BYD Atto 3: మైండ్ బ్లాక్ ఫీచర్లు, 630 కిలోమీటర్ల రేంజ్.. లేటెస్ట్ టెక్నాలజీతో..!
BYD Atto 3: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘బివైడి’ (BYD) గ్లోబల్ ఈవీ మార్కెట్లో తన పట్టును మరింత బిగించేందుకు సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది...
BYD-Atto-3
BYD Atto 3: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ‘బివైడి’ (BYD) గ్లోబల్ ఈవీ మార్కెట్లో తన పట్టును మరింత బిగించేందుకు సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. చైనా మార్కెట్లో 'యువాన్ ప్లస్' పేరుతో పిలవబడే తన పాపులర్ ఎలక్ట్రిక్ క్రాసోవర్ 'BYD అట్టో 3' (BYD Atto 3) మూడవ తరం (థర్డ్ జనరేషన్) మోడల్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త తరం కారులో విప్లవాత్మక మార్పులు చేశారు. చైనాలో దీని ప్రారంభ ధర 119,900 యువాన్లు (మన కరెన్సీలో సుమారు రూ.16.86 లక్షలు) కాగా, టాప్ వేరియంట్ ధర 149,900 యువాన్ల (సుమారు రూ.21.08 లక్షలు) వరకు ఉంది. ఈ సరికొత్త ఈవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు ఇప్పుడు కార్ల ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
తాజా ఆర్కిటెక్చర్ , అప్‌గ్రేడెడ్ బ్లేడ్ బ్యాటరీ
కొత్త తరం BYD అట్టో 3 కారును కంపెనీ అత్యంత అధునాతన 'ఇ-ప్లాట్‌ఫామ్ 3.0 ఇవో' (e-Platform 3.0 Evo) ఆర్కిటెక్చర్‌పై రూపొందించారు. ఇది కారు పనితీరును, బ్యాటరీ సామర్థ్యాన్ని మునుపటి కంటే ఎంతగానో మెరుగుపరుస్తుంది. భద్రతకు పెద్దపీట వేస్తూ ఇందులో సరికొత్త 'సెకండ్ జనరేషన్ బ్లేడ్ బ్యాటరీ' టెక్నాలజీని ఉపయోగించారు. బ్యాటరీ ఆప్షన్ల విషయానికి వస్తే.. ఇందులో 57.5 kWh , 68.5 kWh సామర్థ్యం గల రెండు బ్యాటరీ ప్యాక్‌లను అందించారు. ఇవి BYD సరికొత్త 'ఫ్లాష్ ఛార్జింగ్' టెక్నాలజీతో పనిచేస్తాయి. ఇవి సిఎల్‌టిసి (CLTC) ప్రమాణాల ప్రకారం ఒకే ఛార్జ్‌పై వరుసగా 540 కిలోమీటర్లు , 630 కిలోమీటర్ల భారీ రేంజ్‌ను అందిస్తాయి.
రియర్-వీల్ డ్రైవ్ , పవర్‌ఫుల్ మోటార్
సాంకేతిక పరంగా ఈ థర్డ్ జనరేషన్ మోడల్‌లో చేసిన అతిపెద్ద మార్పు.. దీని డ్రైవ్ లేఅవుట్. మునుపటి మోడళ్లలో ఉన్న ఫ్రంట్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌ను పూర్తిగా మార్చేసి, ఈ కొత్త అట్టో 3లో 'రియర్-వీల్ డ్రైవ్' (RWD) లేఅవుట్‌ను తీసుకొచ్చారు. కారు వెనుక భాగంలో అమర్చిన ఈ పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ మనం ఎంచుకునే వేరియంట్‌ను బట్టి 200 kW (268 hp) లేదా 240 kW (322 hp) వరకు గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది. దీనివల్ల కారు పిక్‌అప్ , హ్యాండ్లింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయి.
డ్రాగన్ ఫేస్ డిజైన్ , భారీ స్టోరేజ్
కొలతల పరంగా ఈ ఎస్‌యూవీ ఇప్పుడు 4,665 మిమీ పొడవు, 1,895 మిమీ వెడల్పు, 1,675 మిమీ ఎత్తు , 2,770 మిమీ వీల్‌బేస్‌తో మరింత విశాలంగా మారింది. బాహ్య డిజైన్ విషయానికి వస్తే.. BYD ఐకానిక్ 'డ్రాగన్ ఫేస్' డిజైన్‌ను మరింత షార్ప్‌గా మార్చారు. ఇందులో సన్నని హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లాట్ ఫ్రంట్ లుక్ హైలైట్‌గా నిలుస్తాయి. స్టోరేజ్ స్పేస్ కోసం ఈ కారులో అద్భుతమైన ఆప్షన్లు ఇచ్చారు. ముందు భాగంలో కేవలం ఒక నాక్ (Knock) తో ఓపెన్ అయ్యేలా 180-లీటర్ల పవర్-ఆపరేటెడ్ ఫ్రంట్ ట్రంక్ (ఫ్రంక్) ఇచ్చారు. అలాగే వెనుక వైపు ఏకంగా 750 లీటర్ల సామర్థ్యం గల భారీ లగేజ్ కంపార్ట్‌మెంట్‌ను కేటాయించారు. ఈ క్రాస్‌ఓవర్‌ను కస్టమర్లు డ్యూయల్-టోన్ కాంబినేషన్లతో సహా మొత్తం తొమ్మిది ఆకర్షణీయమైన రంగుల్లో సొంతం చేసుకోవచ్చు.
లగ్జరీ క్యాబిన్.. ఫ్రిజ్, టిష్యూ హోల్డర్ల హంగామా
ఈ సరికొత్త అట్టో 3 క్యాబిన్‌ను ఫైవ్-స్టార్ రేంజ్ లగ్జరీగా పునఃరూపకల్పన చేశారు. కొత్త 'డైలింక్' ఇంటర్‌ఫేస్‌తో పనిచేసే ఒక పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ , సరికొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గేర్ సెలెక్టర్‌ను స్టీరింగ్ వీల్ వెనుక వైపునకు మార్చడం వల్ల సెంటర్ కన్సోల్‌లో చాలా స్థలం ఖాళీగా దొరికింది. ప్రయాణీకుల కంఫర్ట్ కోసం క్యాబిన్‌లో ఒక చిన్న 'రిఫ్రిజిరేటర్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్', వెనుక సీట్ల కింద డ్రాయర్‌లు, ప్రత్యేక కళ్లద్దాల హోల్డర్ , టిష్యూ హోల్డర్‌ను కూడా అమర్చారు.
టాప్-ఎండ్ వేరియంట్లలో హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, హీటెడ్ స్టీరింగ్ వీల్, 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, పనోరమిక్ హెడ్-అప్ డిస్‌ప్లే , అదిరిపోయే సౌండ్ క్వాలిటీ కోసం 16-స్పీకర్ల ఆడియో సెటప్‌ను అందించారు. అలాగే ముందరి ప్యాసింజర్ సీటుకు పొడిగించగల లెగ్ సపోర్ట్‌ను కూడా జత చేశారు. వీటన్నింటితో పాటు భద్రతను మరింత పెంచేందుకు ఈ ఎస్‌యూవీలో మొట్టమొదటిసారిగా ఐచ్ఛికంగా (Optional) 'LiDAR' ఆధారిత అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థను (ADAS) కూడా ఆఫర్ చేస్తున్నారు.




