వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టేసిన రాజమహేంద్రవరం కోర్టు!

MLC Anantha Babu: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాక్షులను బెదిరించిన కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

Arun Chilukuri
Published on: 22 May 2026 4:18 PM IST
Anantha babu
X

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగ్ షాక్.. బెయిల్ పిటిషన్ కొట్టేసిన రాజమహేంద్రవరం కోర్టు!

MLC Anantha Babu: వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అలియాస్ అనంతబాబుకు న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సాక్షులను ప్రలోభపెట్టి, బెదిరించిన కేసులో తనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టు శుక్రవారం కొట్టివేసింది. అనంతబాబుకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను మరింతగా తారుమారు చేసే అవకాశం ఉందన్న పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.

గతంలో సంచలనం సృష్టించిన తన మాజీ డ్రైవర్‌ వీధి సుబ్రమణ్యం హత్యకేసులో అనంతబాబు ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణ కీలక దశకు చేరిన తరుణంలో.. కేసులోని నలుగురు ముఖ్య సాక్షులను అనంతబాబు ప్రలోభపెట్టడమే కాకుండా తీవ్రంగా బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. "కోర్టులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే ప్రాణాలతో ఉంచను" అంటూ ఆయన సాక్షులను హెచ్చరించినట్లు ఆధారాలు లభించాయి.

బాధిత సాక్షుల ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. సాక్షులను బెదిరించిన ఉదంతం నిజమేనని తేలడంతో.. గత నెల ఏప్రిల్‌ 24న పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశారు. నాటి నుంచి ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఆయన వేసిన రెగ్యులర్ బెయిల్ ప్లాన్ ఫలించలేదు. కోర్టు పిటిషన్‌ను కొట్టేయడంతో అనంతబాబు మరికొన్నాళ్ల పాటు జైల్లోనే మగ్గక తప్పని పరిస్థితి నెలకొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story