China EV Market : ఈవీ కార్ల ధరలు పడిపోతున్నాయా.. అందుకే తొందరగా అమ్మేసుకుంటున్నారా..?
China EV Market : చైనాలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఊహించని రేంజ్లో దూసుకుపోతోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, అక్కడ రోడ్లపై తిరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల సగటు
china-ev
China EV Market : చైనాలో ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ ఊహించని రేంజ్లో దూసుకుపోతోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, అక్కడ రోడ్లపై తిరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల సగటు వయస్సు కేవలం 1.8 సంవత్సరాలు మాత్రమే. అంటే, ప్రజలు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తమ పాత ఈవీని అమ్మేసి కొత్త కారు కొనేస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ కాల పరిమితి చాలా మంది వాడుతున్న మొబైల్ ఫోన్ల జీవితకాలం కంటే కూడా తక్కువ కావడం గమనార్హం.
చైనా అసోసియేషన్ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (CAAM), హెజున్ కన్సల్టింగ్ సంయుక్తంగా అందించిన డేటా ఆధారంగా ప్రచురితమైన నివేదిక ప్రకారం.. చైనాలో పెట్రోల్, డీజిల్ కార్ల సగటు జీవితకాలం 8.2 సంవత్సరాలుగా ఉంది. దీనిని బట్టి చూస్తే సాంప్రదాయ ఇంధన కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్లను ప్రజలు చాలా వేగంగా మార్చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఇంత వేగంగా కార్లను మార్చడానికి కారణం ఏంటి
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో సాంకేతికత (Technology) రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. బ్యాటరీల సామర్థ్యం పెరగడం, సరికొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లు రావడం, కార్లకు స్మార్ట్ ఫీచర్లను జోడించే అత్యాధునిక చిప్‌లు మార్కెట్లోకి రావడం వంటి కారణాలతో ఆటోమొబైల్ కంపెనీలు చాలా తక్కువ సమయంలోనే సరికొత్త మోడళ్లను లాంచ్ చేస్తున్నాయి. మార్కెట్లోకి వస్తున్న ఈ లేటెస్ట్ టెక్నాలజీకి ఆకర్షితులవుతున్న జనాలు, తమ పాత ఈవీలను వదిలించుకుని కొత్త కార్లను కొనుగోలు చేయడానికి అమితాసక్తి చూపిస్తున్నారు.
రీసేల్ వాల్యూ పడిపోతుందనే భయం
ఎలక్ట్రిక్ కార్ల పునఃవిక్రయ విలువ (Resale Value) మార్కెట్లో చాలా వేగంగా పడిపోతోందని ఈ నివేదిక హెచ్చరించింది. సగటున ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేసిన మూడు సంవత్సరాల తర్వాత దాని అసలు విలువ కేవలం 43.35 శాతానికి పడిపోతుంది. ఉదాహరణకు ఒకరు రూ.20 లక్షలు పెట్టి ఈవీ కొంటే, మూడేళ్ల తర్వాత దాని ధర సుమారు రూ.8.5 లక్షల నుండి రూ.9 లక్షలకు తగ్గిపోతుంది. అందుకే కారు వాల్యూ మరీ దారుణంగా పడిపోక ముందే, కొంచెం రేటు ఉన్నప్పుడే మార్చేయడం ఉత్తమమని ఎక్కువ మంది భావిస్తున్నారు.
యువతనే మెయిన్ టార్గెట్
చైనాలో 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువతే ఈవీలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు డేటా చెబుతోంది. ఈ తరం వారు కేవలం ప్రయాణం కోసం మాత్రమే కారును కొనడం లేదు. సరికొత్త డిజిటల్ అనుభవం, స్మార్ట్ డ్రైవింగ్ సిస్టమ్స్, పెద్ద పెద్ద టచ్స్క్రీన్లు, ఏఐ ఫీచర్లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి వాటికి విపరీతమైన ప్రాధాన్యత ఇస్తున్నారు. చైనీస్ ఆటోమొబైల్ ప్లాట్‌ఫామ్ 'డాంగ్చెడి' సర్వే ప్రకారం.. దాదాపు 43 శాతం మంది ఈవీ ఓనర్లు కేవలం మెరుగైన స్మార్ట్ ఫీచర్లు, సరికొత్త యూజర్ ఎక్స్పీరియన్స్ కోసమే తమ కార్లను అప్‌గ్రేడ్ చేసుకుంటున్నట్లు స్పష్టమైంది.




