Ram Mohan Naidu: ఇచ్ఛాపురం ఇక మూలన కాదు.. ముఖద్వారం కాబోతోంది!

Ram Mohan Naidu: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ సాకారమవ్వడంపై కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

Arun Chilukuri
Updated on: 1 Jun 2026 2:34 PM IST
Ram Mohan Naidu
X

Ram Mohan Naidu: ఇచ్ఛాపురం ఇక మూలన కాదు.. ముఖద్వారం కాబోతోంది!

Ram Mohan Naidu: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన విశాఖపట్నం రైల్వే జోన్ (దక్షిణ కోస్తా రైల్వే) ఎట్టకేలకు సాకారమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అన్నారు. ఎన్నో పోరాటాలు, సుదీర్ఘ నిరీక్షణ ఫలితంగానే ఈ కొత్త రైల్వే జోన్‌ను సాధించుకోగలిగామని ఆయన స్పష్టం చేశారు. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు ఖరారైన నేపథ్యంలో.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌ వద్ద నిర్వహించిన భారీ సంబరాల్లో కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, కూటమి శ్రేణులతో కలిసి ఆయన కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం జరిగిన సభలో రామ్మోహన్ నాయుడు కీలక ప్రసంగం చేశారు.

రైల్వే అభివృద్ధి చెందితేనే ఉత్తరాంధ్ర ప్రాంతం పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతోనే తాము నిరంతరం కృషి చేశామని కేంద్రమంత్రి తెలిపారు. "కొత్త రైల్వే జోన్‌ ఏర్పాటు కోసం పార్లమెంట్‌లో ఉత్తరాంధ్ర గొంతుకగా నిరంతరం మాట్లాడాను. ఈ జోన్ అందుబాటులోకి రావడం వల్ల ఏటా లక్షలాది మంది ప్రయాణికులకు రవాణా సౌకర్యాలు మెరుగవుతాయి. కొత్త రైళ్లు, మెరుగైన మౌలిక సదుపాయాలు ఈ ప్రాంతానికి రాబోతున్నాయి" అని రామ్మోహన్ నాయుడు వివరించారు.

ఒకప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో చివరి మూలన ఉండే ప్రాంతంగా చూసిన ఇచ్ఛాపురాన్ని, ఇకపై రాష్ట్ర ముఖద్వారంగా మారుస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని రైల్వే సమస్యలపై ఆయన స్పష్టతనిచ్చారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌ను రూ.12 కోట్ల నిధులతో అత్యాధునికంగా అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఇచ్ఛాపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) సమస్యకు ప్రస్తుత కూటమి (TDP-JSP-BJP) ప్రభుత్వంలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని నొక్కి చెప్పారు.

కేవలం ఫ్లైఓవర్‌ మాత్రమే కాకుండా, స్థానిక ప్రజల రాకపోకల ఇబ్బందులను తొలగించేందుకు రైల్వే అండర్‌ బ్రిడ్జిల (RUB) ఏర్పాటుపైనా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్షను గౌరవించి రైల్వే జోన్ సాధనలో సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజల తరఫున కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story