Car Launches : భారత ఆటోమొబైల్ మార్కెట్లో కార్ల పండుగ.. వచ్చే రెండు వారాల్లో 3 సరికొత్త మోడళ్లు లాంచ్
Car Launches : భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి రాబోయే రెండు వారాల్లో మూడు సరికొత్త అధునాతన కార్లు లాంచ్ కానున్నాయి.
Upcoming Car Launches
Car Launches : భారతీయ ఆటోమొబైల్ రంగానికి జులై 2026 నెల అత్యంత ఉత్సాహభరితంగా సాగుతోంది. ఈ నెలలో ఇప్పటికే ఎన్నో సరికొత్త కార్లు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. అయితే జులై నెల ముగియడానికి ఇంకా రెండు వారాల సమయం మిగిలి ఉండగానే, దేశీయ రోడ్లపైకి మరో మూడు సరికొత్త, శక్తివంతమైన కార్లు దూసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. కార్ల తయారీ కంపెనీలు మార్కెట్లో తమ పట్టును మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ అప్‌కమింగ్ మోడళ్లను సరికొత్త డిజైన్, మోడ్రన్ ఫీచర్లతో లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశాయి. ఈ కార్ల అధికారిక లాంచ్ తేదీలతో పాటు వాటిలో రాబోతున్న ప్రధాన మార్పుల వివరాలు కూడా పూర్తిగా వెల్లడయ్యాయి.
కొత్త అవతారంలో మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్
దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన సబ్-4 మీటర్ ఎస్యూవీ అయిన మారుతి సుజుకి బ్రెజ్జా సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ జులై 23వ తేదీన మార్కెట్లో విడుదల కాబోతోంది. ఈ సరికొత్త మోడల్ ముందు భాగంలో స్పోర్టీ రెడ్ యాక్సెంట్స్‌తో కూడిన కొత్త గ్రిల్, అప్డేటెడ్ బంపర్, సిల్వర్ స్కిడ్ ప్లేట్ వంటి ఆకర్షణీయమైన మార్పులు చేశారు. కారు లోపలి భాగంలో 10.1 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు లాంటి ప్రీమియం ఫీచర్లు అందించారు. ఈ కారు ఇంజిన్‌లో ఒక పెద్ద మార్పు జరగబోతోంది. ప్రస్తుతమున్న 1.5 లీటర్ పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లతో పాటు, ఇకపై ఫ్రాంక్స్ కారులో ఉండే 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కూడా ఇందులో ప్రవేశపెడుతున్నారు. అంతేకాకుండా దీని సీఎన్జీ వేరియంట్లో అండర్ బాడీ ట్యాంక్ అమర్చడం ద్వారా డిక్కీ స్పేస్ మరింత పెరగనుంది.
టెంప్టింగ్ లుక్స్‌తో టయోటా హిలక్స్ న్యూ జనరేషన్
ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా తన సరికొత్త న్యూ జనరేషన్ హిలక్స్ పిక్-అప్ ట్రక్‌ను జులై 28, 2026 న భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ భారీ వాహనంలో మైల్డ్ హైబ్రిడ్ (MHEV) సాంకేతికతను ఉపయోగించారు. ఇది తక్కువ ఆర్పీఎమ్ వద్ద ఇంజిన్‌కు అవసరమైన ఎలక్ట్రికల్ సపోర్ట్ అందిస్తూ ఇంధనాన్ని భారీగా ఆదా చేస్తుంది. ఈ ట్రక్‌లో 48V సిస్టమ్‌తో కూడిన 2.8 లీటర్ల శక్తివంతమైన టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 201 బిహెచ్పి పవర్, 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త ఫ్రంట్ లుక్, రీడిజైన్ చేసిన గ్రిల్, మస్కులర్ ఎక్స్టీరియర్ డిజైన్ కారణంగా ఈ మోడల్ ధర ప్రస్తుత వెర్షన్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
హోండా జెడ్ఆర్-వి లుక్స్ అరాచకం
ప్రముఖ జపాన్ కార్ల సంస్థ హోండా తన సరికొత్త ఫ్లాగ్షిప్ ఎస్యూవీ జెడ్ఆర్-వి హైబ్రిడ్‌ను భారత మార్కెట్లోకి అధికారికంగా పరిచయం చేసింది. ఈ ప్రీమియం కారు ధరలను జులై 20 నుంచి జులై 21 మధ్య కంపెనీ ప్రకటించబోతోంది. ఈ లగ్జరీ కారులో 2.0 లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది హోండా కంపెనీకి చెందిన స్ట్రాంగ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో కలిసి పనిచేస్తూ లీటరుకు 22.80 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీని ఇస్తుంది. ఈ కారు కేవలం 8 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారు ఫుల్ ట్యాంక్ ఇంధనంతో ఏకంగా 1,300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ గట్టిగా క్లెయిమ్ చేస్తోంది. లాంగ్ డ్రైవ్స్ ఇష్టపడేవారికి ఈ కారు ఒక అద్భుతమైన ఆప్షన్‌గా మారనుంది.




