Mahadasha: జన్మకుండలిలో మహాదశ ప్రభావం...ఏ ఆలయంలో ఎలాంటి పూజ చేయాలంటే
జీవితంలో గ్రహాల మహాదశ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముఖ్యంగా శనిమహాదశ, రాహుకేతు మహాదశల కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వాటికి పరిష్కారాలేంటో తెలుసుకుందాం.
Mahadasha: ప్రతి ఒక్కరి జీవితంలోనూ అనుకోకుండా కొన్ని రకాల కష్టాలు, అడ్డంకులు పదేపదే ఎదురవుతుంటాయి. మనం ఎంత ప్రయత్నించినా, ఎంత కష్టపడినా ఆ సమస్యల నుంచి బయటపడలేక తీవ్ర మానసిక ఆందోళన చెందుతుంటాం. దానికి ప్రధాన కారణం మన జన్మకుండలిలో నడిచే గ్రహ మహాదశల ప్రభావమే. వేద జ్యోతిషశాస్త్రంలో వింశోత్తరి పద్ధతి ప్రకారం 120 ఏళ్ల మానవ జీవిత కాలాన్ని నవగ్రహాలు పంచుకుని ఏలుతాయి. జాతకంలో గ్రహాల స్థితిని బట్టి ఆయా కాలాల్లో శుభ లేదా అశుభ ఫలితాలు ఎదురవుతాయి. గ్రహాల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించి, మానసిక ప్రశాంతతను అందించే దివ్య క్షేత్రాల రహస్యాలు ఇవే!
ప్రధాన గ్రహాలు – దోష నివారణా పుణ్యక్షేత్రాలు
రాహు మహాదశ ...18 ఏళ్లు
రాహువు దశ నడుస్తున్నప్పుడు జీవితంలో అకస్మాత్తుగా తీవ్రమైన ఎదురుదెబ్బలు, భయాలు ఎదురవుతాయి. ఈ దోష పరిహారం కోసం కర్ణాటకలోని కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి నాగప్రతిష్ఠ లేదా ఆశ్లేష బలి పూజలు జరిపించడం వల్ల రాహు గ్రహ శాంతి కలుగుతుంది.
కేతు మహాదశ... 7 ఏళ్లు
కేతువు ప్రభావం వల్ల వైరాగ్యం, వ్యాపార నష్టాలు, ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. దీనికి నివారణగా ఒడిశాలోని పవిత్ర పూరీ జగన్నాథ క్షేత్రంలో ఆలయ గోపురంపై ధ్వజపటాన్ని (పతాకం) దానం చేయడం అత్యంత శ్రేయస్కరమని వేద పండితులు చెబుతారు.
శని మహాదశ ...19 ఏళ్లు
శని భగవానుని సుదీర్ఘ మహాదశలో పనుల్లో తీవ్ర ఆలస్యం, నిరాశ ఆవహిస్తాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ కోకిలవన శనిదేవ్ ఆలయంలో స్వామివారికి ఆవనూనె సమర్పించి, భక్తితో ప్రదక్షిణలు చేస్తే శని భగవానుడి అనుగ్రహం లభించి కష్టాల భారం తగ్గుతుంది.
కుజ మహాదశ ... 7 ఏళ్లు
కుజ దశలో కోపం, ఆవేశం, రక్తసంబంధిత సమస్యలు పెరుగుతాయి. వీటికి ఉపశాంతిగా తమిళనాడులోని ప్రసిద్ధ వైదీశ్వరన్ కోయిల్ (అంగారక క్షేత్రం)ను సందర్శించి ప్రత్యేక అర్చనలు చేయడం వల్ల శరీరంలోనూ, మనస్సులోనూ దివ్య ప్రశాంతత చేకూరుతుంది.
ఆలయ దర్శనాలు కేవలం నమ్మకం మాత్రమే కాదు. ప్రాచీన కాలం నుండి వేలాదిమంది భక్తుల జీవితాల్లో ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చిన దివ్య పరిహారాలు. నిష్ఠతో ఈ దివ్య క్షేత్రాలను దర్శిస్తే గ్రహ దోషాల తీవ్రత తగ్గి సంతోషమయమైన జీవితం సిద్ధసిస్తుంది. వేద జ్యోతిషం ప్రకారం మానవ జీవిత పరమావధి 120 సంవత్సరాలు. ఈ కాలవ్యవధిని నవగ్రహాలు తమ మహాదశల రూపంలో ఏలుతుంటాయి. కేతువు ఏడేళ్లు, రవి ఆరేళ్లు, చంద్రుడు పదేళ్లు, రాహువు 18 ఏళ్లు, శని 19 ఏళ్లు, బుధుడు 17 ఏళ్లు, గురుడు 16 ఏళ్లు, శుక్రుడు 20 ఏళ్లు తమ మహాదశల రూపంలో మానవ జీవితాన్ని ఏలుతుంటాయి. ఏ గ్రహం జీవునిపై ప్రభావం చూపుతుందో ఆ గ్రహం ప్రభావంతో జాతకుని జాతకంలో మార్పులు వస్తుంటాయి.




