Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ!
Vallabhaneni Vamsi: గన్నవరం మెట్ట ప్రాంత రైతులకు పట్టిసీమ ద్వారా సాగునీరు అందించాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లేఖ రాశారు.
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ!
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. గన్నవరం నియోజకవర్గంలోని డెల్టా ఆయకట్టు రైతులతో పాటు మెట్ట ప్రాంత రైతులకు కూడా పోలవరం కుడి కాల్వ ద్వారా సాగునీరు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.
గత 11 ఏళ్లుగా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించడం వల్ల కృష్ణా డెల్టా రైతులకు ఎంతో మేలు జరిగిందని వంశీ పేర్కొన్నారు. 2015లో తాను గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పోలవరం కుడి కాల్వ సమీపంలోని మెట్ట ప్రాంత గ్రామాలకు కూడా నీటిని వినియోగించుకునే అవకాశం కల్పించాలని సీఎం చంద్రబాబును కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని లేఖ ద్వారా గుర్తుచేశారు.
అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతో తన సొంత ఖర్చులతో బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, విజయవాడ గ్రామీణ మండలాల్లోని 36 ప్రాంతాల్లో 500కు పైగా విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేశానని తెలిపారు. వీటి ద్వారా రైతులకు సాగునీరు అందించడంతో పాటు చెరువులకు తాగునీటి సౌకర్యం కల్పించామని, గత పదేళ్లలో 9 సంవత్సరాల పాటు నిరంతరంగా మెట్ట ప్రాంతాలకు పట్టిసీమ నీరు అందించగలిగామని వివరించారు.
అయితే ఈ ఏడాది నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసుల బందోబస్తుతో ఆ మోటార్లను నిలిపివేస్తున్నారని వంశీ ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మోటార్లు బంద్ చేయడంతో మెట్ట ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు, అనంతరం జగన్ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని కొనసాగించాయని గుర్తు చేస్తూ.. ప్రస్తుతం కూడా రైతుల ప్రయోజనాల దృష్ట్యా పట్టిసీమ నీటిని మెట్ట ప్రాంతాలకు అందించేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రిని వల్లభనేని వంశీ కోరారు.




