Botsa Satyanarayana: చంద్రబాబు పాలనపై ప్రజల తిరుగుబాటు సమయం ఆసన్నమైంది

Visakhapatnam: విశాఖపట్నంలో వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 28 Jun 2026 4:49 PM IST
Botsa Satyanarayana
X

Botsa Satyanarayana: చంద్రబాబు పాలనపై ప్రజల తిరుగుబాటు సమయం ఆసన్నమైంది

Visakhapatnam: ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఖరిపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆటవిక పాలన సాగుతోందని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ రైతులకు కష్టాలు తప్పడం లేదని మండిపడ్డారు. ఆదివారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

అమరావతి ప్రాంతంలో జరుగుతున్న అకృత్యాలను రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని బొత్స పటమటపడ్డారు. అక్కడ రైతుల కష్టాలను, వారి అసంతృప్తిని తెలుసుకునేందుకు వెళ్లిన వైసీపీ నేతలతో పాటు రక్షణగా ఉన్న పోలీసులపై కూడా దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. "రాజకీయాల్లో విమర్శలు చేయడానికి అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఇలా భౌతిక దాడులకు తెగబడటం సరైన పద్ధతి కాదు. ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వ్యవహరిస్తోంది. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే టీడీపి ఏకైక ఆలోచనగా మారింది" అని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో సంపద సృష్టిస్తామనే సాకుతో కూటమి ప్రభుత్వం బీచ్‌లలో, ఎయిర్‌పోర్టులలో బార్లను ఏర్పాటు చేయడాన్ని బొత్స తీవ్రంగా తప్పుబట్టారు. విదేశాల సంస్కృతి వేరని, భారతదేశ సంప్రదాయం వేరని హితవు పలికారు. "భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు సరైన దారి లేదు, తాగడానికి నీరు లేదు కానీ అక్కడ బార్ మాత్రం ఏర్పాటు చేస్తున్నారు" అంటూ ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రకు గుండెకాయ లాంటి విశాఖపట్నంలో విలువైన ప్రభుత్వ భూములను పప్పు బెల్లాల తరహాలో నచ్చిన వారికి పంచుతున్నారని ఆరోపించారు.

చంద్రబాబు ప్రభుత్వం అమరావతి పేరిట పెద్ద ఎత్తున దారి దోపిడీకి పాల్పడుతోందని, ఒక వైసీపీ నేతలుగా ఈ అరాచక పాలన తమకు తీవ్ర బాధ కలిగిస్తోందని బొత్స అన్నారు. తాము ప్రతిపాదించిన మూడు రాజధానుల ముసాయిదాకు, వికేంద్రీకరణకే ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అమరావతి పేరిట జరుగుతున్న ఈ దోపిడీని ఖచ్చితంగా అడ్డుకుంటామని భరోసా ఇచ్చారు. అలాగే పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో కేంద్ర ప్రభుత్వం మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తుంటే.. ఏపీలో ఎందుకు ఆ విధానాన్ని తీసుకురావడం లేదని, ఇక్కడి రైతులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. టీడీపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు తిరగబడే సమయం ఆసన్నమైందని ఆయన హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story