కూటర్లు రోడ్లపై తిరుగుతున్నాయి. కార్బోరేటర్ ఇంజిన్లు ఎథనాల్‌లోని అదనపు ఆక్సిజన్‌ను తట్టుకోలేక త్వరగా వేడెక్కుతాయి. పాత వాహనాల్లో ఉండే రబ్బర్ సీళ్లు కూడా ఎథనాల్ ప్రభావానికి త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది.

E10 ఎందుకు అవసరం?

పాత వాహనాల్లో రబ్బర్ సీళ్లను మార్చడం పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాకపోయినా, కోట్ల వాహనాలకు ఇది పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే వాహనాలు E20కి అనుకూలంగా మారే వరకు E10ని కొనసాగించడం సరైన మార్గమని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎథనాల్ తయారీకి మొక్కజొన్న వాడకం విపరీతంగా పెరగడం వల్ల సాగునీరు, భూమి వినియోగంపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఎథనాల్ కోసమే పంటలను మళ్లిస్తే భవిష్యత్తులో నూనె గింజల పంటలపై ప్రతికూల ప్రభావం పడి ఆహార భద్రతకే ముప్పు వస్తుందని హెచ్చరించారు.

ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి?

కేవలం ముడి చమురు దిగుమతులు తగ్గించుకోవడమే కాకుండా దేశంలో నీటి వనరులు, రైతుల రాబడి, ఆహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎథనాల్ విధానాన్ని అమలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పాత వాహనదారులకు ఇబ్బంది లేకుండా E10 సదుపాయాన్ని కొనసాగిస్తూనే, పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకే ఎంపిక చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story