Bajaj Pulsar 220F : 19 ఏళ్ల తర్వాత పల్సర్ 220F లుక్ లో భారీ మార్పు.. సరికొత్త డిజైన్, ఫీచర్లతో లాంచ్
Bajaj Pulsar 220F : బజాజ్ ఆటో సరికొత్త 2026 పల్సర్ 220F బైక్‌ను రూ.1.36 లక్షల ధరతో లాంచ్ చేసింది. ఇందులో సరికొత్త ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్ సెటప్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు అందించారు.
Bajaj Pulsar 220F
Bajaj Pulsar 220F : భారత టూ వీలర్ మార్కెట్లో బజాజ్ పల్సర్ బ్రాండ్‌కు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అందులోనూ పల్సర్ 220F మోడల్ అంటే యువతకు ఎనలేని క్రేజ్. 2007లో మొదటిసారి లాంచ్ అయిన ఈ బైక్, దాదాపు రెండు దశాబ్దాలుగా కుర్రాళ్లను ఆకట్టుకుంటూనే ఉంది. ఇప్పటివరకు దీని ఐకానిక్ బాడీ డిజైన్ లో కంపెనీ పెద్దగా మార్పులు చేయలేదు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా, కస్టమర్ల అభిరుచులను దృష్టిలో ఉంచుకుని బజాజ్ ఆటో ఇప్పుడు సరికొత్త హంగులతో 2026 బజాజ్ పల్సర్ 220F మోడల్‌ను లాంచ్ చేసింది.
ధరల వివరాలు.. పాత మోడల్ కంటే కాస్త ఖరీదు
భారత మార్కెట్లో విడుదలైన ఈ కొత్త 2026 బజాజ్ పల్సర్ 220F ఎక్స్-షోరూమ్ ధరను రూ.1.36 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. గత డిసెంబర్ 2025లో విడుదలైన పాత మోడల్ ధర రూ.1.28 లక్షలుగా ఉండేది. అంటే కొత్త డిజైన్, అప్‌గ్రేడెడ్ ఫీచర్ల కారణంగా ఈ సరికొత్త బైక్ ధర పాత మోడల్ కంటే దాదాపు రూ.8,000 వరకు పెరిగింది. అయినప్పటికీ ఇందులో అందించిన కొత్త ఫీచర్ల దృష్ట్యా ఈ ధర రీజనబుల్ గానే ఉందని ఆటోమొబైల్ విశ్లేషకులు చెప్తున్నారు.
రెండు దశాబ్దాల తర్వాత మారిన ఐకానిక్ లుక్
పల్సర్ 220F అనగానే అందరికీ గుర్తొచ్చేది దాని అగ్రెసివ్ ఫెయిర్డ్ బాడీ, క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్, స్పోర్టి లుక్. ఈ 2026 మోడల్‌లో బజాజ్ సంస్థ చేసిన అతిపెద్ద మార్పు దాని హెడ్‌లైట్ సెక్షన్ లోనే ఉంది. పాత మోడళ్లలో లో-బీమ్, హై-బీమ్ కోసం విడివిడిగా వర్టికల్ లైట్ యూనిట్లు ఉండేవి. కానీ ఇప్పుడు వాటన్నింటినీ తీసేసి ఒకే ఒక పవర్‌ఫుల్ ప్రొజెక్టర్ ఎల్‌ఈడీ యూనిట్‌ను అమర్చారు. దీనితో పాటు ఐబ్రో స్టైల్ (కనుబొమ్మల ఆకారంలో) సరికొత్త ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్ లైట్లను జోడించారు. ఇది బైక్‌కు మరింత మోడరన్, రోబోటిక్ లుక్‌ను ఇస్తోంది.
ఫీచర్లు అదరహో.. కలర్ ఆప్షన్లలో మార్పు
కొత్త పల్సర్ 220F డిజైన్ మార్పులు కేవలం ఫ్రంట్ ఫేసియా, ఎల్‌ఈడీ హెడ్‌లైట్ సెటప్ వరకే పరిమితమయ్యాయి. మిగిలిన బాడీ స్ట్రక్చర్ అంతా పాత బైక్ లాగే ఉంటుంది. డిసెంబర్ 2025 అప్‌డేట్‌లో వచ్చిన ఎల్‌ఈడీ ఇండికేటర్లను ఇందులోనూ కొనసాగించారు. అయితే, గతంలో అందుబాటులో ఉన్న గ్రీన్ లైట్ కాపర్ కలర్ ఆప్షన్‌ను కంపెనీ ఇప్పుడు పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతం ఈ బైక్ 4 ఆకర్షణీయమైన రంగులలో కస్టమర్లకు లభించనుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్లు, టర్న్-బై-టర్న్ నావిగేషన్, స్ప్లిట్ సీట్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్, నైట్రాక్స్ ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్స్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.
అదే నమ్మకమైన పవర్‌ఫుల్ ఇంజన్
బైక్ లుక్, ఫీచర్లలో మార్పులు చేసిన బజాజ్, దాని ఇంజన్ మెకానిజంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. పల్సర్ 220F ఇంజన్ పర్ఫార్మెన్స్ ఇప్పటికే మార్కెట్లో చాలా సక్సెస్ కావడం వల్లే దీన్ని అలాగే ఉంచారు. ఇందులో 220 సీసీ ఆయిల్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను అందించారు. ఇది 20.4 పీఎస్ పవర్ మరియు 18.55 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ బరువు 160 కిలోలు కాగా, ఇందులో 15 లీటర్ల కెపాసిటీ ఉన్న భారీ ఫ్యూయల్ ట్యాంక్ అందించారు. అయితే ఈసారి డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వస్తుందని ఆశించిన ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది, ఎందుకంటే ఇందులో సింగిల్ ఛానల్ ఏబీఎస్ మాత్రమే ఇచ్చారు.




