YS Jagan: వైసీపీ నుండి మరో కీలక నేత సస్పెండ్
YS Jagan: రేపల్లెకు చెందిన సీనియర్ నేత మోపిదేవి శ్రీనివాసరావుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సస్పెన్షన్ వేటు వేశారు.
YS Jagan: వైసీపీ నుండి మరో కీలక నేత సస్పెండ్
Mopidevi Srinivasa Rao suspended: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రమశిక్షణ విషయంలో ఏమాత్రం తగ్గేదేలేదంటున్నారు. పార్టీ నిబంధనలు అతిక్రమించినా, గ్రూపు రాజకీయాలకు తెరలేపినా ఎంతటి వారికైనా సస్పెన్షన్ వేటు తప్పదని మరోసారి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రేపల్లెకు చెందిన సీనియర్ రాజకీయనాయకుడు మోపిదేవి శ్రీనివాసరావుపై వైసీపీ వేటు వేయడం ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో రేపల్లె నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మోపిదేవి శ్రీనివాసరావు, ఈ ఏడాది మే నెలలోనే కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీ గూటికి చేరారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఆయన స్వయంగా వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీలో చేరి ఐదు నెలలు కూడా గడవకముందే ఆయనపై సస్పెన్షన్ వేటు పడటం ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది.
పార్టీ అధిష్టానం వెల్లడించిన సమాచారం ప్రకారం మోపిదేవి శ్రీనివాసరావు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి.రేపల్లె నియోజకవర్గ వైసీపీలో మోపిదేవి సొంత వర్గాన్ని ప్రోత్సహిస్తూ గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. వచ్చే ఎన్నికల్లో రేపల్లె ఎమ్మెల్యే టికెట్ తనదేనంటూ ఆయన నియోజకవర్గంలో ముందస్తు ప్రచారం చేసుకోవడం స్థానిక నాయకత్వానికి మింగుడుపడలేదు. ఈ పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన పార్టీ క్యాడర్, అధినేత జగన్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లడంతో సీరియస్‌గా స్పందించిన హైకమాండ్ ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటికే పలువురు కీలక నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్పి ఇతర పార్టీల బాట పట్టారు. ఇటువంటి సమయంలో మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పేరుతో జగన్ వరుసగా సస్పెన్షన్లు విధిస్తుండటంతో వైసీపీలో నాయకుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. క్రమశిక్షణ కాపాడుకోవడం మంచిదే అయినా, వరుస వికెట్లు పడిపోతుండటం రేపల్లెతో పాటు జిల్లా వైసీపీ వర్గాల్లో కొత్త ఆందోళనకు దారితీస్తోంది.




