పాకం పట్టే పనిలేదు.. పప్పు రుబ్బే శ్రమ లేదు.. 90 నిమిషాల్లో 9 నైవేద్యాలు ఈజీగా సిద్ధం చేయండిలా..!
Varalakshmi Vratham: శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం రోజున మహిళలకు పూజా కార్యక్రమాలతో పాటు నైవేద్యాల తయారీ పెద్ద సవాలుగా మారుతుంది.
పాకం పట్టే పనిలేదు.. పప్పు రుబ్బే శ్రమ లేదు.. 90 నిమిషాల్లో 9 నైవేద్యాలు ఈజీగా సిద్ధం చేయండిలా..!
Varalakshmi Vratham Prasadalu: శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం రోజున మహిళలకు పూజా కార్యక్రమాలతో పాటు నైవేద్యాల తయారీ పెద్ద సవాలుగా మారుతుంది. గ్రైండర్‌తో పనే లేకుండా, ముందురోజు ఎలాంటి ఏర్పాట్లు చేసుకోకుండానే కేవలం తొంభై నిమిషాల్లో అమ్మవారికి ఇష్టమైన తొమ్మిది రకాల ప్రసాదాలు ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే వీటిని ఎలా సిద్ధం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పండుగ రోజు వంటగదిలో గంటల తరబడి గడపకుండా ఒక చిన్న ప్రణాళికతో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. ముందుగా అన్నం వండి వార్చుకోవాలి. మూడు కప్పుల బెల్లానికి ఒక కప్పు నీళ్లు కలిపి జిగురు పాకం పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పాకాన్ని వివిధ ప్రసాదాలకు సులభంగా వాడుకోవచ్చు. గారెల కోసం మినపప్పును నానబెట్టి గ్రైండర్‌లో రుబ్బే శ్రమ అక్కర్లేదు. ఒక కప్పు మినపగుళ్లను మిక్సీలో మెత్తగా పొడి చేసుకుని, దానికి కొద్దిగా ఉప్పు, ఒక కప్పు నీళ్లు కలిపి ఐదు నిమిషాలు ఆగాక మళ్లీ మిక్సీ పట్టుకోవాలి. పిండిలో కొద్దిగా వంటసోడా కలిపి వేడి నూనెలో వేస్తే ఎంతో మృదువైన గారెలు నిమిషాల్లో సిద్ధమవుతాయి. ఇదే గారెలను ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం పాకంలో వేస్తే బెల్లం గారెలు రెడీ అయిపోతాయి.
తీపి నైవేద్యాలు నిమిషాల్లోనే..
అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన పరమాన్నం తయారీకి ముందుగా ఒక కప్పు అన్నంలో సమాన పరిమాణంలో చిక్కటి పాలు పోసి బాగా ఉడికించాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే కప్పు బెల్లం పాకం కలపాలి, అప్పుడే పాలు విరిగిపోకుండా ఉంటాయి. చక్కెర పొంగలి కోసం గుప్పెడు పెసరపప్పును దోరగా వేయించి, కప్పు బియ్యం జతచేసి రెండు కప్పుల నీళ్లతో కుక్కర్‌లో నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. అందులో కప్పున్నర బెల్లం పాకం పోసి చిక్కబడనివ్వాలి. పావు కప్పు నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వను ఎర్రగా వేయించి మూడు కప్పుల వేడి నీళ్లు, కప్పు పంచదార కలిపితే కమ్మని రవ్వ కేసరి కూడా పూర్తవుతుంది.
కమ్మని పులిహోర.. చల్లని దద్దోజనం..
మిగిలిన అన్నంతో కమ్మటి పులిహోర, దద్దోజనం చాలా వేగంగా కలుపుకోవచ్చు. ఉడికించిన అన్నంలో కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం కలుపుకోవాలి. మరో గిన్నెలో అన్నానికి పెరుగు, ఉప్పు చేర్చుకోవాలి. ఇప్పుడు నూనెలో పల్లీలు, ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం తరుగుతో పెద్ద తాలింపు వేసుకోవాలి. ఈ తాలింపును కొద్దిగా పులిహోరలో, మరికొంత దద్దోజనంలో కలుపుకోవాలి. మిగిలిన తాలింపులో ఉడికించిన శనగలు వేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగల ప్రసాదం సిద్ధమవుతుంది. చివరిగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడిని అన్ని తీపి ప్రసాదాల్లో పైన చల్లుకుంటే అద్భుతమైన రుచి వస్తుంది. చక్కెర పొంగలిలో అదనంగా వేయించిన కొబ్బరి ముక్కలు వేస్తే మరింత బాగుంటుంది.
ఈ చిన్నపాటి చిట్కాలు పాటించడం ద్వారా శ్రావణమాసపు పూజా సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు ప్రశాంతంగా వ్రతాన్ని జరుపుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ పండుగకు కేవలం గంటన్నరలోనే అమ్మవారికి ఇష్టమైన ఈ ప్రసాదాలను భక్తిశ్రద్ధలతో సమర్పించి ఆశీస్సులు పొందండి.




