Car Insurance: కస్టమర్ పోరాటానికి దక్కిన విజయం.. కోర్టు తీర్పుతో వణుకుతున్న ఇన్సూరెన్స్ కంపెనీలు
Car Insurance: హెచ్డీఎఫ్సీ జనరల్ ఇన్సూరెన్స్ అప్పీలును కొట్టివేస్తూ బాధితుడికి ఏకంగా రూ.4.5 లక్షల పరిహారం చెల్లించాలని సంచలన తీర్పునిచ్చింది.
Car Insurance
Car Insurance: వాహనం ప్రమాదానికి గురైనప్పుడు డ్రైవింగ్ లైసెన్స్‌లో లోపాలున్నాయనే వంకతో ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను కంపెనీలు సులువుగా తిరస్కరించలేవని పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల నివారణ కమిషన్ స్పష్టం చేసింది. హెచ్డీఎఫ్సీ జనరల్ ఇన్సూరెన్స్ అప్పీలును కొట్టివేస్తూ బాధితుడికి ఏకంగా రూ.4.5 లక్షల పరిహారం చెల్లించాలని సంచలన తీర్పునిచ్చింది.
అసలేం జరిగింది? ఘటన నేపథ్యం ఇదే
కోల్‌కతాకు చెందిన ఒక వాహనదారుడు తన స్కోడా కారును రూ.6.95 లక్షల ఇన్సూరెన్స్ విలువతో బీమా చేయించుకున్నారు. 2014 మార్చి నుంచి ఏడాది పాటు చెల్లుబాటయ్యే ఈ పాలసీ వ్యవధిలో, అదే ఏడాది అక్టోబరు 12న కారు తీవ్ర ప్రమాదానికి గురైంది. కారును సర్వీస్ సెంటర్‌కు తరలించగా మరమ్మతుల కోసం రూ.5.28 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. బాధితుడు వెంటనే పరిహారం కోసం బీమా కంపెనీని ఆశ్రయించగా ఆయనకు ఊహించని షాక్ ఎదురైంది.
లైసెన్స్ సాకుతో క్లెయిమ్ తిరస్కరణ
ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపిన డ్రైవర్ వద్ద చెల్లుబాటయ్యే లైసెన్స్ లేదని, అతనికి నాగార్పూర్ నుంచి జారీ అయిన మరొక నకిలీ లైసెన్స్ కూడా ఉందంటూ బీమా కంపెనీ క్లెయిమ్‌ను పూర్తిగా తోసిపుచ్చింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం ఇది నేరమని, అందువల్ల పరిహారం చెల్లించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. కంపెనీ నిర్ణయంతో విసిగిపోయిన కారు యజమానుడు న్యాయం కోసం వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు.
కోర్టు ఘాటు వ్యాఖ్యలు
ఈ కేసును విచారించిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ బీమా కంపెనీ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఒక వ్యక్తి వద్ద రెండు లైసెన్సులు ఉంటే అది మోటారు వాహనాల చట్టం కింద నేరం కావచ్చు, దానికి చట్టపరమైన శిక్షలు ఉంటాయి. డ్రైవర్ చేసిన తప్పుకు, కారు యజమాని తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీ నిబంధనల ఉల్లంఘనకు ఎలాంటి సంబంధం ఉండదని కోర్టు తేల్చిచెప్పింది. కేవలం డ్రైవర్ లైసెన్స్ వ్యవహారాన్ని చూపి కంపెనీ తన బాధ్యత నుంచి తప్పుకోలేదని స్పష్టం చేసింది.
రూ.4.5 లక్షల భారీ పరిహారం చెల్లింపునకు ఆదేశం
ఈ సంచలన విచారణ ముగింపులో బాధితుడికి రూ.3.5 లక్షల క్లెయిమ్ మొత్తాన్ని 2016 సెప్టెంబర్ 7 నుంచి 6 శాతం వార్షిక వడ్డీతో కలిపి చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించకపోతే వడ్డీ రేటును 9 శాతానికి పెంచుతామని హెచ్చరించింది. వీటితో పాటు కస్టమర్‌కు కలిగిన తీవ్ర మానసిక వేదనకు గాను రూ.లక్ష అదనపు పరిహారం చెల్లించాలని హెచ్డీఎఫ్సీ కంపెనీని ఆదేశించింది.
ఈ తీర్పుతో ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే వేలాది మంది వాహనదారులకు పెద్ద ఊరట లభించింది. బీమా సంస్థలు సాంకేతిక కారణాలు చూపి క్లెయిమ్ తిరస్కరిస్తే వెంటనే రిజెక్షన్ లెటర్, సర్వేయర్ నివేదికలతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.




