Visakhapatnam: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో కలకలం.. 24 గంటల్లో రెండు చోట్ల లీకైన ఉక్కు ద్రవం!
Visakhapatnam: విశాఖ ఉక్కు కర్మాగారంలో వరుస ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఎస్‌ఎంఎస్-2లో, నేడు ఎస్‌ఎంఎస్-1లో ల్యాడిల్‌కు రంధ్రం పడి వేడి ఉక్కు ద్రవం భారీగా నేలపాలైంది.
Visakhapatnam: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో కలకలం.. 24 గంటల్లో రెండు చోట్ల లీకైన ఉక్కు ద్రవం!
Visakhapatnam: విశాఖ ఉక్కు కర్మాగారంలో (Vizag Steel Plant) వరుసగా జరుగుతున్న ప్రమాదాలు కార్మికులను, ప్లాంట్ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే రెండు వేర్వేరు విభాగాల్లో భారీ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
ప్లాంట్ వర్గాల సమాచారం ప్రకారం.. నిన్న ఉక్కు కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్-2 (SMS-2) లో ల్యాడిల్ నుంచి వేడి ఉక్కు ద్రవం ఒక్కసారిగా లీకై భారీగా నేలపాలైంది. ఈ ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే, ఇవాళ ఉదయం 'ఏ' షిఫ్ట్‌లో ఎస్‌ఎంఎస్-1 (SMS-1) టీపీబే విభాగంలో మరో ప్రమాదం సంభవించింది. అక్కడ ద్రవరూప ఉక్కును తీసుకెళ్లే ల్యాడీల్‌కు (Ladle) అకస్మాత్తుగా రంధ్రం పడింది. దీంతో వందలాది డిగ్రీల వేడితో మరుగుతున్న స్టీల్ మెటల్ ద్రవం అంతా ఒక్కసారిగా బయటకు వచ్చి నేలపాలైంది.
నిన్న, ఇవాళ జరిగిన రెండు ప్రమాదాల సమయంలోనూ ద్రవం పడిన ప్రాంతంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కార్మిక సంఘాలు పెద్ద ప్రమాదం నుంచి ఊపిరి పీల్చుకున్నాయి. ఒకవేళ ఆ సమయంలో అక్కడ సిబ్బంది ఉండి ఉంటే ఊహించని ఘోరం జరిగి ఉండేదని కార్మికులు చర్చించుకుంటున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో పదే పదే జరుగుతున్న సాంకేతిక లోపాలు, భద్రతా వైఫల్యాలపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక 'త్రీమెన్ కమిటీ' (Three-Member Committee) ని నియమించింది. ఈ కమిటీ ప్లాంట్‌లో క్షేత్రస్థాయి విచారణ జరుపుతుండగానే, వారి కళ్లముందే వరుసగా ఈ రెండు ప్రమాదాలు జరగడం గమనార్హం. ప్లాంట్‌లో యంత్రాల నిర్వహణ (Maintenance) లోపాలు, పర్యవేక్షణా లోపంపై కార్మిక సంఘాలు మళ్లీ మండిపడుతున్నాయి.




