Sapta Sindhu: దేవాలయాలు కేవలం పూజా కేంద్రాలు కావు.. ప్రాచీన సైన్స్ హబ్‌లు: దేవాదాయ శాఖ కమిషనర్!

Sapta Sindhu: విజయవాడ ఎస్‌పీఏ వేదికగా హెచ్‌ఎంటీవీ, ది హన్స్ ఇండియా ఆధ్వర్యంలో 'సప్తసింధు' సదస్సు.

Arun Chilukuri
Published on: 1 Aug 2026 3:34 PM IST
Sapta Sindhu
X

Sapta Sindhu: దేవాలయాలు కేవలం పూజా కేంద్రాలు కావు.. ప్రాచీన సైన్స్ హబ్‌లు: దేవాదాయ శాఖ కమిషనర్!

Sapta Sindhu: భారతీయ కాలాతీత దేవాలయాల వెనుక ఉన్న శతాబ్దాల నాటి ప్రాచీన ఇంజనీరింగ్ అద్భుతాలు, వాస్తు శిల్ప కళ మరియు శాస్త్రీయ సూత్రాలపై యువతకు అవగాహన కల్పించే లక్ష్యంతో 'సప్తసింధు' సదస్సు నిర్వహించబడింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'ది హన్స్ ఇండియా' మరియు 'హెచ్‌ఎంటీవీ' సంయుక్త నిర్వహణలో విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ వేదికగా ఈ విశిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ సదస్సులో దేవాదాయ శాఖ అధికారులు, రాజకీయ ప్రముఖులు, సామాజిక వేత్తలు, పండితులు మరియు ఆర్కిటెక్చర్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశ సాంస్కృతిక స్థిరత్వం, చరిత్ర, ఆధ్యాత్మికత మరియు శాస్త్రీయ దృక్పథాన్ని భావితరాలకు అందించడమే ధ్యేయంగా ఈ ఉపన్యాస శ్రేణి కొనసాగింది.

ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సామాజిక వేత్త యామిని సాధినేని సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన సంస్కృతి వైభవాన్ని నేటి తరం అనుసరించేలా తీర్చిదిద్దడం ఒకటైతే, దేవాలయ నిర్మాణాల్లోని విశేష ఇంజనీరింగ్ అద్భుతాలను భవిష్యత్ తరాలకు అందించడం మరో ముఖ్య లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు.

కార్యక్రమంలో ముఖ్య వక్తగా ప్రసంగించిన దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ దేవాలయాల ప్రాముఖ్యతను వివరించారు. "దేవాలయాలు అంటే కేవలం పూజలు, ప్రార్థనలు చేసే ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కావు; అవి సాంప్రదాయ విద్యకు, మన సంస్కృతీ సంప్రదాయాలకు 'నాలెడ్జ్ హబ్‌లు'. ప్రతీ దేవాలయ నిర్మాణం ఒక ప్రత్యేకమైన కేస్ స్టడీ. Simhachalam టెంపుల్ గంగ రాజుల వెసార స్టైల్, విజయనగర, చాళుక్యుల ద్రావిడ నిర్మాణ శైలుల కలయికకు నిదర్శనం. అలాగే మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం ఆర్కిటెక్చర్ అత్యున్నత శిఖరాలకు సాక్ష్యం. ఆర్కిటెక్చర్ విద్యార్థులందరూ ఈ ఆలయాలను సందర్శించి అధ్యయనం చేయాలి." అని రామచంద్ర మోహన్ అన్నారు.

భారతీయ వారసత్వ వైభవాన్ని చాటిచెప్పేలా ఇటువంటి గొప్ప వేదికను ఏర్పాటు చేసినందుకు ది హన్స్ ఇండియా, హెచ్‌ఎంటీవీ యాజమాన్యాలకు ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story