Pawan Kalyan : మత్స్యకారుల ఆచూకీ కోసం సీఎం, డిప్యూటీ సీఎం రంగంలోకి.!

Pawan Kalyan : విశాఖపట్నం వేదికగా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

G Krishna
Published on: 5 July 2026 11:59 AM IST
Pawan-Kalyan
X

Pawan-Kalyan

Pawan Kalyan : విశాఖపట్నం వేదికగా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో తీరానికి తిరిగి వస్తుండగా, మరికొద్ది గంటల్లో ఒడ్డుకు చేరుకుంటారనే సమయంలో వీరి ఆచూకీ లభించకుండా పోయింది. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపి, రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరం చేయాలని ఆదేశించారు.

యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు: సీఎం చంద్రబాబు ఆదేశం

ప్రస్తుతం కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, మత్స్యకారులను రక్షించేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కోస్టుగార్డు నౌకలతో సముద్రంలో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, సముద్రంలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని మెరైన్ ఐజీపీ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌లను ఆదేశిస్తూ, తాజా అప్‌డేట్స్‌ను తనకు నిరంతరం నివేదించాలని సీఎం స్పష్టం చేశారు.

నేవీ, కోస్టుగార్డు సేవలను ఉపయోగించుకోండి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

మత్స్యకారుల గల్లంతుపై అమరావతి నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించారు. ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు, తీరానికి సమీపంలోకి వచ్చాక ఆచూకీ దొరకకుండా పోయారని కలెక్టర్ వివరించారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్.. మెరైన్ పోలీసులు, కోస్టు గార్డుతో పాటు భారత నౌకాదళం (నేవీ) సహకారం కూడా తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే నేవీకి చెందిన హెలికాప్టర్లతో గాలింపు చర్యలు ప్రారంభమైనట్లు అధికారులు డిప్యూటీ సీఎంకు తెలిపారు.

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోం మంత్రి అనిత

మరోవైపు హోం మంత్రి వంగలపూడి అనిత విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్పీ, , మత్స్య శాఖ అధికారులతో ఫోన్‍లో మాట్లాడి సహాయక చర్యలను సమీక్షించారు. యుద్ధప్రాతిపదికన కోస్టుగార్డ్ నౌకలను రంగంలోకి దించి గాలింపు ముమ్మరం చేయాలన్నారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, కూటమి ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా నిలిచి, వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి శాయశక్తులా కృషి చేస్తుందని ప్రభుత్వం తరఫున గట్టి భరోసా ఇచ్చారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story