Rakhi Pournami: రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం.. రాఖీ కట్టొచ్చా? జ్యోతిషులు ఏం చెబుతున్నారు.?

Rakhi Pournami: ఈ ఏడాది ఆగస్టు 28న రక్షాబంధన్‌, పౌర్ణమి సందర్భంగా ఆకాశంలో అరుదైన ఖగోళ పరిణామం చోటుచేసుకోనుంది.

Mokshith
Published on: 26 Aug 2026 12:13 PM IST
Rakhi Pournami
X

Rakhi Pournami: రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం.. రాఖీ కట్టొచ్చా? జ్యోతిషులు ఏం చెబుతున్నారు.?

Rakhi Pournami: ఈ ఏడాది ఆగస్టు 28న రక్షాబంధన్‌, పౌర్ణమి సందర్భంగా ఆకాశంలో అరుదైన ఖగోళ పరిణామం చోటుచేసుకోనుంది. అదే రోజున పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. దీంతో రాఖీ పౌర్ణమి రోజున గ్రహణ ప్రభావం ఉంటుందా? అన్న సందేహం చాలామందిలో మొదలైంది.

ఎలాంటి ఇబ్బంది లేదంటున్న జ్యోతిషులు

ఆగస్టు 28న ఏర్పడనున్నది పాక్షిక చంద్రగ్రహణం. అయితే ఈ ఖగోళ ఘటన భారతదేశంలో కనిపించదు. గ్రహణం ఏర్పడే సమయంలో మన దేశంలో పగటి సమయం ఉండటంతో చంద్రుడు ఆకాశంలో కనిపించే పరిస్థితి ఉండదు. అందువల్ల భారతదేశంలో ఉన్నవారు గ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడలేరు.

జ్యోతిష్య సంప్రదాయాల్లో గ్రహణ ప్రభావాలను అంచనా వేయడంలో గ్రహణ దర్శనంకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. గ్రహణం కనిపించని ప్రాంతాల్లో సాధారణంగా గ్రహణ నియమాలు, ఫలితాలను వర్తింపజేయాల్సిన అవసరం లేదని పండితులు అంటున్నారు. కాబట్టి రాఖీ పౌర్ణమి రోజున గ్రహణం ఉందన్న కారణంతో ప్రత్యేకంగా భయపడాల్సిన అవసరం లేదని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది?

ఆగస్టు 28న ఏర్పడే చంద్రగ్రహణానికి సంబంధించి పేర్కొంటున్న సమయాలు భారత కాలమానం ప్రకారం ఉదయం 6:53 గంటలకు గ్రహణ ప్రారంభం కాగా పాక్షిక గ్రహణ ఉదయం 8:03 గంటలకు ప్రారంభమ‌వుతుంది. ఉదయం 9:43 గంటల ప్రాంతంలో గ్రహణ గరిష్ఠ స్థితిలో ఉండ‌గా, ఉదయం 11:22 గంటలకు పాక్షిక గ్రహణం ముగుస్తుంది.

మధ్యాహ్నం 12:32 గంటలకు ఉపచ్ఛాయా గ్రహణం పూర్తిగా ముగుస్తుంది. ఈ మొత్తం వ్యవధిలో భార‌త్‌లో పగటి సమయమే ఉంటుంది. అందువల్ల ఇక్కడి నుంచి చంద్రుడిని చూసే అవకాశం ఉండదు. మరోవైపు అమెరికా, యూరప్‌, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చు.

గ్రహణం గరిష్ఠ దశలో చంద్రుడి వ్యాసంలో దాదాపు 93 శాతం భూమి అంబ్రా (ప్రధాన ఛాయ)లోకి వెళ్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వాతావరణం ద్వారా సూర్యకాంతి వడపోతకు గురయ్యే కారణంగా చంద్రుడు సాధారణ తెల్లటి రంగులో కాకుండా ముదురు ఎరుపు, తుప్పు లేదా రాగి రంగు ఛాయల్లో కనిపించే అవకాశం ఉంటుంది.

కుంభరాశి-శతభిష నక్షత్ర పరిధిలో గ్రహణం..

జ్యోతిష్య లెక్కల ప్రకారం ఈ పాక్షిక చంద్రగ్రహణం కుంభరాశి, శతభిష నక్షత్ర పరిధిలో సంభవిస్తుందని చెబుతున్నారు. ఈ కారణంగా గ్రహణం ఏ రాశిలో ఏర్పడుతోంది? ఎలాంటి ప్రభావాలు ఉంటాయి? అనే చర్చ మొదలైంది. 2026లో ఇది రెండో చంద్రగ్రహణం కాగా, ఈ ఏడాదికి ఇదే చివరి చంద్రగ్రహణంగా చెబుతున్నారు.

మార్చిలో సంపూర్ణ చంద్రగ్రహణం జరిగిన తర్వాత ఆగస్టులో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీంతో గ్రహాల స్థితిగతుల ఆధారంగా కొందరు జ్యోతిషులు ప్రత్యేక ఫలితాలను ప్రస్తావిస్తున్నారు. అయితే గ్రహణం భారతదేశంలో కనిపించని నేపథ్యంలో ఇక్కడి ప్రజలు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.

రాఖీ కట్టుకోవచ్చా? సూతక కాలం ఉంటుందా?

రక్షాబంధన్‌ రోజే చంద్రగ్రహణం రావడంతో చాలామందిలో ప్రధానంగా ఇదే సందేహం నెలకొంది. రాఖీ కట్టుకునే సమయాన్ని మార్చుకోవాలా? గ్రహణానికి ముందు లేదా తర్వాతే రాఖీ కట్టాలా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. భారతదేశంలో ఈ చంద్రగ్రహణం కనిపించదు.

కాబట్టి ప్రత్యేకంగా గ్రహణాన్ని ఉద్దేశించి భయపడాల్సిన అవసరం లేదని జ్యోతిష్య అభిప్రాయం. అందువల్ల రాఖీ పండుగ నిర్వహణపై గ్రహణం ప్రభావం ఉంటుందని భావించాల్సిన అవసరం లేదని అంటున్నారు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story